చాటువు .

చాటువు ."చాటు" అనే సంస్కృత పదం నుంచి వచ్చిన పదం.

చాటుః అంటే సంస్కృత నిఘంటువు ప్రకారం "ప్రియవాక్యం" అని కనిపిస్తుంది. 

కవులు రాజులను ఇష్టం కొద్దీ పొగిడే పొగడ్తలన్నమాట. అయితే చాటువులన్నీ ప్రియవాక్యాలు కావు. తిట్ల చాటువులు, బాధతోనో, కోపంతోనో, చిరాకుతోనో పొంగుకొచ్చిన చాటువులు అనేకం ఉన్నాయి. 

పద్యాల ప్యారడీలతో ప్రఖ్యాతి గాంచిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి (జరుక్ శాస్త్రి) ఒక తెలుగు అనుష్టుప్పును చెప్పారు. ఆ పద్యం ఇందులో ఉంది. అది ఇది:

ఒక కాని ఒకే కాని 

రెండు కానులు అర్థణా

మూడు కానులు ముక్కాని

నాలుగు కానులొకణా

అణాలు, కానుల లెక్కలు తెలిసిన వారిని ఈ పద్యం మెప్పిస్తే, తెలియని ఈ తరం వారికి ఆ లెక్కలు తెలియపరిచి మరీ మెప్పించి ఒప్పిస్తుంది.

.

శ్రీశ్రీ సిరిసిరిమువ్వా శతకంలో చెప్పిన సరదా పద్యాల్లోని చాటుత్వం కూడా ప్రస్తావించారు. ఆ వంకన ఆ పద్యాలు కొన్ని చదువుకుని నవ్వుకునే అవకాశం కల్పించారు.

ఎప్పుడు పడితే అప్పుడు 

కప్పుడు కాఫీనొసంగ కలిగిన సుజనుల్ 

చొప్పడిన ఊరనుండుము

చొప్పడకున్నట్టి ఊరు చొరకుము మువ్వా!

ఈ రోజులలో ఎవడికి

నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియాల్

కారాలు, తెగ బుకాయి-

స్తే రాజ్యాలేలవచ్చు సిరిసిరి మువ్వా!!

.

.తెనాలి రామలింగ కవి ఒక్క "న" అక్షరంతో చెప్పిన ఏకాక్షర చాటు పద్యం చూడండి:

నాని నీనాను నేనును నాని నాను

నాన నేనును నిన్నూని నున్ననన్ను

నెన్న నున్నను నిన్నెన్న నున్ననాన

నిన్ననే నన్ననున్న నన్నెన్ను నన్ని

అర్థం నన్నడక్కండి. ఏ జొన్నవిత్తుల రామాలింగేశ్వర రావు గారి లాంటి వారో, రాళ్లబండి కవితా ప్రసాద్ గారో చెప్పాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!