శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారూ!

శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారూ! 

-

సుబ్రహ్మణ్యశాస్త్రిగారు జగము ఎరిగినవాడు:

జగము తన్నెరిగినవాడు. మరిన్నీ, విశేషించి బ్రాహ్మణుడు. 

అనగా బ్రాహ్మణీకమే ఆయన రచన: 

గోదావరీ మండలంలో వెలనాటి వైదిక కుటుంబాలు ఆయన సాహితీ సమరాంగణము. వారి పోకడలూ, మెలకువలూ ఆయన వాక్యములు. వారి కష్టసుఖాలు ఆయన చెప్పిన కథలు.


సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కథలు కొన్నైనా చదివితే తెలుగుకుటుంబాల ఆపేక్ష, అంతఃఅకరణాలు ఎలాటివో, ఆ మరియాదలు, మన్ననలు ఎట్టివో అర్థమౌతుంది! ఆశ్చర్యమేస్తుంది! ముచ్చటౌతుంది!


‘వడ్లగింజలూ మించే కథ ఉందా!


‘యిల్లుపట్టిన వెధవాడపడుచూ అలా మరొకరు వ్రాయగలిగేరా?

‘అనుభవాలూ-జ్ఞాపకాలూ’ నూరేండ్ల తెలుగుతనపు కూలంకష క్రోడీకరణ కాదా! అది వేయేళ్ళపాటు, పదింబదిగ చదువుకోవలసిన గ్రంథం కాదా! తెలుగు మాగాణముతోబాటు, మీగడ తరకలైన శ్రీ శాస్త్రిగారి రచనలు శాశ్వతముగా వర్థిల్లవా!

***

శ్రీపాదవారిలో పండితులున్నారు, కవులున్నారు, వైద్యులున్నారు, వర్తకులున్నారు! ఇక చిరస్మరణీయులైన శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు పండితుడు, కవి, వైద్యుడు, వర్తకుడు సరసంగా తానై, ఛాందసము వన్నె తెచ్చిన సంస్కారి. శ్రుతిపక్వమైన పట్టుదల రాణించిన వివేకి. తనకు చిననాడే చేయితిరిగినదన్న నమ్మకమూ, తాను చేసిన రచనలు లోకమును, లోకులను ఒప్పించి మెప్పించగలవన్న విశ్వాసమూ నిలువెత్తున గల నిగర్వి!


వైదిక విద్యలు ఆయన ఒంటపట్టినవి. శాస్త్ర ప్రసంగములు తరతరములుగా వారి యింట పుట్టినవి. షడంగములకూ శ్రీపాద వారి లోగిలి నెలవు! శాస్త్రి గారి గురువులు పరమశ్రోత్రీయులు. వీరూ సంప్రదాయము మేరకు మడిగా, బాసెనపెట్టుగా చదువులు నేర్చినారు. ఆ చదివిన అంతో యింతో, ఎంతగానో సద్వినియోగము చేయగలిగినారు.


ఒజ్జల కరుణను, వయసు వచ్చీరానితనాన, పైన సేలువతో, ఊరూరా అవధానములు చేసి, ఔననిపించుకుని, పెద్దలు మెచ్చి యిచ్చిన పతకములు ధరించి, నిబ్బరముగా రొమ్ము విరుచుకుని, కైత అల్లికలో అపారమైన అనుభవము, యింగితము అలవరచుకున్నారు. కాని పద్దెమలు కట్టుటకే కట్టుబడి ఉండలేకపోయినారు. వచన రచన ఆయన సొమ్మైనది. ఆ వచనమే మనకు కలకాలము పెన్నిధి అయినది.


“ఏమండీ! మీరు ముమ్మూర్తులా భారతము ఆరగా ఆరగా చదువుకొంటిరే – ప్రబంధముల సాంఉగరడీల దేలితిరే – చిన్నయసూరి వచనము కల్వాన నూరితిరే – ఆ పడిన పాటులన్నీ మూలకునెట్టి, తేటతెలుగులో, సూటిగా మాటలు చెప్పినట్లు కాగితంమీద పెట్టడం, అవ్వ పసిపాపను లాలించి గోరుగోరు ముద్దగా బువ్వ తినిపించినట్లు కథలు వినిపించడం – ఇది మీకు ఎలా అబ్బిందండీ?” అని అడిగితే, ఆయన అన్నారు కదా –


“దానికి ఎంత కాడ ఉందనుకున్నావ్! అది అట్టే అబ్బింది కాదు. ఉన్నట్టుండి మొలుచుకు వచ్చింది కాదు. సాధన చేయగా చేయగా అందుబాటైంది కాదు. అదో కథ!


అసలు కమామిషేమిటంటే – నేను వస్తుతఃఅ పద్దెగాణ్ణి! గద్దెగాణ్ణి కాను! మునుపు పద్యం కట్టడమంటే ప్రాణం! చక్కని కవిత్వం, చక్కని గొంతున వినడం పంచభక్ష్యపరమాన్న భోజనం! కాని వీటిల్లు బంగారంగానూ, పద్యాలకు ఏదో గ్రహణం మొరక ఉంది. దానా దీనా తామసము పెరిగేను. దర్పం పెరిగేను. గండ్రతనం కన్నుగప్పేను. తన కన్న ఘనుడు వేరొకడున్నాడా అనే పనికిమాలిన ధీమా బలీయం. కవులది సిగపట్లగోత్రమయ్యా! వ్యాసుడూ భాసుడూ హయాములో ఏమోగాని – యిప్పుడు మట్టుకు నిప్పచ్చరమే.


