పోతన గారి శ్రీ కృష్ణ భక్తి.!

పోతన గారి శ్రీ కృష్ణ భక్తి.!
(శ్రీ పద్మ విభూషణ నారయణ రెడ్డి గారి పరిశిలన.)
నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది.
రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ల గల రక్తికీ, భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. కుచేలు డున్నాడు, అర్జును డున్నాడు. వీళ్ళది ప్రధానంగా సఖ్యభక్తి. అనుషంగికంగా ఆ సఖ్యం చుట్టూ స్మరణవందన పాదసేవనాదులు పరివేషించక పోలేదు.
మరి మధుర భక్తికి మూలమేది? జీవాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మనుండి ఖండశః అంశతః విడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనమే భగవద్రతిభావనకు ప్రాతిపదిక. త్రేతాయుగంలో మునులు, ద్వాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపిక లున్నారు. వాళ్ళకు ఇళ్ళూ, వాకిళ్ళూ ఉన్నాయి. కొందరికి పతులూ, సుతులూ ఉన్నారు. అయినా శారదయామినిలో యమునా తీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదేపదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు -
"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"

మధ్యమధ్య ఆ మాధవుడు, ఆ గోపికా మనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సంభ్రమిస్తాయి -
"అదె నందనందనుం డంతర్హితుండయ్యెఁ - బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితివని - యైలేయలతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా - చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి - మాధవీలతలార! మనుపరమ్మ!
జాతిసతులఁ బాయ నీతియె హరి కని
జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!"
సమస్త చరాచర జీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ మాధవుడే తమధవుడని భ్రమించినారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్ధప్రవృత్తే మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్ణనంలో హృదయంగమంగా చిత్రించినాడు పోతన్న.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!