కృష్ణం వన్దే జగద్గురుమ్
కృష్ణం వన్దే జగద్గురుమ్
భారతీయుల పాలి పెన్నిధి అయిన గీతామృతాన్ని అందించిన శ్రీ కృష్ణ పరమాత్మ ఇప్పుడే “అమ్మా” అనటం నేర్చుకుంటున్నాడు. వామనునిగా భూమ్యాకాశాలను రెండడుగులతో కొలిచిన నల్లనయ్య ఇప్పుడే తప్పటడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. దిన దినాభివృద్ధిగా తల్లితండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరుగుతున్నాడు.
బాలకృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో అల్లరి ఆటలాడేవాడు. లీలామానుష విగ్రహుడైన ఆ కన్నయ్య అల్లరి నిజమని నమ్మారు గోపికలు. చిన్ని కృష్ణుడు చేసే వినోదాలు తమయెడల అనుగ్రహించిన మహాప్రసాదాలని మహోపదేశాలని పాపం వారు తెలుసుకోలేక పోయారు. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుని తత్త్వం తెలుసుకొనుట ఎవఱి తఱము ?
కన్నయ్య అల్లరి పనులకు ఓర్పు నశించిన గోపిక ఇలా యశోదతో మొఱబెట్టుకున్నది “అమ్మా! యశోదా! నీ పాపని అల్లరిని ఏమని చెప్పేది? మా యింటిలోని బాలింతలకు పాపం పసి పాపలకు ఇవ్వడనికి పాలులేవు. ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న పాపలకి గోక్షీరమైనా పడదామని అనుకున్నారు. ఇంతలో మీ పాపడు వచ్చి బాలింతల మొఱలు వినకుండా లేగదూడల త్రాళ్ళు విప్పి ఆవుల వద్ద వదిలేశాడు. అవి ఆవుల పాలు త్రాగివేశాయి. పిల్లలకు పాలు ఇవ్వలేక పోయిన ఆ బాలింతల దుఃఖం వర్ణనాతీతం. ఇది ఏమైనా న్యాయమా? ఓ అంభోజాక్షీ! చెప్పవమ్మ!”.
బాలురకుఁ బాలు లే వని
బాలెంతలు మొఱలు వెట్టఁ బకపక నగి యీ
బాలుం డాలము సేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
Comments
Post a Comment