కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర


కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర
చాల్లేవయ్యా..ఆపాటి అనుభవం మాకూ ఉంది. ఊ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచీ కథలు వింటున్నాం. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కంపోజిషన్లు రాయటం మొదలెట్టిన మర్నాటినుంచీ కథలు రాస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి. అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవముందని తప్పుకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచీ కథలు వినాలనీ,చదవాలనీ,వ్రాయాలనీ తహ తహ ఉన్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి అంటున్నారు ప్రముఖ(సినీ)కవి స్వర్గీయ ఆరుద్ర.. ఆయన “కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు!” అంటూ కథలు వ్రాసే ఆసక్తి ఉన్నవారి కోసం ఓ వ్యాసం వ్రాసారు. పనికొస్తుందనుకుంటే (సినిమా వాళ్లకు కూడా వర్తిస్తుందనే) చదవండి.

“మనం చదివే చాలా కథలు కన్నా మనం రాసే కథలే మనకి బాగుంటున్నాయి. అయినా మనం పంపించే కథలు ఈ పత్రిక వాళ్లు ప్రచురించరే? ” అని మీరెప్పుడేనా బాధపడ్డారా? ఇప్పుడు పడుతున్నారా? పడకండి ధైర్యం చేతబట్టుకొని, కాళ్లు నిలదొక్కుకోండి.

మీరు పంపించే కథలు మీకొక్కరికే బాగుంటే చాలదు. అందరికీ బాగుండాలి. అప్పుడే సంపాదకులు వాటిని ప్రచురిస్తారు. బాగున్న కథల్ని పత్రికలవాళ్లు కళ్ళకద్దుకుని మరీ ప్రచురిస్తారు. వేసిన వాటికి తృణమో,పణమో పారితోషికం ఇస్తారు.(పూర్వం రమారమి తృణమే ఇచ్చేవారు,ఇప్పుడు పణం ఇస్తున్నారు)

బాగా ఉండేటట్లు కథ రావాయలంటే దానికి అనుభవం కావాలి.

“చాల్లేవయ్యా! ఆపాటి అనుభవం మాకూ ఉంది. ఊ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచీ కథలు వింటున్నాం. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కంపోజిషన్లు రాయటం మొదలెట్టిన మర్నాటినుంచీ కథలు రాస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి” అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవముందని తప్పుకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచీ కథలు వినాలనీ,చదవాలనీ,వ్రాయాలనీ తహ తహ ఉన్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి.

భాగవతం రాసిన బమ్మెర పోతరాజుగారు మాత్రం ఎలా రాశారు? విభుదవరులవల్ల, కన్నంత తెలియవచ్చినంత తేట పరిచారు. ఆహా..దొరికింది కీలకం. ఇదే మంచి కథలు రాయటానికి సూత్రం. కథ రాసేవాడు ముందు బోలెడెంత వినాలి . లోకాయి,లూకాయి వాళ్లు చెప్పేది కాదు. విభుధ వరులు చెప్పేది. ఆ తరువాత కనాలి,(అప్పుడే కథలు కనకూడదు, ఆ మాట కొస్తే కలలూ కనకూడదు) లోకాన్ని చూడాలి. కన్నతరువాత తెలుసుకోవాలి. కన్నవి,విన్నవి,తెలుసుకున్నవీ కలగలుపు చేసేసి చెప్పాలి.(మామ్మూలుగా కాదు తేట పరచాలి) అలా చేస్తే అందరూ భాగవతమంత బాగుండే రచనలు చేయగలరు.

“అబ్బే! అంత పెద్ద ఆశలేం లేవు. నేను చస్తే బమ్మెర పోతరాజుగారంత వాణ్ణి కాలేను. ఏదో చిన్న కథ రాసి, అది పత్రికలో పడితే నా పేరు చూసి మురిసిపోవాలని ముచ్చటపడుతున్నారు” .అంటారా..మీరంత కథలు రాయక్కర్లేదు. మీ ముచ్చట తీర్చడానికి మీరు వ్రాసిన కథ బాగున్న(మీకు)బాగోలేక పోయినా(అందరికీ) ఏ సంపాదకుడు ప్రచురించి, ఇతర పాఠకుల్ని ఇబ్బంది పెట్టలేడు, అచ్చులో మీ పేరు చూసుకోవటానికి అనేకానేక మార్గాంతరాలున్నాయి. మంచి నిధులకు విరాళాలివ్వండి. మీ పేరు అచ్చులో చూడొచ్చు. లేదా మరో మార్గముంది.

