యీ సుకవికి యేమియయ్యెదవు సుందరి!

యీ సుకవికి యేమియయ్యెదవు సుందరి!

(శ్రీ భైరవభట్ల కామేశ్వర రావుగారి విశ్లేషణ.)

ఒకే సన్నివేశం అనేకమందికి అనేకరకాలైన అనుభూతిని కలిగించవచ్చు కూడా! 

ఈ విషయాన్నే చమత్కారంగా సూచించే శ్లోకమొకటి రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో ఉదాహరించాడు. 

కాని మనం మాట్లాడుకోవలసింది తెలుగు పద్యాల గురించి కదా! 

అంచేత అలాంటిదే ఒక తెలుగు పద్యాన్ని ఉదాహరిస్తాను. 

శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు ఒక భువనవిజయ సభలో చెప్పిన పద్యమిది. 

ఒక అందమైన అమ్మాయిని చూస్తే, ఒక వేదాంతికి, ఒక నవయువకునికి, ఒక పిల్లవానికీ, అలాగే మీలాంటి ఒక కవికీ, ఎలాంటి అనుభూతులు కలుగుతాయో - ఒక పద్యంలో వర్ణించమన్నారతన్ని. అప్పుడతను ఆశువుగా చెప్పిన పద్యమిది:

"ఒకనికి మట్టిదిమ్మవు, మరొక్కనికీ వపరంజిబొమ్మ, విం

కొకనికి నమ్మవౌదు, మధురోహల ఊయలలూగునట్టి యీ

సుకవికి యేమియయ్యెదవు సుందరి! యీ కవితాకళామయా

త్మికజగతిన్ రసజ్ఝరుల దేల్చెడి ముద్దులగుమ్మవౌదువా!

.

వేదాంతికి మట్టిదిమ్మ, నవయువకునికి అపరంజిబొమ్మ, 

పిల్లవానికి అమ్మ. ఎవరి మానసిక స్థితికి తగ్గట్టువారు స్పందిస్తారు.

ఈ పద్యంలో కవి స్పందనకున్న ప్రత్యేకత గమనించారా!

తక్కిన ముగ్గురికీ ఆమె ఒక వ్యక్తిగా నేరుగా ఒకో రకమైన అనుభూతిని కలిగిస్తోంది. కానీ కవికి ఆమె భౌతిక వ్యక్తిత్వంతో పనిలేదు. కవితాలోకంలో రసజ్ఝరుల తేల్చే

ఒక ప్రేరణ. అది శృంగార రసమైనా కావొచ్చు, వాత్సల్యమైనా కావచ్చు,

మరేదైనా కావచ్చు!

స్పందించే హృదయంతో పాటుగా, కావ్యాన్ని తగిన విధంగా చదవగలిగే ప్రజ్ఞ కూడా సహృదయునికి అవసరం. ఇది అనేక కావ్యాలనూ, వాటి వ్యాఖ్యానాలనూ చదవడం ద్వారా పెంపొందించుకోవచ్చు. ప్రాచీన పద్యకావ్యాలను చదివే అలాంటి ప్రజ్ఞ యీనాటి చాలామందిలో కొరవడింది.

అందుకే వాటిలోని రసం నేటి పాఠకులకు అందని ద్రాక్షయిపోయింది!

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!