అన్నమయ్య 'పద’ సేవ --------

అన్నమయ్య 'పద’ సేవ --------

.

పాండవులను శ్రీ కృష్ణుడు ఆదుకొన్న సందర్భాలు ఒకటా రెండా ! శ్రీ కృష్ణుడు లేని పాండవులు మొక్కలు కాలేని విత్తనాలు. పాండవులను తీర్చి దిద్దింది కృష్ణుడు. కృష్ణుడు నిర్యాణము చెందినప్పుడు అర్జునుడు ఏడుస్తూ చెప్పిన ఈ పద్యం సుప్రసిద్ధం.

''మన సారధి/మన సచివుడు,

మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్ ,

మన విభుడు, గురుడుదేవర

మనలను దిగనాడి చనియె మనుజాధీశా!''

అర్జునుడు ద్రౌపదిని పెండ్లాడింది కృష్ణుని కటాక్షం వల్ల. ఇంద్రుని నుండి గాండీవాన్ని గ్రహించింది కృష్ణుని వల్ల. పాండవులు రాజసూయ యాగం చేయగలిగింది కృష్ణుని సహాయం వల్ల. పాంచాలి మనం కాపాడాడు. ముక్కోపియైన దుర్వాసుని శాపంనుండి రక్షించాడు. అర్జునునికి పాశుపతాస్త్రం ఇప్పించాడు. ఇలా కృష్ణుడు చేసిన సహాయాలు ఎన్నెన్నో. అందుకే కవి పాండవవరదా అని పాడరె అన్నాడు.

.

గోవింద గోవింద అని కొలువరె

గోవింద గోవిందయని కొలువరె

గోవిందాయని కొలువరె

1.హరియచ్యుతాయని యాడరె

పురుషోత్తమాయని పొగడరె

పరమపురుషాయని పలుకరె

సిరివరయనుచును జెలగరె జనులు

2. పాండవవరదా అని పాడరె

అండజవాహను కొనియాడరె

కొండలరాయనినే కోరరె

దండితో మాధవునినే తలచరే జనులు

3.దేవుడు శ్రీవిభుడని తెలియరె

సోవల యనంతుని చూడరె

శ్రీవెంకటనాథుని చేరరె

పావనమైయెపుడును బ్రదుకరె జనులు 

.

ఓ ప్రజలారా ! మీరు గోవిందా ! గోవిందా అంటూ గోవిందుని కొలవండి.

1. ఓ ప్రజలారా ! హరీ ! అచ్యుతా ! అంటూ ఆడండి. పురుషోత్తమా అని స్వామిని పొగడండి. పరమపురుషా ! అని స్వామిని పలుకరించండి. లక్ష్మీ దేవికి ఇష్టమైన వాడా అంటూ శబ్దం చేయండి.

2. ఓ ప్రజలారా !పాండవులకు వరములు అనుగ్రహించిన వాడా అంటూ పాడండి. గరుత్మంతుడు వాహనముగా కలిగిన వాడా ! అని పొగడండి. కొండల రాజు అంటూ ఆయనను కోరండి. గొప్పగా మాధవుడిని తలుచుకోండి.

3. ఓ ప్రజలారా ! ఈ వేంకటేశుడు లక్ష్మీదేవి భర్త అని తెలుసుకోండి. ఎదుట ఉన్న అనంతుని చూడండి. శ్రీ వేంకట నాథుని చేరటానికి ప్రయత్నించండి . ఎప్పుడూ పవిత్రంగా బతకండి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!