శ్రీకృష్ణలీలలు – అఘాసుర వధ
శ్రీకృష్ణలీలలు – అఘాసుర వధ

శ్రీ గర్గభాగవతము లోని కథ
ఏ పరమపూరుషుని బ్రహ్మణ్యులు పరబ్రహ్మ అని, వైష్ణవులు విష్ణువని, శైవులు మరియు ఇతర భక్తులు శివుడని, కాపాలికులు కాలభైరవుడని, శాక్తేయులు శక్తి అని కొలిచెదరో అట్టి వేదవేద్యుడైన స్వామి గోపబాలురకు సఖునిగా స్నేహితునిగా మెలిగి వారితో కలిసి తని ఆడి పాడి వరిని తరింపచేసినాడు. ఆహా! గోపబాలుల అదృష్టమే అదృష్టము. (అదృష్టమంటే కనబడనిది – అంటే మన జన్మజన్మాంతరాల కర్మఫలము)
ఒకసారి శ్రీకృష్ణుడు గోపబాలురు యమునాతీరమున ఆడుచుండగా కంసప్రేరితుడైన బకాసురుని జ్యేష్ఠపుత్రుడు అఘాసురుడు ఒక పెద్ద కొండచిలువ రూపమున వచ్చి నోటిని తెరిచి శ్రీకృష్ణునికై ఎదురుచూసెను. దాని పైపెదవి మేఘమండలమును క్రింది పెదవి భూమిని తాకుచుండెను! శ్రీకృష్ణలీలలను ప్రత్యక్షముగా చాలాసార్లు చూసిన గోపబాలురు అతడే రక్షిస్తాడనే నమ్మకముతో గోవులతో సహా పెద్దకొండబిలము వలెనున్న అఘాసురుని నోటిలోకి వెళ్ళిపోయినారు.
నందకిశోరుడు కూడా లోనికి ప్రవేశించెను. పరమాత్మ ప్రవేశించగానే అఘాసురుడు నోరుమూసివేసెను. విషవాయువుల ప్రభావముచే గోవులు గోపబాలురు ప్రాణములు విడిచిరి. అప్పుడు పరమాత్మ అఘాసురుని నవరంధ్రాలను మూసి ఉదరము ఉబ్బునట్టు చేసెను. అఘాసురుని పొట్టపగిలి నందనందనుడు బయటికి వచ్చెను. సంకల్పమాత్రముచే శ్రీకృష్ణుడు గోవులను గోపబాలురను బ్రతికించెను. అఘాసురుడు ముక్తినొందెను.
అఘాసురుని వృత్తాంతము:
శంఖుడనే రాక్షసుని కుమారుడు అఘాసురుడు. అతడు సుందరాంగుడు యౌవనుడు బలిష్ఠదేహుడు. కాని పరులను నిందించు స్వభావము కలవాడు. వాడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూచి “ఇన్ని వంకరలేమి” అని హేళన చేసెను. మహర్షి అనుగ్రహము చూపుటకు “ఓరీ! వంకరలని హేళన చేసిన నీవు సర్పరూపమును ధరింతువు” అని శపించెను. చేసిన తప్పుకు పశ్చాత్తాపముచెంది రక్షించమని ప్రార్థించిన అఘాసురునితో అష్టావక్ర మహర్షి
“నాయనా! పరనింద మృత్యువువంటిది. మనము అనవసరముగా ఎవరినైనా నిందిస్తే నిందింపబడిన వాడి పాపములో సగం మనకివస్తుంది. అంతేకాక మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యసర్వస్వములో సగం అతనికి వెళిపోతుంది. కావున అనవసరముగా పరనిందచేయరాదు. నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపముచెంది పాపఫలము అనుభవించిన తరువాత ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించినాడు.
Comments
Post a Comment