అలమేలు మంగ! .


అలమేలు మంగ!

.

అలమేలు మంగ లేదా పద్మావతి, కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. తిరుపతి సమీపంలోని తిరుచానూరు లేదా "ఆలమేలు మంగాపురం"లోని అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధమైనది.


లక్ష్మియే అలమేలు....

శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, అండాళ్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును.

శ్రీదేవి (లక్ష్మి), భూదేవి ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన మలయప్పస్వామి ఉభయ నాంచారులతో కూడి ఉన్నాడు.

వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి")

మరొక కథనం ప్రకారం త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది. శ్రీనివాసుడు శిలగా అయినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసింది.


భూదేవియే గోదాదేవిగా అవతరించి శ్రీరంగనాధుని వరించింది. ఈమెను ఆండాళ్, ఆముక్త మాల్యద (తాల్చి ఇచ్చిన తల్లి), చూడి కొడుత నాచియార్ అని కూడా అంటారు. భూదేవి స్వరూపమే సత్యభామ అనికూడా పురాణ కథనం గమనించాలి.

కొండపై వెలసిన దేవుడు "బీబీ నాంచారి" అనే ముస్లిం కన్యను పెండ్లాడాడని ఒక కథనం. లక్ష్మీదేవియే ఈ అమ్మవారిగా జన్మించి ముస్లిముల ఇంట పెరిగిందట! తమ ఆడపడుచుపై గౌరవంతో కొండలరాయుని దర్శించుకొన్న ముస్లిం సోదరులను చూసి హైదర్ ఆలీ తిరుమల కొండపైని సంపద జోలికి పోలేదని అంటారు. శ్రీరంగంలోని శ్రీరంగనాధుని ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాను తీసుకొని పోగా అతని కుమార్తె "తుళుక్కు నాచియార్" రంగనాధుని మనోహర రూపానికి మనసునిచ్చిందని ఒక కథనం. శ్రీరంగం నుండి వైష్ణవ సంప్రదాయంతో బాటు ఈ దేవత కూడా తిరుమలకు వేంచేసి ఉండవచ్చును.

ఈ కథనాల సారంగానూ, స్థల పురాణాల వల్లనూ, సాహిత్యంలో ప్రస్తావనలను బట్టీ, అర్చనాది ఆచారాలనుబట్టీ లక్ష్మీదేవియే "పద్మావతి" లేదా "అలమేలు మంగ" అనీ, అమెయే తిరుమల కొండపై శ్రీవారి మూర్తి వక్షస్థలంపై ఉన్న హృదయలక్ష్మి అనీ, ఆమెయే తిరుచానూరు ఆలయంలో వెలసిన అలమేలు మంగ అనీ భావించవచ్చును.


అన్నమయ్య సంకీర్తనలలో అలమేలు మంగను శ్రీమహాలక్ష్మిగా పదే పదే వర్ణించాడు (క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం ... ... జగతి అలమేలు మంగ చక్కదనములకెల్ల నిగుడు 

నిజ శోభల నీరాజనం.

పద్మావతిని పద్మశాలీలు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఈ ప్రాంతంలో బట్టల వ్యాపారం చేసే ధనికులైన పద్మశాలీలు పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణం కోసం తాళ్ళపాక చిన్నన్నకు 16వ శతాబ్దంలో 20 వేల వరహాలు విరాళం సమర్పించినట్లుగా శాసనాధారాలున్నాయి. పంచ భూతములనెడు పలువన్నెల నూలుతో నేసి, నీడనుండి చీరలమ్మే నే బేహారి - అని అన్నమయ్య వేంకటేశ్వరుని నర్ణించడం గమనించ దగిన విషయం

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!