ప్రద్యుమ్నుడి పెళ్లి ప్రయత్నాలు..అను ఒక పెళ్ళికాని ప్రసాద్ కధ.!

ప్రద్యుమ్నుడి పెళ్లి ప్రయత్నాలు..అను ఒక పెళ్ళికాని ప్రసాద్ కధ.!

(“కాబోయే పెళ్ళికొడుకు లెవరు కాబోయే మామగారితో హాస్య సంభాషణ చేయరాదు. చేసినచో పెళ్లి చేసుకొనే అవకాశం కోల్పోయెదరు.”) 

.

1967 లో ప్రద్యుమ్నుడి అగ్రజుడి వివాహం అయింది. వారి అన్నయ్య పెళ్ళిలోనే ఇద్దరు ప్రద్యుమ్నుడిని చూసి ముచ్చట పడ్డారు. (అబ్బే అమ్మాయిలు కాదు, వారి తండ్రులు). ప్రద్యుమ్నుడు మహానందపడ్డాడు. ఫరవాలేదు, తనకీ గిరాకీ ఉందని సంబరపడ్డాడు. వాళ్ళలో ఒకాయన మరీ తొందర పడి, పెళ్లి అయిన మూడో రోజునే ప్రద్యుమ్నుడి ఇంటికి మాట్లాడటానికి వచ్చేసి, ప్రద్యుమ్నుడి నాన్నగారితో మాట్లాడారు. ప్రద్యుమ్నుడి తోటి కూడా మాట్లాడారు. జోర్హాట్ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? లాంటివి అడిగారు. ఉత్సాహంగా ప్రద్యుమ్నుడు, రైలు రూటు బాగా విపులంగా చెప్పాడు.

"భీమవరం నుండి నిడదవోలు వెళ్ళవలెను. అక్కడ నుండి కలకత్తా వెళ్ళు మద్రాస్ మెయిల్ ఎక్కవలెను. సుమారు ఇరవై ఏడు గంటల తరువాత హౌరా చేరెదము. అక్కడ నాల్గైదు గంటలు విశ్రాంతి గదులలో విశ్రాంతి తీసుకొనవలెను. ఆ తరువాత సమస్తిపూర్ ఎక్స్ ప్రెస్ లో బరౌనీ చేరవలెను. బరౌనిలో ఒక నాలుగైదు గంటలు ప్లాట్ఫారం పొడుగు, వెడల్పు కొలవవలెను. ఆ తరువాత తీన్సుకియా మెయిల్ ఎక్కవలెను. ఆ తరువాత న్యూబంగైగాం లో దిగి బ్రాడ్ గేజ్ నుంచి మీటర్ గేజ్ రైలుకు మారవలెను. సుమారు 16 గంటల తరువాత మరియాని స్టేషన్ లో దిగవలెను. అక్కడనుండి బస్ లో సుమారు ఇరవై కిమీలు ప్రయాణించి జోర్హాట్ చేరవలెను. జోర్హాట్ బస్ స్టాండ్ నుండి రిక్షా ఎక్కవలెను. సుమారు ఏడు కిమీలు తరువాత మా లాబొరేటరీ కాలనీ గేటు, అక్కడ నుంచి ఇంకో అరకిమి ప్రయాణించి (రిక్షాలోనే) మా గృహమునకు చేరవలెను" అని.

ఇంత విపులంగా చెప్పిన తరువాత ఆయన అన్నారు “అంటే సుమారు మూడు నాలుగు రోజులు పడుతుందన్నమాట”. ప్రద్యుమ్నుడు మందస్మిత వదనారవిందుడై, “అవునండి రైళ్ళు లేట్ అవడం సహజమే కదా అప్పుడప్పుడు ఇంకో అర రోజు పట్టవచ్చునండి” అని చెప్పాడు. ఆయన గంభీర వదనుడై ప్రద్యుమ్నుడి కేసి తీక్షణంగా చూసి ఊరుకున్నాడు. “కలకత్తా నుంచి విమానంలో వెళ్ళవచ్చు. డకోటా విమానాలు నడుస్తాయి. కలకత్తా నుంచి గౌహతి, అక్కడనుండి జోర్హాట్ వెళ్ళతాయి. గౌహతి హాల్ట్ తో కలిపి సుమారు రెండు గంటలు మాత్రమే పడుతుంది అని కూడా చెప్పాడు ప్రద్యుమ్నుడు. ఎందుకైనా మంచిదని, విమానం టికట్టు ధర నూట అరవై ఐదు రూపాయలు మాత్రమే, అంటే నా జీతంలో సుమారు ఐదవ వంతు మాత్రమే అని గొప్పగా కూడా చెప్పాడు. ఆయన ఇంకో చిరునవ్వు వెలిగించారు తన మొహంలో.

నాల్గైదు రోజుల తరువాత పెళ్ళిలో ముచ్చట పడ్డ రెండో ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా అదే ప్రశ్న వేశాడు. అంత విపులంగానూ ప్రద్యుమ్నుడు ఉపన్యాసం ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మామగారి పీఠము ఎక్కుతారు, ఇంకో నాల్గైదు నెలల్లో “ప్రద్యుమ్నుడు పెళ్లికొడుకాయెనే” అనే పాట ఇంట్లో వినిపిస్తుందని సంబర పడ్డాడు ప్రద్యుమ్నుడు.

