త్రిజటా స్వప్న వృత్తాంతము !

త్రిజటా స్వప్న వృత్తాంతము !

( అధ్యాత్మ రామాయణము నుండి)

,

లంకా పట్టణములో - అశోక వనములో - శింశుపా వృక్షము నీడలో సీత కలదు. 

ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా ఉంటున్నారు.

వారు సీతను భయపెట్టుచూ ఆమెపై ఒత్తిడి తెచ్చుచున్నారు - 

అట్టి పరిస్థితులలో త్రిజట (విభీషణుని కుమార్తె) అక్కడి రాక్షస స్త్రీలతో 

తన స్వప్న వృత్తాంతమును ఈ విధముగా తెలిపెను:

.

వనితారత్నములార! చోద్యమగు స్వప్నంబొండు నే గాంచితిన్

మనమారన్ వినిపింతు సత్యములగున్ నా స్వప్నముల్ సర్వదా

జనకేశాత్మజయైన యీ సుముఖియే సాక్షాద్రమాదేవి కా

వున నే దుష్కృతమైన పూన వలదీ పూబోడి పై నెన్నడున్

.

రాజీవ నేత్రుడౌ రాముడు సహజుతో

....నైరావతము నెక్కి యరుగుదెంచి

లంకాపురిని గాల్చి రావణాసురు గూల్చి

.

....సీతతో గిరిపైని చేరినట్లు

దశకంఠు డొడలికి తైలంపు బూతతో

....బట్టలు విడనాడి పట్టణమున

పుత్ర పౌత్రుల గూడి పుర్రెల చేబూని

....కొలనిలో దిగినట్లు గోచరించె

.

వినయమున రాముజేరె విభీషణుండు 

కనుడు రావణ వంశ నాశనమొనర్చి

రాముడు విభీషణునకు నీ రాజ్యమునిడి

సీతతో తన నగరికిన్ జేరగలడు 

.

త్రిజట మాటలు వినినట్టి స్త్రీలు మనము

లందు మిక్కిలి భయమొంది యవనిజాత

యందుదాసీనలై వ్రాలి యందు నందు

చింతనల మాని నిద్దుర జెంది రంత

Comments