శుభరాత్రి -సౌందర్య లహరి! **** 3****

-

శుభరాత్రి -సౌందర్య లహరి!

*

సౌందర్యలహరి శ్రీ శంకర భగవత్పాద విరచితము. ఇది 100 శ్లోకములతో కూడిన దేవీ స్తుతి గ్రంథము. పరబ్రహ్మ తత్త్వాన్ని 'శాంతం, శివం, సుందరం' అని పేర్కొంటాము. ఆ పరతత్త్వం, తత్స్వరూప సౌందర్య స్వభావ ప్రవర్తనాలు మానవాకృతిని దాల్చి, స్త్రీమూర్తిగా అభివ్యక్తమైతే ఎలావుంటుందో ఈ గ్రంథంలో అత్యంత మనోజ్ఞంగా వర్ణింపబడి ఉన్నవి. అంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మంను సగుణ సాకార రూపంలో ఉపాసించడానికి ఉపయుక్తమయ్యే అక్షరమాలారత్నం ఈ గ్రంథం. శ్లోకాలన్నీ మృదుమధుర గంభీరాలై, ప్రసాదసౌకుమార్యాలై వెలయుచు, భక్తిశ్రద్ధలతో చదివే దేవీభక్తులకు అనిర్వాచ్యమైన మనశ్శాంతిని కలుగజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

ఈ గ్రంథంలో దేవీ సౌందర్యం, స్వరూప - సంస్థితి - గుణ - చేష్టా - ప్రభావ - తత్త్వసౌందర్యాల - స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ భేదాలతో అత్యంత మనోహరంగా వర్ణించటం వలన శ్రీ శంకర భగవత్పాద విరచిత ఈ దేవీస్తుతికి సౌందర్యలహరి అనే నామకరణం ఎంతో సముచితంగా ఉంది. ఈ దేవియే యోగమాయ. ఆదిశక్తి ఐన ఈ తల్లి దుర్గాది శక్తిరూపాలను పొంది ఈ కలియుగంలో సర్వత్రా పూజలందుకుంటున్నది. ఆదిపరాశక్తియే ప్రతిగ్రామంలోనూ గ్రామశక్తిగావివిధ నామాలతో వెలయుచున్నది. పోలేరమ్మ, అంకమ్మ, గంగమ్మ,అని ప్రతి గ్రామానికీ గ్రామశక్తి ప్రధాన దేవతగా ఉంటుంది.

పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరుతున్నప్పుడు అది జ్ఞాతం కాకుండా ఉండడానికి దుర్గాస్తవం చేసి ఉన్నారు. అర్జునుడు కౌరవులతో సంగ్రామానికి మూందు శ్రీకృష్ణ ప్రేరితుడై దుర్గాదేవిని పూజించాడు. ఉపనయం సమయంలో మొదట ఉపదేశింప బడేది గాయత్రీ మంత్రమే కదా! అందువల్ల ప్రతి వ్యక్తీ మొదట శక్తి ఉపాసకుడే అవుతున్నాడు.

జగజ్జనని ఐన శ్రీదేవి తనను ఉపాసించే భక్తులను తన కన్నబిడ్డల్లా ప్రేమించి భుక్తి ముక్తులను తప్పక ప్రసాదిస్తుంది. అందువల్ల ఎల్లరూ తమ శక్త్యానుసారం పరాశక్తి, ఆదిశక్తి, శ్రీ రాజరాజేశ్వరీ, లలిత, శ్రీ మహాత్రిపురసుందరి అనే నామాలతో విరాజిల్లే శ్రీదేవిని ఉపాసించి శ్రీమాత అనుగ్రహంతో ఐహిక సుఖాలను మాత్రమే కాకుండ పునరావృత్తిరహితమూ, నిరతిశయ సుఖమూ అమృతధామము ఐన మోక్షాన్ని పొందుదురు గాక!

ఈ గ్రంథరాజానికి విస్తృత వాఖ్యానాలు ఎన్నో వున్నా, దేవి భక్తుల నిత్య పారాయణం నిమిత్తం ఈ గ్రంథాన్ని సంగ్రహ తాత్పర్యముతో, చిన్నపొత్తముగా వెలువరిస్తున్నాము. దేవీభక్తులకు ఈ చిన్నపొత్తము ఎంతో ప్రయోజనకారి కాగలదని మా ఆకాంక్ష.

