❤️🌺🌹రుక్మిణీ కళ్యాణం.!🌹🌺❤️ .............కొనసాగింపు ..10....... (పోతనామాత్యుడు)


.............కొనసాగింపు ..10.......,,,,,(పోతనామాత్యుడు)

.🚩

అలా గౌరీపూజ చేసుకొని బయటకు వచ్చిన రుక్మిణి, కృష్ణుని చూసింది. అతని సౌందర్యం, యౌవనం, లావణ్యం, వైభవం, గాంభీర్యం, నేర్పరితనం, తేజస్సుల అతిశయానికి సంతోషించింది. మన్మథ బాణాలకు గురై రథం ఎక్కాలని ఆశ పడుతున్న ఆమెను చూసాడు

కృష్ణమూర్తి. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్యన ఉన్న ఆహారాన్ని పట్టుకు పోయినట్లు శత్రుపక్షం రాజులందరు చూస్తుండగా వాళ్ళని లెక్కచేయకుండా రాకుమారిని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ ద్వారక కెళ్ళే దారి పట్టాడు.

బలరాముడు యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు.

అప్పుడు కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు.

.🚩

""ఘన సింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్

మన కీర్తుల్ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్

చనుచున్నా రదె; శౌర్య మెన్నటికి? మీ శస్త్రాస్తముల్ గాల్పనే?

తనుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్."🔻

భావము:

("గొప్ప గొప్ప సింహాల పరువు నీచమైన జంతువులు తీసేసినట్లు, మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణీ పడతిని పట్టుకు పోతున్నాడు. అదిగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నరు. రాకుమారిని విడిపించ లేకపోతే మన పరాక్రమా లెందుకు. మన అస్త్రశస్త్రా లెందుకు దండగ. సందుగొందుల్లో జనాలు నవ్వరా." అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు.)

.

అలా కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే, శశిపాలాదులు ఒకరికొకరు హెచ్చరించుకొని, రోషాలు పెంచుకొన్నారు. కవచాలు, బాణాలు, ఆయుధాలు ధరించారు. జరాసంధుడు మొదలైనవారంతా పంతాలేసుకొని తమతమ చతురంగ సైన్యాలతో యాదవుల వెంటబడ్డారు. “ఆగక్కడ ఆగక్కడ” అని హుంకరించారు. మేఘాలు కొండలమీద కురిపించే వానధారల్లా బాణ వర్షాలు కురిపించారు. యాదవ సేనానాయకులు విల్లులెక్కుపెట్టి, వింటి తాళ్ళు మోగించి అడ్డుకున్నారు

.🚩

"అరిబల భట సాయకముల

హరిబలములు గప్పఁబడిన నడరెడు భీతిన్

హరిమధ్య సిగ్గుతోడను

హరివదనముఁ జూచెఁ జకితహరిణేక్షణయై."🔻

.

భావము:

ప్రతిపక్ష సైన్యాల బాణాలు కృష్ణుని సైన్యాన్ని కప్పేస్తుంటే చూసి, సుకుమారి రుక్మిణీదేవి బెదిరిన లేడి చూపులతోను భయంతోను సిగ్గుతోను ముకుందుని కృష్ణుని ముఖంకేసి చూసింది.

.

ఇలా చకితహరిణేక్షణ యై ఆమె కృష్ణుని చూడగా, కృష్ముడు ఇలా చెప్పసాగాడు. .

.🚩

"వచ్చెద రదె యదువీరులు

వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచన్

నొచ్చెదరును విచ్చెదరును

జచ్చెదరును నేఁడు చూడు జలజాతాక్షీ!"🔻

భావము:

ఇలా చకితహరిణేక్షణ యై ఆమె కృష్ణుని చూడగా “కమలనయనా! రుక్మిణీదేవి! ఖంగారు పడకు. యాదవ శూరులు వస్తారు. శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడతారు. పగవారు బాగా నష్టపోతారు, ఓడి చెల్లాచెదరౌతారు, చచ్చిపోతారు చూస్తుండు.” ఊరడించసాగాడు.

.

ఇలా చెప్పి మాధవుడు రుక్మిణిని ఊరడించాడు.

ఈలోగా ప్రళయం వచ్చినప్పుడు ఆకాశమంతా కప్పేసి పెద్దపెద్ద పిడుగులు కురుపించే కారు మబ్బులు లాగ బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు మొదలైన పరపక్ష రాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకు పడ్డారు. అగ్నికీలలతో సరితూగే ఉక్కుబాణాలు మొదలైన వాడి బాణాలు కురిపించారు.

అప్పుడు శత్రు సేనలో ఏనుగులు కూలిపోయాయి, గుర్రాలు చెల్లాచెదు రయ్యాయి. రథాలు ముక్క లయ్యాయి, కాల్భంట్లు బెదిరి పోయారు, గజాశ్వ రథారోహకుల తలలు తెగి పోయాయి. గుండెలు, నడములు, చెవులు, కంఠాలు, చెక్కిళ్ళు, చేతులు తునాతునక లయ్యాయి. కపాలాలు పగిలిపోయాయి, తలవెంట్రుకల చిక్కులు రాలాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు తెగిపోయాయ. దంతాలు రాలిపోయాయి. వీరుల కాలి యందెలు, భుజ కీర్తులు పడిపోయాయి. చెవిపోగులు, కిరీటాలు, కంఠహారాలు జారిపోయాయి. వీరుల సింహనాదాలు మూగబోయాయి.

గదలు, బల్లేలు, గుదియలు, గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, విల్లులు విరిగిపోయాయి. జండాలు, గొడుగులు, వింజామరలు ఒరిగి పోయాయి. కవచాలు పగిలిపోయాయి. గుర్రాల కాలి గిట్టల తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది.

రథాల వేగం నెమ్మదించింది. వందిమాగధ వైతాళికుల స్తోత్ర పఠనాలు ఆగిపోయాయి. గుర్రాల సకిలింపులు, భేరీల భాంకారాలు, ఏనుగుగుంపుల ఘీంకారాలు, రథచక్రాల పటపట శబ్దాలు, గుర్రాల నడుములకు కట్టిన గంటల గణగణలు, వీరుల హుంకారాలు, ఆభరణాల గలగలలు, నగారాల ధణధణలు, మణిమంజీరాల క్రేంకారాలు,

మువ్వల గలగలలు, అల్లెతాళ్ళ టంకారాలు, భటులు ఒకరినొకరు దిక్కరించుకోవడాలు ఆణిగిపోయాయి. రాజ సమూహం చెదిరిపోయింది. నెత్తుటేరులు పారాయి. భూత బేతళాల కలకల ద్వని వినిపిస్తోంది. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైన వాని అరుపులు చెలరేగాయి. తల తెగిన మొండెములు కదలాడాయి. మాంసం కంపు గొట్టింది. మెదడు, మాంసం తింటూ రక్తం తాగుతూ ఉన్న డాకినీ మొదలైన పిశాచాలకి ఆ రణరంగం ఆనందం కలిగిస్తోంది.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!