మంచివారికి చెప్పిన సలహా రాణిస్తుందేమో !

-

మంచివారికి చెప్పిన సలహా రాణిస్తుందేమో !

(శర్మగారి కాలక్షేపంకబుర్లు-సలహా)

.

ఈ మధ్య ఒక రోజు మరునాటి టపా రాదామని కూచుంటే 

ఒక జంట వచ్చేరు. రమ్మని కుర్చీలు చూపించి చూస్తుండగా అతను “గుర్తు పట్టలేదండీ” అన్నాడు. అప్పుడు గొంతు గుర్తుపట్టి, “ఎలా వున్నా”రన్నా. ఉభయ కుశలో పరి, “నేను మళ్ళీ ఈ ఊరు ఉద్యోగానికొచ్చా. ఎదురుగా ఉన్న అపార్ట్మెంటులో అద్దెకుదిగా నిన్న, మిమ్మల్ని చూడాలని వచ్చా మ”న్నారు. “పిల్లలెలా వున్నా”రంటే, “మీదయవల్ల కులాసా,” అని నా మిత్రుని భార్య ఇలా అంది.

.

“ఉద్యోగంకి వచ్చిన కొత్తలో ఓవర్ టైం డబ్బులొచ్చినపుడు చెప్పేరట మీరు, ఆ డబ్బులు బోనస్ డబ్బు పెట్టి బంగారం కొనడం మొదలు పెట్టి ఏభయి తులాలు చేసి అమ్మాయికి పెట్టేం.” 

దానికతను “ఏం పెట్టి ఏం ఉపయోగమైందండి అల్లుడు కాలం చేశాడు, మీరు ఎక్కడో ఉన్నవారు కబురు తెలిసి వచ్చి చూసి ఓదారుస్తూ, అమ్మాయిని రెండేళ్ళు పలకరించకండి, ఈ విషయాలమీద, ఆపు చేసిన చదువు పూర్తి చేయనివ్వండి. ఆ తరవాత మళ్ళీ పెళ్ళి గురించి అలోచిద్దామన్నారు. సరిగా అలాగే జరిగింది.

.

అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, ఈ లోగా మా బంధువులొకరు ఒక సంబంధం తెచ్చేరు. వాళ్ళకీ విషయం తెలియదేమోనని వెళ్ళి చెబితే, మాకు విషయం తెలుసును, అబ్బాయి అమ్మాయిని ఇష్ట పడుతున్నాడు, విషయం తెలిసి కూడా. అమ్మాయికి చెప్పండి. అమ్మాయి ఇష్టపడితే వివాహం చేద్దామన్నారు. 

అమ్మాయికి చెప్పేము. ముందు కాదంది, కాబోయే దంపతులను ఒక చోట చేర్చి మాటాడు కోమన్నాము. ఇద్దరూ మాటాడుకుని నిర్ణయానికొచ్చిన తరవాత పెళ్ళి చేసేసేము. 

మూడేళ్ళయింది. ఎవరికి చెప్పలేదు, పిలవలేదు.ఇప్పుడు అమ్మాయికి ఒక అబ్బాయి, వాళ్ళు ఇప్పుడు బెంగుళూర్ లో ఉంటున్నారన్నాడు. ఇది మీ సలహా చలవే” అన్నాడు.

“మంచి కబురు చెప్పేరు, అలా జరగాలి, నేను కాకపోతే మరొకరు చెబుతారా సలహా. ఇది మీ అభిమానం” అన్నా.

“మీ, మరొక సలహా చాలా ఆలస్యంగా చేస్తున్నది, మూఢం వెళ్ళిన వెంటనే ఇంటి శంకుస్థాపన చేస్తున్నా” అన్నారు.

మంచివారికి చెప్పిన సలహా రాణిస్తుందేమో!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!