******************************************************************************************************************

శ్లో|| శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం

న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి |

అతస్త్వా మారాధ్యాం హరిహర విరఞ్చాదిభిరపి

ప్రణంతుం స్తో్తుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి ||

అమ్మా, ఓ భగవతీ! సర్వమంగల సహితుడయిన శివుడు జగన్నిర్మాణశక్తివయిన నీతో కూడితేనేకాని జగాలను సృజించడానికి సమర్థుడు కాడు; నీతో కూడకపోతే ఆ దేవుడు తాను కదలటానికి సైతం అశక్తుడు. అలాంటప్పుడు హరి హర బ్రహ్మాదుల చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానికిగాని, స్తుతించటానికి గాని పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్థుడవుతాడు? కాడు.

******************************************************************************************* 1

శ్లో|| తనీయాంసం పాంసుం తవచరణ పజ్కేరుహ భవం

విరిఞ్చిస్సఞ్చిన్వన్‌ విరచయతి లోకా నవికలమ్‌ |

వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం

హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్‌ ||

ఓ మాతా! బ్రహ్మదేవుడు నీ చరణకమలాలలో పుట్టిన కించిత్తు పరాగాన్ని గ్రహించి లోకాలను ఎలాటి వైకల్యం లేకుండ సృజిస్తూన్నాడు. ఈ ఇంచుకపదరజస్సునే మహావిష్ణువు కూడా ఆదిశేషుడై తన వేయి శిరస్సులతో భారంగా మోస్తున్నాడు. దానినే శివుడు చక్కగామొదిపి తన శరీరానికి విభూతిగా అలదు కొంటున్నాడు.

******************************************************************************************* 2

శ్లో|| అవిద్యానా మంతస్తిమిర మిహిరద్వీపనగరీ

జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ |

దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ

నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||

అమ్మా! నీ పాదరేణువు అజ్ఞానుల తమోంధకారాన్ని పోగొట్టే సూర్యద్వీప నగరం. ఆ నీ పాదలేశం మందబద్ధులైన జడులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే ప్రవాహం; లేమిచేత కుంగిపోయే దరిద్రులకు, సకలసంపదలనిచ్చే చింతామణుల శ్రేణి. అంతేగాక జనన మరణ సంసారరూపమైన సాగరంలో మునిగి దరిగానక తపించే వారికి - విష్ణువు అవతారమైన ఆదివరాహస్వామియొక్క కోర అవుతోంది. అంటే ఉద్ధరించేది; సంసార సాగరాన్ని తరింపజేసేది అని భావం.

******************************************************************************************* 3

శ్లో|| త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః

త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |

భయాత్త్రాతుం దాతుం ఫలమపిచ వాఞ్చాసమధికం

శరణ్యే లోకానాం తవహిచరణా వేవ నిపుణౌ ||

భగవతీ! లోకశరణ్యా! ఇంద్రాదులైన దేవతాగణం తమ హస్తాలలో అభయ వరముద్రలను ధరించి వరాలను, అభయాన్ని ప్రసాదిస్తున్నారు. నీవు మాత్రం హస్తాలలో ఎలాంటి వరాభయముద్రలను ధరించవు కదా! కారణం, ఓ అంబా! భక్తులను భయం నుంచి రక్షించడానికి వారు కోరిన దానికన్నా అధిక ఫలాన్నిఒసగడానికి, ఆడంబరమైన బాహ్యప్రదర్శ లేని నీ పాదసరోజములే చాలును.

******************************************************************************************* 4

శ్లో|| హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం

పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్‌ |

స్మరో పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా

మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్‌ ||

ఓ జగన్మాతా! ప్రణమిల్లే భక్తజనులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను, పూర్వం శ్రీహరి ఆరాధించి సుందరాంగియై, త్రిపురాలను తెగటార్చి క్రోధావిష్టుడైన శివుడి మనసులో సైతం కామవికారాన్ని కలిగించి క్షోభపెట్టగలిగాడు. అలాగే మన్మథుడు నిన్ను కొలిచి, తన సతి రతీదేవి కన్నులను రంజింపచేయగల సౌందర్యాన్ని పొంది, ఆ రూపుతో అరణ్యాలలోతపస్సు చేసుకునే మునుల మనస్సులలో కామాభిలాష కలిగించటానికి సమర్థుడైనాడు. ఔరా! నీ ప్రసాద మహత్తు అద్భుతం కదా!