ఆ మార్గం మాత్రం తొక్కకండి. చిక్కులో పడతారు. మొదట అచ్చులో పడి, తరవాత ఉచ్చులోనూ పడతారు.

పేరు తెచ్చుకోవాల్సిందే! (చెడ్డ పేరు కాదు,మంచి పేరు) పెద్ద ఆశయాలుంటేనే గాని , చిన్న (మెత్తు) పేరు సైతం రమ్మన్నా రాదు. బమ్మెర పోతరాజుగారి ఉపమానమే మళ్లీ తీసుకుందాం. ఆయన భాగవతం రాశారంటే ఎలా రాసారు. గంటం పట్టుకుని తాటాకులమీద చెక్కారు. దానికెంత ఓపిక కావాలి..బోలెడం. ఆయనకున్నంత ప్రజ్ఞ లేకపోయినా, అంత ఓపిక మీకూ ఉంటే మీరూ కథకులు అవుతారు.

‘అభ్యాసం కూసు విద్య’ అన్నారు పెద్దలు, ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అని కూడా వారే అన్నారని ఎందరెందరో ఉద్ఘాటిస్తున్నారు. మీరు కథకులు అవటానికి సాధనాలేమిటో ఆలోచిద్దాం.

కథ రాయాలంటే ఏం కావాలి? కథే కావాలి..చెప్పటానికేం లేకపోతే చెప్పేం ప్రయోజనం..కొంత మంది గొప్ప కథకులు ఏం లేకపోయినా గొప్ప గొప్పగా చెప్పేస్తారు..వాళ్ళు ఏమిటి రాశారని కాదు. ఎలా రాశారని మనం చదువుతాం. వాళ్ళలాగ చెయ్యి తిరిగాక అలా మీరూ రాయెచ్చు గానీ ప్రస్తుతం కథ ఉన్న కథలే రాయండి.

సరే కథ కావాలి. ఇది ఇంతకుముందు ఎవరూ ఎక్కడా రాయనిదైతే చాలా మంచిది. దేనిమీద రాయడం అని బాధ పడకండి. హాస్యమాడేవాళ్లు “దేనిమీద అని ప్రశ్నేమిటి..అందరూ కాగితం మీదే రాస్తారు” అని సమాధానం చెప్తారు.

అబ్బ గోడ మీద కథ రాయటం చాలా కష్టం.

పూర్వం అలంకార శాస్త్రజ్ఞులు ఫలానా ఫలానా విషయాల గురించే వ్రాయాలి అంటూ అనుశాసనం చేసారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడో అన్నీ కావ్య వస్తువులే..

“కుక్క పిల్లా, అగ్గి పుల్లా,సబ్బు బిళ్లా
కాదేదీ కవిత కనర్హం” అన్నాడు ఆధునిక కవి.
దేన్ని గురించైనా మనం రాయెచ్చు.

“ఒక కుక్క పిల్ల సైకిల్ క్రింద పడింది. కుయ్యోమని అరిచింది. ఆ అరుపు పక్కునున్న ఆఫీసులోని గుమస్తా విన్నాడు. వింటూ పరధ్యానంగా హెడ్ గుమస్తా పైన కలం విదిలించాడు. సిరా పడింది. హెడ్ గుమాస్తాకి కోపమొచ్చింది. గద్దించాడు. గుమస్తా గాబరా పడ్డాడు. సిరా బుడ్డి మీద పడ్డాడు. ఫైలు పాడియింది. అతను చిరాకుగా ఉన్నాడు. అప్పుడే పెద్ద ఆఫీసరు వచ్చారు. ఆయన హెడ్ గుమస్తాని పిలిచాడు. చిరాకుతో ఆయన వినిపించుకోలేదు” ఇలా ఎంత గొలుసైనా అల్లుకోవచ్చు.

