“పాలుపంచుకొనుట”

ఒకనాడు బాలకృష్ణుడు గోపబాలురతో కూడి ఆటలాడుచుండెను. “మీరందఱూ వేషధారులు నేను సూత్రధారిని” అంటూ వారితో వింత ఆటలాడేవాడు చిన్నికృష్ణుడు. ఆటలమధ్యలో ఉండగా వారికి కమ్మని కాగిన పాల వాసనలు వచ్చినవి. వారు ఆ వాసనలు వచ్చుచున్న ఇంటిలోకి వెళ్ళారు. అక్కడ వారికి ఎన్నో కడవలనిండా మంచిగా కాగిన కమ్మని పాలు కనిపించాయి. అఖిలలోక వసుప్రదాత అయిన కృష్ణస్వామి కడవలలోని పాలను తన తోడిపిల్లలకు పంచివేశాడు. అంతటితో ఆగకుండా ఖాళీ అయిన కడవలను కూడా పగులగొట్టి వేశాడు.


కన్నయ్య చేతలోని ఆంతర్యం గ్రహించలేక పాపం ఆ ఇంటి పడుచు యశోదతో శ్రీకృష్ణుని దుడుకుపని వివరించి “ఓ పడతీ! నీ బిడ్డడు మా ఇంట ఇటువంటి అల్లరి చేశాడు. అసలు మీ వాడికి భయభక్తులు ఉన్నాయా?” అని వాబోయింది. ఆ లీలామానుషవిగ్రహుని అర్థం చేసుకొనుట ఎవరి తఱం ?


పడఁతీ! నీ బిడ్డఁడు మా

కడవలలో నున్న మంచి కాఁగిన పా లా

పడుచులకుఁ బోసి చిక్కిన

కడవలఁ బో నడిచె నాజ్ఞ గలదో లేదో?


జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?

“పాలు” అనే శబ్దము పంచుకోదగిన పదార్థమునకు సంకేతము. అందుకనే మన తేనెల తెలుగు భాషలో “పాలుపంచుకొనుట” అనే ప్రయోగం ఉన్నది. నలుగురికీ ఉపయోగపడే పదార్థమును పంచుకోకుండా తమకోసమే నిలువ చేసుకోరాదని శ్రీ కృష్ణ జగద్గురువు మనకీ కథ ద్వారా బోధించాడు. అందుకనే మిగిలిన కడవలను కూడా పగులగొట్టి పంచుకో తగినవి నిలవచేసుకోనీయకుండా చేశాడు. మీ-మా అనుభేదాలు మఱచి తోటి జనులతో సహజీవనము చేయమన్నదే ఆ సర్వేశ్వరుని సందేశం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!