శ్రీకాళహస్తీశ్వర మహత్యం,ధూర్జటి,పరమశివుడు-(3).!

శ్రీకాళహస్తీశ్వర మహత్యం,ధూర్జటి,పరమశివుడు-(3).!

.

మ|| నిను సేవింపగ నాపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,

జనమాత్రుండననీ, మహాత్ము డననీ, సంసార మోహంబు పై

కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ

చ్చిన రానీ, యవి నాకు భూషణములే, శ్రీకాళహస్తీశ్వరా! 

.

తా|| ఈశ్వరా! నేను నిన్ను సేవించుచుండగా, నాకు కష్టాలే రానీ, 

సుఖాలే రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, 

సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహచారము

నన్ను క్రుంగదీయనీ, లేక మంచియే చేయనీ అవియన్నియు 

నాకు ఆభరణముల వంటివే యగును. 

నీ పాదసేవ చేయుచున్న నాకు అన్నియు 

నీ యనుగ్రహములు గానే కనిపించును.

.

శా|| ఏ వేదంబు పఠించె లూత? భుజంగ బే శాస్త్రముల్ సూచె దా

నే విద్యాభ్యసనం బొనర్చెగరి; చెం చే మంత్ర మూహించె? బో

ధావిర్భావ నిదానముల్ చదువు లయ్యా? కావు; నీ పాద సం

సేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా! 

.

తా|| ప్రాణికోటులకు మోక్షము గలుగుటకు నీ పాదములు సేవించు భక్తి 

యొక్కటియే కారణమగును గాని, చదువులెన్ని చదివినను జ్ఞానమును, మోక్షమును గలిగించునా?

ఎంతమంది చదివినవారు లేరు? వారందరికిని జ్ఞానము గలిగినదా? 

మోక్షము కలిగినదా? 

నీ దయచే మోక్షము నొందిన సాలెపురుగు ఏ వేదము చదివినది? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చినది?

ఎరుకలవాడే మంత్రజపము చేసినాడు? 

వీరందరును ముక్తినొందుటకు చదువులే కారణమైనవా?

.

.

పూర్వగాథలు

1. పూర్వము అర్జునుడు పాశుపతాస్త్రము కొఱకు తపము చేయుచూండగా శివుడు కిరాతరూపములో అతనిని పరీక్షించుటకు పందిని తరుముకొని వచ్చెను. వారిద్దరును ఒకేసారి పందిని కొట్టిరి. అది చచ్చెను. దానికై యిద్దరును యుద్దమూడిరి.

.

2. ఒక భక్తునికి రాజసన్మనాము చేయించవలెనని శివుడాతనికి పద్యము వ్రాసియిచ్చి రాజసభలో చదువుమనెను. “కేశపాశము సహజగంధ” మని అందులోనుండెను. నత్కీరుడును ఆస్థానకవి, దాని నాక్షేపించెను. అపుడు శివుడు తాను కవి వేషముతో వెళ్ళి, ఆ పద్యములో తప్పేమి యని యడిగెను. కేశములకు సహజముగా సువాసన యున్నదనుట, కవిసమయము కాదని యాక్షేపించెను. శివుడు మూడవ కన్ను చూపగా నత్కీరుడు “నీవు తలచుట్టును కన్నులు పెట్టుకొన్నను తప్పు తప్పే” యని మొండిగా వాదించి శాపము నొందెను.

.

3. ఒక భక్తుడు శివుని బూజించుచుండగా తండ్రి వద్దనెను. అతడు మానలేదు. తండ్రి శివలింగమును తన్నెను. కొడుకు కోపముతో తండ్రిని జంపెను.

.

4. ఒక శివభక్తురాలి యింటికి శివుడు విప్రవేషమున వచ్చి భోజనము నడిగెను. ఆమె, శివప్రసాదమిది, పారవేయకుండ తినుమని పెట్టెను. అతడా పదార్థాములు రుచిగాలేవని విడిచిపెట్టగా, శివప్రసాదమును దిరస్కరించినాడను కోపముతో రోకలి పుచ్చుకొని విప్రుని బాదినది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!