మేలిమి బంగారం మన సంస్కృతి.

మేలిమి బంగారం మన సంస్కృతి.

శ్లోll

అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః

తే హరేః ద్వేషిణః పాప్మాః ధర్మార్థం జన్మ యద్ధరేః.

.

తే.గీ.ll

చేయ వలసెడి కర్మంబు చేయఁ బోక.

కృష్ణ కృష్ణంచు జపియించుకృష్ణ భక్తుఁ

డరయ దేవుని శత్రువు. పరమ పాపి.

ధర్మ సంస్థాపనకె జన్మ దాల్చె హరియె. 

.

భావము:-

స్వధర్మ కర్మలను విడిచిపెట్టి కేవలము కృష్ణ కృష్ణ యనుచు కూర్చొనువారు శ్రీహరిని ద్వేషించు వారు. పాపులు అగుదురు. ఎందుచేతనంటే ఆ హరి యవతారములెత్తినది ధర్మ రక్షణమునకే గాని ఊరకనే కాదు కదా! 

స్వధర్మానికి దూరముగా ఉంటూ భగవన్నామ జపము చేయుచూ కాలము వ్యర్థపుచ్చుట యుక్తము కాదని గ్రహించ వలెను. స్వధర్మాచరణము చేయుచూ భగవాన్నామ స్మరణ చేయుచూ కర్మఫలమా పరమాత్మకే అర్పింప దగును.

ఈ క్రింది శ్లోకము మేలిమి బంగారం మన సంస్కృతి 29. గా చెప్పఁబడి యున్ననూ ఇచ్చట పునరుక్తమైనది.

.

శ్లో:-

పరోపకారాయ ఫలంతి వృక్షా: 

పరోపకారాయ దుహంతి గావ:

పరోప కారాయ వహంతి నద్య: 

పరోపకారార్థమిదం శరీరం.

.

గీ:-

పరుల కొఱకని వృక్షము ఫలములిచ్చు.

పరుల కొఱకని ధేనువు పాల నిచ్చు.

పరుల కొఱకని నదులిల పారుచుండు.

పరులకుపకారములుఁ జేయఁ బ్రతుక వలయు.

.

భావము:-

చెట్లు పరులకుపకరించుట కొఱకే ఫలించుచుండును. ఆవులు పరులకుపకరించుట కొఱకే పాలనిచ్చును. నదులు పరుల కుపకరించుట కొఱకే ప్రవహించు చుండును. పరుల కుపకారము చేయుటయే యీ శరీరము కలిగి యున్నందులకు ప్రయోజనము.

పరోపకార బుద్ధి మనలో మనమేమీ తక్కువ కాదు అనే విధంగా చేస్తూ ఉండవలెను.


x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!