నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా “…


నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా “…
.
కవి సామ్రాట్టు విశ్వనాథ వారి మాట కరుకు, మనసు వెన్న అని అనడానికి ఒక చిన్ని ఉదాహరణ. చాలు..ఓ రోజు ఓ కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు.
ఎండాకాలం. అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది.
ఆ అబ్బాయి ”విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? ” అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్లి పోయింది.
ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా .. దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది. దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు తరుగుతున్నాడు.అసలే పేరు మోసిన కవి..
ఇతను వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తుడుచుకుంటూ తరిగేస్తున్నారాయన ఈ అబ్బాయి ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలి రమ్మని పిలిచారు. ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు.
” నీ పేరేమిటి ? ” అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి. ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు…. ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది. ” ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా ? ” అనడిగాడు. ” ఆయనతో నీకేం పని ” అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన. ” పనేం లేదు. ఊరికే చూసి పోదామని. అంతే ” అన్నాడా అబ్బాయి తాపీగా. అంతే… ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది
. ” వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేం చూస్తావు నా పిండాకూడు. ఎలాగూ వచ్చావు. నాలుక్కాయలు తరిగేసి పో నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది ” అని గయ్యిమన్నారు.
దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన్ని క్షమించమన్నాడు ఆ అబ్బాయి. . అంతే ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది. ఆ అబ్బాయిని లేవదీసి…” లేరా అబ్బాయీ .. నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ

నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా “…… అని ఆ పూట భోజనం పెట్టి, సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పమ్పారుట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!