దశావతార స్తుతి:-8- (కృష్ణావతారం.)

-
దశావతార స్తుతి:-8-

(కృష్ణావతారం.)

-

" కృష్ణానంత కృపాజలథే కంసారే కమలేశ హరే

కాళియమర్థన లోక గురో భక్తం తే పరిపాలయమాం

నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!

-

సకల కళల పూర్ణావతారం.. కృష్ణావతారం


భగవానుని దశావతారాలను నిశితంగా పరిశీలిస్తే సృష్టి, పరిణామక్రమాలు అర్థమవుతాయి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి అవతారాలు పది. 

ఇందులో మత్స్యం (చేప) కేవలం జలచరం. కూర్మం (తాబేలు) జలంలోనూ, భూమిపైనా సంచరిస్తుంది. అందుకే ఇది ఉభయచరం. వరాహం కేవలం భూచరం. నాలుగు కాళ్ల నుంచి రెండు కాళ్ల జీవిగా ఎదిగే క్రమంలో సగం జంతువు సగం మనిషి రూపంతో అవతరించింది నారసింహం. 

పూర్ణంగా మానవదేహం పొందినా మరుగుజ్జుగా కనబడే రూపం వామన అవతారం.


సంపూర్ణమైన భౌతిక ఎదుగుదల ఉన్నా, మనోబుద్ధులు వికాసం పొందని ఆటవికునికి సంకేతం పరశురాముడి అవతారం.

వికాసం చెందిన మానవుడు ఎలా ఉండాలి? ధర్మాధర్మ విచికిత్సను ఎలా చేయాలి? మనిషి సంఘజీవిగా ఎలా ఎదగాలి? సంఘంలో తోటి మానవులతో ఎలా ప్రవర్తించాలి? అని తెలపటానికి ఆవిర్భవించిన సంపూర్ణ మానవ అవతారమే శ్రీరాముడు. ‘‘రామో విగ్రహవాన్‌ ధర్మః’’ పోతపోసిన ధర్మస్వరూపం శ్రీరామచంద్రుడు. 

మానవుడు అడవిలో మృగంలా వేటాడి తినే పశుప్రవృత్తిని వీడి స్వయంకృషితో తన ఆహారాన్ని తానే పండించుకొనే సంకేతమే బలరామ అవతారం.

కేవలం ధర్మార్ధకామాలతోనే మనిషి సుఖంగా జీవించలేడు. తానెవరో.. తన స్వరూప స్వభావాలేమిటో తెలిసేవరకు మనిషిని దుఃఖం వీడదు. అన్ని దుఃఖాలనూ దూరం చేసి మనిషే మాధవుడని భగవద్గీతను బోధించిన అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణుడు కేవలం దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు మాత్రమే అవతరించలేదు.


మనిషిలోని అజ్ఞానాన్ని నివృత్తి చేసి, శాశ్వత శాంతిని అనుగ్రహించేందుకే భగవద్గీతను బోధించాడు. ఆ తర్వాత.. ‘‘నేను చెప్పినదానిని తిరిగి ప్రశ్నించకూడదు.. నేను చెప్పినట్లే చేసి తీరాలి..’’ అనే ఆంక్షలు పెట్టలేదు. చెప్పవలసిన ధర్మాలను బోధపరచి చివరకు ‘‘యథేచ్చసి తథా కురు’’- ధర్మాధర్మ విచక్షణతో నీవు స్వతంత్రుడవై కర్తవ్యాన్ని నిర్వహించు’’ అని చెప్పాడు. అందుకే ‘కృష్ణస్తు భగవన్‌ స్వయం’ అన్నారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ అని పూజిస్తున్నారు. శివగీత, అనుగీత, ఉత్తరగీత, పాండవగీత, బ్రహ్మగీత, హంసగీత.. ఇలా రకరకాల గీతలు ఉన్నప్పటికీ ఈ ఒక్క భగవద్గీతకే ఎందుకింత ప్రాచుర్యం లభించిందో మనం తెలుసుకోవాలి.

- స్వామి పరిపూర్ణానంద

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!