******************************************************************************************* 5

శ్లో|| ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః

వసంత స్సామంతో మలయమరు దాయోధన రథః |

తథా ప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్‌

అపాజ్గాత్తే లబ్ధ్వా జగదిద మనజ్గో విజయతే ||

ఓ హిమగిరి కుమారీ! మన్మథుడి విల్లు పువ్వులతోరూపొందించబడినది; వింటినారి తుమ్మెదల శ్రేణి; పుష్ప నిర్మితమైన బాణాలూ ఐదు అతడి అమ్ముల పొది; కాలబద్ధుడై మళ్ళీ మళ్ళీ వచ్చే వసంతుడు అతడి సామంతుడు; అతడి యుద్ధరథం నిరంతరం చలించే రూపులేని మలయమారుతం; ఇలా పనికిరాని పరికరాలు కలిగిన మన్మథుడు అంగ రహితుడు; బలిష్టమైన మేనులేని వాడు. అయిననూ, నిన్నారాధించి, నీ కడగంటి కటాక్షంతో ఈ జగత్తును తన ఆధీనములోనికి తెచ్చుకుంటున్నాడు.

******************************************************************************************* 6

శ్లో|| క్వణత్కాఞ్చీదామా కరికలభ కుంభస్తననతా

పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా |

ధనుర్బాణాన్‌ పాశం సృణి మపి దధానా కరతలైః

పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా ||

గణగణమని మ్రోగుతున్న చిరుగంటలతో కూడిన మొలనూలు కలదీ, గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే కుచముల భారంచే కాస్త ముందుకు వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుడి వంటి నెమ్మోము కలదీ, చెరకు వింటిని, పుష్పబాణాలను, పాశాన్ని, అంకుశాన్నిచేతుల్లో ధరించినదీ, త్రిపురాలను మట్టుపెట్టిన శివుడి శౌర్యస్వరూప ఐన భగవతీదేవి మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక!.

******************************************************************************************* 7

శ్లో|| సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే

మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే|

శివాకారే మఞ్చే పరమశివపర్యజ్కనిలయామ్‌

భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్‌ ||

తల్లీ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, కల్పవృక్షాల వరుసతో చుట్టబడినదైన కదంబచెట్ల పూలతోటలలో చెలువొందే చింతామణులతో నిర్మితమైన గృహంలో, పరబ్రహ్మ అయినటువంటి పరమశివ పర్యంకనిలయవై, మంగళరూపమైన ( త్రికోణపు) పానుపుపై, నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివైన నిన్ను కొందరు ధన్యులుమాత్రం సేవిస్తున్నారు. (అందరికీ సామాన్యంగా నీ సేవ లభించదని భావం).

******************************************************************************************* 8

శ్లో|| మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం

స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి |

మనో పి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం

సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే ||

ఓ భగవతీ! నువ్వు మూలాధారంలోవున్న పృథివీతత్త్వాన్ని, మణిపుర చక్రంలోవున్న ఉదకతత్త్వాన్ని, స్వాధిష్ఠాన చక్రంలోని అగ్నితత్త్వాన్ని, అనాహత చక్రంలోని వాయుతత్త్వాన్ని, అంతకు పైనవుండే విశుద్ధచక్రంలోని ఆకాశ తత్త్వాన్ని, కనుబొమల నడుమనుండే ఆజ్ఞాచక్రంలోని మనస్తత్త్వాన్ని వీడి, సుషుమ్నా మార్గాన్ని ఛేదించుకొని సహస్రార కమలంలోని నీ భర్త ఐన సదాశివుడితో కూడి రహస్యంగా విహరిస్తున్నావు.

*************************************************************************

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!