గ్లోబల్ దేవుడు గోవిందుడే!..

గ్లోబల్ దేవుడు గోవిందుడే!..................(.కామేశ్వర రావు భైరవభట్ల  )


శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనా డింభకున్

అంతర్జాతీయ "గుర్తింపు" పొందిన మన ఒకే ఒక్క దేవుడు శ్రీకృష్ణుడు! :-) తిరుపతి వెంకన్నకి కూడా ప్రపంచమంతా పెద్ద భక్తబృందమే ఉంది కాని, అతని పేరిట అంతర్జాతీయ సంస్థ లేదు కదా! పైగా ఆ వెంకన్న భక్తులు కూడా నిత్యం "గోవింద" నామస్మరణే కదా చేస్తారు! కాబట్టి మన "గ్లోబల్" దేవునిగా కృష్ణయ్యనే నేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాను. ఈ రోజతని పుట్టినరోజు సందర్భంగా బ్లాఙ్ముఖంగా ఆ "దేవదేవునికి" (చూసారా దేవుళ్ళకే దేవుడాయన!) జన్మదిన శుభాకాంక్షలతో పాటు "గ్లోబల్" దేవునిగా ఎన్నికైనందుకు నా అభినందనలని కూడా అందిస్తున్నాను.
శ్రీకృష్ణుడంటే చిన్నపిల్లల నుంచీ ముసలివాళ్ళ దాకా అందరికీ ఎంతో మురిపెం!

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు, పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి గొలుతు.

చిన్నపిల్లల సంగతి ఇలా ఉంటే, ఆ పండు ముదుసలి భీష్ముడు శ్రీకృష్ణదేవుని రూపాన్ని, అదీను తనని చంపడానికి వస్తున్న వాడిని ఎంత భక్తి తన్మయతతో దర్శించాడో చూడండి!

కుప్పించి యెగసిన కుండలమ్ముల కాంతి
గగనభాగంబెల్ల గప్పికొనగ
ఉరికిన నోర్వక నుదరంబులోనున్న
జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ

కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు
పద్యమాలిక, పోతన 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!