భరతుని కథ! (శ్రీమద్భాగవతం లోని కథ.)


-

భరతుని కథ!

(శ్రీమద్భాగవతం లోని కథ.)

శ్రీ హరి అంశతో పుట్టిన భరతుడు కణ్వాశ్రమంలో తన బాల్యాన్ని గడిపినాడు. వనమే అతని క్రీడారంగం మృగాలే అతని స్నేహితులు. ఆ బలశాలి సింహం పిల్లలతో ఆటలాడే వాడు! ఆ పసివాడి బలపరాక్రమాలు చూచి ఆశ్చర్యచకిత అయ్యేది తల్లి శకుంతల. స్వయంగా కణ్వమహర్షే భరతునికి జాతక కర్మలు చేసి విద్యాబుద్ధులు నేర్పినాడు. కుమారుడైన భరతుని తీసుకుని కణ్వ మహర్షి అనుజ్ఞపై ఆ సాధ్వి దుష్యంతుని వద్దకు వెళ్ళింది.


రాజు యొక్క జీవతం కత్తిమీద సాము వంటిది. అతడు ఏది చేసినా ప్రజల హితం కోరి వారి ఆమొదంపైనే చేయాలి. శకుంతల భరతుని తీసుకొని వచ్చి ఈతడే నీ వారసుడు అని చూపినది. ఆ విషయం నిజం అని తనకి శకుంతలకి కణ్వమహర్షికే తెలుసు. అది ప్రజులకు విశ్వసనీయమైన రీతిలో తెలియ చేయాలని తలచి ఆ ధర్ముడే రక్షిస్తాడని నమ్మి ఏమనక ఊరకున్నాడు దుష్యంతుడు. అప్పుడు ధర్మాత్ముడైన దుష్యంతుని కరుణించి ఆకాశవాణి అందఱికీ తెలిసే లాగా స్పష్టంగా ఈ భరతుడే దుష్యంతుని పుత్రుడు కాబోవు చక్రవర్తి అని చెప్పినది. ఆ వాక్కు విని దుష్యంతుడు శకుంతల సంతసించి పుత్రినికి పట్టాభిషేకం చేసి ఐహిక విషయాల మీద మనసు పెట్టక తపోవనాలకు వెళ్ళిపోయారు.


భరతుడు సమర్థమైన తన భుజస్కంధాలపైన ఈ భూభారాన్నంతా నిలిపి ధర్మపాలన చేశాడు. ధర్మస్థాపన కోసమే యుద్ధం చేసేవాడు. తన దిగ్విజయ యాత్రలో సనాతన ధర్మానికి విరుద్ధమైన శక కబర బర్బర కష కిరాతక హూణ మ్లేచ్ఛ దేశాల రాజులను అణచాడు. పాతాళంలో దేవతాస్త్రీలను చెఱబెట్టిన రాక్షసులను శిక్షించి ఆ స్త్రీలను వారి భర్తలకు అప్పగించినాడు. త్రిపురరాక్షసులను జయించి దేవతలను వారి వారి పదవులయందు నిలబెట్టినాడు. సత్యం శౌచం దయ తపస్సు స్థిరంగా భరతుని రాజ్యంలో ఉండటంతో ప్రకృతి సహజంగా జనాలు కోరినవన్నీ ఇచ్చేది.


ఈ భూమండలం అంతా భరతుని పాలనలో ఉన్నా కర్మ భూమి అయిన ఈ భరతఖండంలోనే అన్ని యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు చేశాడు. దీర్ఘతపుడను మర్షిని పురోహితునిగా చేసుకుని యమునా తీరమునందు 78 అశ్వమేధయాగాలు చేశాడు. గంగాతీరం పొడుగునా 55 అశ్వమేధాలు చేసి దేవేంద్రుని అతిశయించిన వైభవంతో శోభించినాడు.


13084 పాడి ఆవుల మందను ద్వంద్వం అంటారు. అట్టి 1000 ద్వంద్వాలను దూడలతోపాటు బంగారముతో గిట్టలు కొమ్ములు అలంకరించి బాగా పండితులైన 1000 మంది విప్రోత్తములకి దానం చేశాడు. బంగారు నగలతో శోభించేవీ తెల్లని దంతాలు కలవీ అయిన 1400000 నల్లని ఏనుగులను మష్కారతీర్థం ఒడ్డున దాన మిచ్చినాడు!


కుబేరునితో సమానమైన సంపద సాటిలేని శౌర్యం దేవేంద్రునితో సమానమైన విభవం మహర్షులతో సరితూగే తపశ్శక్తి ఉండికూడా భరతుడు ఎన్నడూ గర్వించక అర్థశరీరాలు తృణప్రాయంగా భావించి శాంతికాముకుడై భగవత్భక్తితో జీవించాడు. ఈ విధముగా 27000 యేండ్లు రాజ్యపాలన చేసినాడు. ఈ భరతుని సంతతి వారము కనుక మనం భారతీయులం అయ్యాము.


పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:


ఒక మనిషి నిజంగా మనస్సుపెట్టి ధర్మబుద్ధితో పరిశ్రమ చేస్తే దేవతలనే మించిన మహామనీషి అవుతాడని భరతుడు మనకు నిరూపించాడు. అతడు తన బలపరాక్రమాలను ఉపయోగించి యుద్ధములలో విజయుడై భూమండలం అంతటా ధర్మస్థాపన చేశాడు. ప్రజల హితార్థం ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. నభూతో నభవిష్యతి అనే రీతిలో ఎన్నో దాన ధర్మాలు చేసి యశశ్వి అయ్యాడు.


భారతీయుల ఆధ్యాత్మ చింతన ఈ కథలో మనకు తెలిసింది. దుష్యంతుడు శకుంతల అన్ని ఐశ్వర్యాలను రాజభోగాలను పుత్రపౌత్రాది ఆకర్షణను త్యజించి తపోవనాలకి వెళ్ళి తపస్సు చేసుకొన్నారు. అలాగని కర్తవ్యాన్ని విస్మరించకుండా ఎంతో కాలం ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసి కర్తవ్యం పూర్తి చేసుకొని ఆ తరువాతే వానప్రస్థం స్వీకరించారు


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!