రుక్మిణీ కళ్యాణం.! రుక్మిణి దేవి శ్రీ కృష్ణుని చూచుట - కోన సాగింపు- 9-




🔴-రుక్మిణీ కళ్యాణం.!🌹
రుక్మిణి దేవి శ్రీ కృష్ణుని చూచుట - కోన సాగింపు- 9-
(పోతనామాత్యుడు )
.🔔🔔
♦రుక్మిణిదేవి దుర్గమ్మకు అలా మొక్కింది. బ్రాహ్మణదంపతులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మెడలో వేసుకొనే తాళ్ళు, పళ్ళు, చెరకు గడలు దానం చేసి పూజించింది.
.
"#కుక్షినివార లుత్సహించి వలనొప్ప దీవించి
సేస లిడిరి యువతి శిరమునందు;
సేస లెల్లఁ దాల్చి శివవల్లభకు మ్రొక్కి
మౌననియతి మాని మగువ వెడలె.❤
(వారు ఉత్సాహంతో చక్కగా దీవించి, ఆమె తల మీద అక్షతలు వేసారు. రుక్మణి ఆ ఆశీర్వచనాలు ధరించి పార్వతీదేవికి నమస్కారాలు పెట్టింది. మౌనవ్రతం వదలి బయటకొచ్చింది.)
.♦ఇలా రుక్మిణీదేవి ఉమామహేశ్వరుల గుడినుంచి బయటకు వస్తోంది. అప్పుడు ఆమె వర్షాకాలంలో మేఘాల్లోంచి బయట కొచ్చి మెరసే మేఘంలా, లేడి చిహ్నమున్న చంద్రమండలంలోంచి బయటకొచ్చిన లేడిలా ఉంది. బ్రహ్మదేవుడనే దర్శకుడు ఎత్తిన నాటకాల తెర మరుగునుంచి బయటకొచ్చి వేషం ధరించిన మోహినీదేవతలా ఉంది.
.♦సముద్రమధన సమయంలో దేవదానవులు చేతులు కలిపి వాసుకి అనే కవ్వం తాడు కట్టిన మంధర పర్వతమనే కవ్వం చిలుకుతుండగా పాలసముద్రం లోంచి వెలువడ్డ లక్మీదేవి లాంటి వైభవంతో,
మానస సరోవరంలోని బంగారు కమలాల సమూహంలో విహరిస్తున్న కలహంసలా మందగమనంతో వస్తోంది.
.♦బంగారు జంట కలశాల్లాంటి స్తనద్వయం బరువుకి నడుము ఊగుతూంది. రత్నాల ఉంగరాలు అలంకరించిన చెయ్యి ఒక చెలికత్తె భుజం మీద వేసింది. రత్నాల బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ళపై పరచు కుంటున్నాయి. పద్మాల సువాసనలకి మత్తెక్కిన తుమ్మెదల్లా ముంగురులు మోముపై కదుల్తున్నాయి. అందమైన చిరునవ్వుల కాంతులు నల్దిక్కుల
లేతవెన్నెలలా ప్రకాశిస్తున్నాయి. దొండపండు లాంటి పెదవి కాంతుల
వల్ల తెల్లని మల్లెమొగ్గల్లాంటి దంతాలు ఎర్రబారాయి.
మన్మథుని జండాలా పైటకొంగు ఊగుతుంది. బంగారపు వడ్డాణం
 లోని రత్నాల కాంతులు అకాల ఇంద్రధనుస్సు మెరుపులు పుట్టిస్తున్నాయి మన్మధుడి ఒరలోంచి దూసిన కత్తుల మెరపులలా ఆమె మనోహరమైన చూపులు రాకుమారుల మనస్సులను ఛేదిస్తున్నాయి.
మోగుతున్న కాలిగజ్జెల మనోఙ్ఞమైన గలగలలు చెవులకు పండుగ చేస్తున్నాయి.
అలా కృష్ణుడిరాక కోసం ఎదురు చూస్తూ వీరమోహినిలా రుక్మిణీదేవి వస్తోంది. అప్పుడు
.♦#అళినీలాలకఁ బూర్ణచంద్రముఖి, నేణాక్షిం, బ్రవాళాధరిం,
గలకంఠిన్, నవపల్లవాంఘ్రియుగళన్, గంధేభకుంభస్తనిం,
బులినశ్రోణి నిభేంద్రయాన, నరుణాంభోజాతహస్తన్, మహో
త్ఫల గంధిన్, మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ములై రందఱున్.'❤
.
(తుమ్మెదల వంటి నల్లని ముంగురులు, పూర్ణ చంద్రుడు వంటి గుండ్రటి ముఖము, లేడి కన్నులు, పగడాల లాంటి పెదవులు, కోకిల కంఠధ్వని, కొంగ్రొత్త చిగురుల వంటి చేతులు, మదగజాల కుంభస్థలాల లాంటి స్తనాలు, ఇసుక తిన్నెల లాంటి పిరుదులు, దిగ్గజాల నడక లాంటి నడక, ఎర్రకలువ లాంటి అరచేతులు, గొప్ప పద్మాల వంటి సువాసనలు, సింహం నడుము కల ఆ రుక్మిణిని చూసి అందరు విభ్రాంతి చెందారు.)
.♦అంతేకాదు. అలా గౌరీపూజ పూజచేసి దేవాలయం బయటకు వచ్చిన రుక్మిణీవనిత సౌందర్యానికి విభ్రాంతులైన అక్కడి రాజులందరు ఆమె చిరునవ్వులకి, సిగ్గులతో కూడిన ఓరచూపులకి మనసులు కరిగిపోయి, ధైర్యాలు వదలారు; గాంభీర్యాలు విడిచిపెట్టి. గౌరవమర్యాదలు మరిచారు; చేష్టలుదక్కి మైమరచారు; ఆయుధాలు జారవిడిచారు; ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కలేక నేలకు వాలారు; ఆ లేడి కన్నుల చిన్నదేమో తన ఎడంచేతి గోరుతో ముంగురులు సరిచేసుకుంటోంది; పైట సర్దుకుంటోంది; కడగంటి చూపులతో ఆ రాజ సమూహాన్ని పరిశీలిస్తోంది.
.♦"కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘసంకాశదే
హు, నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం, జక్రిఁ, బీతాంబరున్,
ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.❤"
.
(రుక్మిణీదేవి కృష్ణుణ్ణి కనుగొంది; అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు; పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు; విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వ లోక మనోహరంగా ఉన్నాడు;)
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩




Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!