ద్రౌపది!

ద్రౌపది!

ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. 

ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట?

.

సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు!

అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు.

నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు. ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ? అనిపిస్తుంది.

ద్రౌపదికి కూడా అనిపించింది. కానీ అలా చెయ్యలేదు కదా! సభా మర్యాద, పాతివ్రత్యమూ మాట దేవుడెరుగు. ముందు తమ నాటకం బయటపడి మళ్ళీ వనవాసం చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి మాటలతో ధర్మరాజు గుండెలో ఒక్క పోటుపొడిచి వెళిపోతుంది. ఆమె అంటుందీ:

.


"నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు

పెద్దవారి యట్ల పిన్నవారు

గాన, బతుల విధమ కాక యే శైలూషి

గాననంగ రాదు కంక భట్ట!

.


అట్లగుటం జేసి నాకు నాట్యంబును బరిచితంబ. మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున జూదరియాలికి గఱువతనంబెక్కడియది"

.


"ఓ కంకభట్టూ! నా భర్తే ఒక పెద్ద నటుడు. పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ వెళతారు. అంచేత నా భర్తల తీరే నాదీను. నన్ను నాట్యకత్తె అని తూలనాడ్డం ఎందుకు? అంతే కాదండోయ్! నా భర్తగారు నటుడే (శైలూషుడు అంటే నటుడు) కాదు పెద్ద జూదరి (కితవుడు అంటే జూదరి) కూడాను. జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి?" అంటుంది. ఇక ధర్మరాజు తలెక్కడ పెట్టుకోవాలి?!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!