శలవు లేనందున ప్రద్యుమ్నుడు మర్నాడే జోర్హాట్ బయల్దేరి వచ్చేశాడు. బయల్దేరే ముందు నాన్నగారు చెప్పారు ప్రద్యుమ్నుడికి “మేము వెళ్ళి చూసి వస్తాము. నచ్చితే ఫోటో పంపుతాము. వీలు చూసుకొని వస్తే ఏదో ఒకటి నిశ్చయం చేసుకోవచ్చు” అని. ప్రద్యుమ్నుడు అమితానంద హృదయారవిందుడయ్యాడని వేరే చెప్పఖ్ఖర్లేదు కదా.

జోర్హాట్ తిరిగి వచ్చిన ప్రద్యుమ్నుడి మనసు కాబోయే ఇద్దరి మామగార్ల ఇంటిలోని కాబోయే భార్యామణుల చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. నెలయింది, రెండు నెలలయ్యాయి. ఫోటో కాదు గదా ఆవిషయమై ఉత్తరం కూడా రాలేదు తండ్రి గారి వద్ద నుంచి. ఎప్పుడూ ఉత్తరాలు వ్రాయడానికి బద్ధకించే ప్రద్యుమ్నుడు, తరువాతి రెండు నెలల్లో నాలుగు ఉత్తరాలు వ్రాశాడు తండ్రికి. “ఇక్కడ నేను క్షేమం. అక్కడ మీరు డిటో అని తలుస్తాను. అన్ని విశేషములతో వెంటనే వివరంగా జవాబు వ్రాయవలెను” అంటూ. వివరంగా కాదు కదా క్లుప్తంగా కూడా ఏ విశేషము తెలియపరచ బడలేదు.

ఆత్రుత పట్టలేక ప్రద్యుమ్నుడు పెద్దక్క గారికి ఉత్తరం వ్రాసాడు, ...

వెంటనే జవాబు రాలేదు కానీ ఒక నెల తరువాత ఉత్తరం వచ్చింది అక్కగారి వద్ద నుంచి. ఆవిడ ఉ.కు. లు (ఉభయ కుశలోపరి) అన్నీ వదిలి డైరెక్టుగా రంగంలోకి వచ్చారు. “అడ్డగాడిదా, ఏబ్రాసి మొహం గాడా, బుద్ధి ఉందా నీకు అప్రాచ్యపు వెధవా. ..వాళ్లకి ఏం చెప్పావురా నువ్వు? భీమవరం నుంచి జోర్హాట్ వెళ్ళడానికి ఐదు రోజులు పడుతుందా? రైలు, కారు, బస్సు, రిక్షా, చివరికి ఒంటెద్దు బండి కూడా ఎక్కాలని చెప్పావా? ఎవడిస్తాడురా పిల్లని నీకు? కంచర గాడిదా. పెళ్ళిలో చూసిన ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. మధ్యవర్తి ద్వారా కనుక్కొన్నాడు నాన్న. అంత దూరం పిల్లని పంపటానికి వాళ్ళకి ఇష్టం లేదుట. ఎప్పుడైనా పిల్లని చూడాలనిపించినా లేక ఏ కష్టమైనా పిల్లకి వస్తే, వెళ్ళి రావడానికైనా పది రోజులు ప్రయాణాలు మా వల్ల కాదు అని చెప్పారుట మధ్యవర్తికి. అంతే కాదు ఈ వార్త శరవేగంగా విస్తరిస్తోంది. గోదావరి జిల్లాలలో మంచి కుటుంబం, ఆచార సాంప్రదాయాలు ఉన్న వాళ్లెవరు నీకు పిల్ల నిచ్చేందుకు సిద్ధంగా లేరు అని మధ్యవర్తి నొక్కి వక్కాణించాడుట. ఇప్పుడు నాన్న మధ్యవర్తిని పక్క జిల్లాలకి పంపుతున్నాడుట. నీకు పెళ్లి సంబంధాలు వెతకటానికి, ఆలస్యం అయితే వాళ్లకి కూడా ఈ వార్త చేరిపోతుందనే భయంతో. చుంచు మొహం వెధవా, ఆ నోటి దూల తగ్గించుకోరా అంటే విన్నావా? అనుభవించు.” అని ఆశీర్వదిస్తూ వ్రాశారు.

పాపం ప్రద్యుమ్నుడు హతాశుడయ్యాడు. డైరీలో వ్రాసుకున్నాడు. “కాబోయే పెళ్ళికొడుకు లెవరు కాబోయే మామగారితో హాస్య సంభాషణ చేయరాదు. చేసినచో పెళ్లి చేసుకొనే అవకాశం కోల్పోయెదరు.” ప్రద్యుమ్నుడు ధీరోదాత్తుడు కాబట్టి ధైర్యంగా సహనం వహించి “ఏడ తానున్నాదో నా శశిరేఖ, జాడ తెలిసిన చెప్పి పోవా” అని రాగం తీయకుండానే పాడుకోవడం మొదలు పెట్టాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!