అల్లసాని వారి "మనుచరిత్రము" నుండి.
అల్లసాని వారి "మనుచరిత్రము" నుండి.
ఆ దివ్యాంగన వరూధిని ప్రవరుడి రూపలావణ్యాన్ని తిలకించి ఇలా మురిసిపోయింది :
వదన ప్రభూత లావణ్యాంబు సంభూత
కమలంబు లన వీని కన్నులమరు
నిక్కి వీనులతోడ నెక్కసక్కెము లాడు
కరణి నున్నవి వీని ఘన భుజములు
సంకల్ప సంభవాస్థాన పీఠిక వోలె
వెడఁద యై కనుపట్టు వీని యురము
ప్రతిఘటించు చిగుళ్ళపై నెఱ్రవాఱిన
రీతి నున్నవి వీని మృదుపదములు
నేరేటేటి యసల్ తెచ్చి నీరజాప్తు
సానఁబట్టిన రాపొడి చల్లి మెదిపి
పదను సుధ నిడి చేసెనో పద్మభవుఁడు
వీనిఁ గాకున్నఁ గలదె యీ మేని కాంతి!
ఈ అందగాని కన్నులు ముఖ కాంతి అనే నీట పుట్టిన కమలాల లాగ ఉన్నాయి. అతని ఎగుభుజాలు నిక్కి చెవులతో ఆటలాడుతున్నాట్టున్నయి. ఇతని విశాల వక్షస్థలం మన్మధుడి సింహాసనంలాగ ఉంది. పాదాలు ఎంత సుకుమారంగా వున్నాయంటే, నడుస్తున్నప్పుడు గడ్డి చిగుళ్ళు తగిలి కందిపోయాయి కాబోలు, బాగా ఎఱ్రబారి ఉన్నాయి.
ఆ బ్రహ్మదేవుడు జంబూనది యందలి బురద తెచ్చి (నేరేటి+ఏటి+అసల్) (జంబూనదిలోని అడుసు బంగారమని చెప్పబడింది), సూర్యుణ్ణి సానబట్టగా రాలిన పొడిని (రజను) అందులో జల్లి, కలయగలిపి, ముద్ద పాకానికి కావలసిన (పదను) తడిని, అమృతంతో కలిపి రంగరించి ఇతనిని చేశాడేమో ! లేకపోతే ఇంతటి శరీర కాంతీ, లావణ్యం ఎలా సాధ్యం ?
ఇంకా -
సుర గరుడోరగ నర ఖే
చరకిన్నర సిద్ధ సాధ్య చారణ విద్యా
ధర గంధర్వకుమారుల
నిరతము గనుఁగొనమె, పోలనేర్తురె వీనిన్?
దేవతలు (సుర) గరుడ (పక్షీంద్రుడైన గరుత్మంతుడు), నాగజాతి (ఉరగ), ఆకాశంలో సంచరించే దివ్యపురుషులు (ఖ అంటే ఆకాశం, దానిలో చరించేవారు ఖేచరులు), కిన్నర, సిద్ధ, సాధ్య, చారణ, విద్యాధర, గంధర్వ - వీరిలో యుక్తవయసులో ఉన్నవారిని (కుమారులన్), నిత్యం చూస్తూ ఉండనా? వారిలో ఎవరైనా వీనితో సరిపోలగలరే (పోలనేర్తురే)? అనుకుంది.
Comments
Post a Comment