స్వాతి కిరణం!

స్వాతి కిరణం!

.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన వాడు గురువు. తల్లిదండ్రులను గురువును దైవంగా భావించాలి. ఇది మన సాంప్రదాయం. శిష్యులకు మార్గదర్శకుడు గురువు. తాము చూపిన మార్గంలో ప్రజ్ఞాపాటావాలలో తమను అధిగమిస్తే గురువుకు అంత కంటే గర్వకారణం ఇంకేముంది..ప్రతిభ ఒకరి స్వంతం కాదు.. ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని ప్రోత్సహించాలి..దానికి పదును పెట్టాలి..కొత్తతరానికి పాత తరం దారి చూపాలి..దారి ఇవ్వాలి.. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో గొప్పతనం ఉంది.. కానీ శిష్యుల ఉన్నతిని కోరని గురువులు, తమని మించి పోతారనే భావనతో శిష్యుల భవిష్యత్తును సమాధి చేస్తారు.. శిష్యుల ప్రజ్ఞను తమ ప్రగతికి సోపానంగా మార్చుకునే గురువులూ ఉన్నారు.. వారు ఏకలవ్యుని బొటన వ్రేలుని గురుదక్షిణ కోరిన ద్రోణుడికి ప్రతి రూపాలు.. ఆ కోవకి చెందిన సంగీత విద్వాంసుడు అనంత రామశర్మ.. బాల మేధావి గంగాధరం..గంగాధరాన్ని మాతృభావంతో చేరదీసే అనంతరామశర్మ భార్య.. వీరి మధ్యనడచిన కథ స్వాతికిరణం

.

ఏ విధంగా చూసినా ఇది చాలా గొప్ప సినిమా..తెలుగు సినిమా లలోనే కాదు యావత్తూ సినిమాలను ఎంతగా కాచి వడపోసి ఆణిముత్యాలని ఏ కొద్ది పాటి సినిమాలను ఏరినా ఈ సినిమాకు స్ధానం దక్కాలి..ఏదో దురభిమానంతోనో లేదా ఇతర సంకుచితిత్వంతోనో చెప్పడం కాదు. కథాంశం, పాత్రల రూపకల్పన, నటీనటుల అద్వీతయ నటన, మధురాతి మధురమైన పాటలు అన్నీ అంత గొప్పగా సమకూరేయి.. అనంత రామశర్మగా ముమ్ముటి, అతని భార్యగా రాధిక, గంగాధరంగా మాస్టర్ మంజునాధ్ పాత్రలలో ఇమిడి పోయేరు.. పక్షితీర్ధం మామ్మగారిగా జయంతి, గంగాధరం తండ్రిగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తల్లిగా జానకి, పక్షితీర్ధ మామ్మగారి మేనల్లుడిగా అచ్యుత్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.. ఆనతి నీయరా హరా పాటకు రాధిక, మమ్ముటి ఆహబావాలు చెప్పనలవి కావు.. అనంత రామశర్మను శివునిగా, అతని భార్యను పార్వతిగా, గంగాధరాన్ని బాలగణపతిగా పోల్చి రూపకాలంకారంతో జాలిగా జాబిలమ్మ పాట రచించిన తీరు, స్వరకల్పన, చిత్రీకరణ, నటీనటుల నటన అన్నీ అద్వీతయం. కె.వి.మహదేవన్ స్వర రచన మహోన్నతం.. ఆనతి నీయరా పాటకు వాణీ జయరాంకు జాతీయ స్ధాయిలో ఉత్తమ గాయనిగా ఎన్నికైంది..ఇంత గొప్ప చిత్రానికికళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకులు, కథా రచయిత.. ఆయన కీర్తికిరీటంలో ఈ సినిమా కలికితురాయి..మరొక విశేషం ఈ చిత్రంలో గణపతి సచ్చిదానందస్వామి దర్శనమిస్తారు.

.

బలమైన పతాక సన్నివేశం కోసం కథ ముగింపు ఈ విధంగా చేసి ఉంటారు కానీ, గంగాధరం మరణం ప్రేకక్షులకు ఏ మాత్రం నచ్చలేదు..యాంటీ సెంటిమెంటయ్యింది..దానితో ప్రజాదరణ పొందలేదు.. చిత్రంలో కనిపించే గణపతి సచ్చిదానాంద స్వామి ద్వారా అనంత రామశర్మలో పరివర్తన తీసుకు వచ్చినట్లు కథ మార్చి ఉంటే ప్రజల ఆమోదం పొంది ఉండేదా.. ఏమో.. ఏమైనా, ఎంతో గుర్తింపు, ఎన్నో అవార్డులు రావలసిన సినిమా..కావలిసినంత గుర్తింపు దక్కకపోడవడం నిస్సంశయంగా నిరాశ పరిచే విషయం..శంకరాభరణం సినిమా లాగా మోత మోగ లేదు.. మబ్బుల చాటు సూర్య బింబమై పోయింది..కనీసం, ఈ చిత్రానికి జాతీయ స్ధాయిలో ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు దక్కక పోవడం సోచనీయం..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!