నావి గట్టుమీద కూర్చుని అజమాయిషీ చేసే కామందు ధర్మపన్నాలు కావు! అడుసులో దిగాను…తెలివి తెచ్చుకుని కాళ్ళు కడుక్కున్నాను! నాకు బుద్ధి తెలిసేటప్పటికి యిటు మా గురువులు, అటు తిరుపతి వేంకటేశ్వరులు, మరో అటు కొప్పరపుంగవీశ్వరులు! వీరందరూ సజ్జనులే, వస్తుతఃఅ మాంచి గృహస్థులే, ఒకరికి చెప్పదగినవారు కాని, చెప్పించుకోవలసినవారు కారే! కాని, కందగీత మత్తేభములై జడివానగా, సంద్రపు హోరుగా, ఏళ్ళకు ఏళ్ళు, పరిపరివిధాల తాతామనవళ్ళ వరసల పరవళ్ళు పోలేదా! ధిల్! ఎందుకా పనికిమాలిన రభస! యిందువల్ల ఒరిగినదేమున్నది!


కాని, నాకీ యింగితం ఆదికాలంనాడే ఉందనా? ఊహూఁ – నేనూ నాలుగు అన్నాను, పది పడ్డాను. అంతటితో బుద్ధి తెచ్చుకుని, ఆ ప్రాబంధిక బడుద్ధాయితనానికి యిన్ని నీళ్ళు వదిలిపెట్టాను. అయితే గియితే, ఆ అనుభవమూ ఒకందుకు మంచిదే అయింది. ఆనాటినుంచీ నేణు నొవ్వను, తెలిసి తెలిసి యింకొకరిని నొప్పించను. అప్పటికీ, యిప్పటికీ నేనంతే! నా కథలూ అంతే!


ఇదంతా పూర్వరంగం అనుకో! ప్రస్తాన్ని అనుసరిద్దాం! యీ వచనం నీకెలా అబ్బిందయ్యా అంటావా! ఉగ్గుపాలనాడే అబ్బింది. పదుగురాడు మాటలు విని, మనం పలుక నేర్చాము. నలుగురిలో కలిసిమెలిసి మెలగనేర్చాము. మనము బడిపుస్తకాలమూ, పాఠ్యగ్రంథాలమూ కాదు. మన ప్రయోగానికి అర్థమూ, స్వారస్వమూ మనము విప్పి చెపితేనేకాని ఎదటివాడికి అర్థంకాదనే అనర్థం సృష్టిలో లేదు. ఎదుటివాడు మనవంటి పండితుడు కాదు. మనకన్న పామరుడూ కాడు. వాడూ మనలాటివాడే! వాడి భాషే మన భాష!


నేను విన్నవి-కన్నవి కాగితంమీద పెట్టాను. అది, నా భాషా? అందరి భాషా కాదా?

గిడుగు వాగనుశాసనుడు. యీతరంలోనూ, ఎల్లకాలమూ, కలంబట్ట నేర్చేవారందరికీ ఉపాస్యదైవం. నాకు, మరీ ముఖ్యంగాను. నీవు అనుకున్నది ఏమై ఉండునో నీ రచనలో స్పష్టంగా తెలియకపోతే, నీవు తెలుగువాడవేనా? నీది తెలుగుభాషేనా? అయితే, లాకాయ్-లూకాయ్ వాళ్ళందరికోసం కాదు నా రచన! -అనుకుంటూ భుజాలు చరచుకునేవాళ్ళూ లేరంటావా? ఉన్నారు! అది వాళ్ళవాళ్ళ లలాట లిఖితం!….”


యీ తీరు శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి గారిది! యీ ధోరణి వారి వచనరచనకు శ్రీకారం. ఆయన భిషక్కు, కాని ఆవంత అయినా ‘భేషజం’ లేదు. ముక్కుకు సూటిగా పోయే మనిషి- కాని లోకంపోకడలో ఎన్ని డొంకతిరుగుళ్ళు ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు – తెలిసినవాడు! ఒక్కమాట ఎన్ని చిలవలుపలవలు వేయగలదో తరచి చూసినవాడు, మన తెలుగే తానైనవాడు. కన్నులలో రవపాళపు చురచుర ఉన్నదికాని, ఆ చూపు వెన్నవంటిది. మాటలో ఓ వీసపాలు గరుసుకద్దు. కాని మనసు అతి సుతిమెత్తన!


మనిషి మాంచి పొడగరి! మెలకువలలో గడసరి, ముక్తసరిగా మాటకారి. ఆయనది పరువిచ్చే చిరునవ్వు, పరాయివాడినైనా ప్రత్యుత్థానం చేసే శ్రోత్రియపు ఠీవి. తన మరియాద ఎదుటివారికి ఆదరణగా అందించే రాజసం! – ఇలాటివారు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.


ఆయన వ్రాసిన కథలు యించుమించు లెక్కలేనన్ని. అవన్నీ మేలురతనాలు! చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన. విద్యాబుద్ధులున్న అహంకారులకు కనువిప్పు చేసినది ఆయన వచనము! తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరోభాషకు లొంగవు. జాను తెలుగు నేర్చినవారికే, తెలుగువారైనవారికే శ్రీ శాస్త్రిగారి కథలు చదివి ఆనందించే అదృష్టము!


– మల్లాది రామకృష్ణశాస్త్రి

పుస్తకప్రపంచం; మార్చి, 1961

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!