పెద్ద ఆఫీసరు చిన్న గుమస్తాని తరువాత మెచ్చుకున్నాడు. సిరా ఏ ఫైలు మీద పడి పేజీలను అలికేసిందో,ఆ పేజీలలో దొంగ లెక్కలున్నాయి అవి తనిఖీ చేసే వాళ్ళకు అంతు చిక్కలేదు. అనుమానించారు. ఆ ఫైలు పోలిసు లేబరేటరీకి పంపించారు. నేరం బయిటపడింది. పెద్ద ఆఫీసరుకి,హెడ్ గుమస్తాకి శిక్ష పడింది. చిన్న గుమస్తాకి ప్రమోషన్ వచ్చింది. అతడు సంతోషంగా ఇంటికి వెడుతూ ఉంటే సైకిల్ కింద పడ్డ కుక్క ఎదురు వచ్చింది. నీ మూలాన నాకు ప్రమోషన్ అని దాన్ని అతుడు సమీపించి లాలించాడు. అది అతని చెయ్ియని కరిచింది. అతుడు వెధవ కుక్క అని రాయితో కొట్టాడు. అది పారిపోతూ కారు క్రింద పడి చనిపోయింది. చిన్న గుమస్తా దాన్ని చూసి ఏమనుకున్నాడు.

చూశారా,మీకేదో ఉదాహరణ చెప్పాలని ఇంత కథ అల్లేశాను. ఇలాగ మీరూ అల్లొచ్చు. ఈ కుక్క కథ టూకీగా చెప్పాలంటే ఇలా చెప్పానా. ఇదే చిలవలు చెక్కి పెద్ద కథని చేయవచ్చు.

జీవితంలో జరిగిన చిన్న సంఘటన తీసుకుని ఎవరైనా ఇలా రాయవచ్చు. అయితే తీసుకున్నదాన్ని మనం కొత్త కోణంలోంచి చూడాలి. లేదా కొత్త రకంగా చెప్పాలి. పాత సంఘటనల్ని,పాత పద్దతిలోనే చెప్పే ఎవరిక్కావాలి.

చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి,మళ్లా చెప్పి కొంతమంది హరిదాసులు సైతం రక్తి కట్టిస్తారు. విన్నవాళ్ళే విని, విన్నవాళ్ళే విని, మళ్లా ఆనందించాలంటే ఆ చెప్పటంలో గొప్పతనముందని మనం చెప్పుకోవాలి.

చెప్పే తీరు తేటతెల్లంగా ఉండాలి. సూటిగా ఉండాలి. మన అమ్మమ్మలూ,నానమ్మలూ చెప్పగా మనం విన్న మొట్ట మొదటి కథ ఒకటి తీసుకుందాం ” అనగనగా ఒక రాజు, ఆ రాజు కేడుగురు కొడుకులు..ఏడుగురు కొడుకులూ వేటకెళ్ళి …” ఈ కథ మీకూ తెలుసు కాబట్టి అంతా రాయను. ఈ కథలో ఉన్న సుగణమేమిటి? పాత్రల్ని ప్రవేశపెట్టడంలో డొంకతిరుగుడు లేదు. తికమక లేదు. తేలిసి పాత్రల ద్వారా తెలియని పాత్రల్ని కథకుడు ప్రవేశపెడుతున్నాడు. అదీ తేట తెల్లంగా కథ చెప్పే తీరు..ఈ ఏడు చేపల కథలోనే మరొక సుగుణముంది..



ఈ ఆర్టికల్ ని ఆరుద్రగారు 1992 లో రాయటం జరిగింది. మరో రచయిత శార్వరి గారు “కథలు రాయటం ఎలా” అనే పుస్తకంలో ఈ తరహా ఆర్టికల్స్ ని ప్రముఖ రచయితలందరి చేతా రాయించి సంకలనం చేయటం జరిగింది.

మొన్నీ మధ్య డైరక్టర్స్ అసోషియేషన్ వారి సమావేశంలో ప్రముఖ దర్శకుడు ఒకాయిన ఈ పుస్తకం గురించి ప్రస్దావించి సినిమా రచయిత,దర్శకులు తప్పని సరిగా చదివితీరాలి అని గట్టిగా చెప్పటం జరిగింది. వెంటనే ఆయన్నే ఓ కాపీ అడిగి..చదవి..సరే మన నవతరంగం మిత్రులుకు కూడా పరిచయం చేద్దదామనిపించింది…అంతే..

సేకరణ..సూర్య ప్రకాష్ జోశ్యుల

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!