Skip to main content
విజయనగరములో బొంకులదిబ్బ.
శ్రీగురుజాడా అప్పారావు గారి కన్యాశుల్కము -
ప్రథమాంకము.( విజయనగరములో బొంకులదిబ్బ.)
.
(గిరీశం మధురవాణి తో కలసి ఓకే ఫోటో తియించు కుంటాడు .. దానికి డబ్బులు
ఇవ్వడు .. ఆ బాకి కోసం వస్తాడు ఒక బంట్రోతు .. ఈ శీను చాల బాగుంటుంది,)
ఒకబంట్రోతుప్రవేశించును.
బంట్రోతు ..... నేను పొటిగరాప్పంతులుగ
ారి నౌఖర్నండి, లెక్క జరూరుగుందండి, పొటిగరాపుల కరీదు యెంటనె యిప్పించమన్నారండి.
.
గిరీశం (విననట్టు నటించుతూ)
ఫుల్లుమూను లైటటా,
జాసమిన్ను వైటటా,
మూను కన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా! టా! టా!
.
బంట్రోతు యంతమందిని పంపినా యిచ్చారు కారటండి, నేనాళ్ల లాగూరుకుండేవోణ్ణి కానండి.
.
గిరీ అయ్య కోనేటికి తోవయిదే.
.
బంట్రోతు యక్కడి శెవిఁటిమాలోకం వొచ్చిందయ్యా.
.
గిరీ కోవఁటి దుకాణవాఁ? కస్పా బజార్లోగాని యిటివేపులేదు.
.
బంట్రోతు (గట్టిగా చెవిదగ్గిర నోరుపెట్టి) పోటిగరాపులు కరీదిస్తారా యివ్వరా?
.
గిరీ బస, రాధారీ బంగాళాలో చెయ్యొచ్చును.
.
బంట్రోతు (మరీగట్టిగా) యాడాదికిందట మీరూ సాన్దీ కలిసి యేసుకున్న పోటిగరాపులకరీదు మాపంతులు నిలబెట్టి పుచ్చుకొమ్మన్నారు.
.
గిరీ ఓహో నీవటోయ్, యవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు, నింపాదిగా మాట్లాడు. రేపువుదయం యెనిమిది ఘంటలకి పూటకూళమ్మ యింటికి వొస్తే అణా ఫయిసల్తో సొమ్మిచ్చేస్తాను. మీ పంతులికి స్నేహం మంచీ చెడ్డా అక్కర్లేదూ?
.
బంట్రోతు మాటల్తో కార్యం లేదు. మొల్లోశెయ్యెట్టి నిల్సున్నపాట్ని పుచ్చుకొమ్మన్నారండి.
.
గిరీ పెద్దమనిషివిగదా; నువ్వూ తొందరపడ్డం మంచిదేనా? నీ తండ్రి యంత పెద్దమనిషి.
యీ చుట్టచూడు యంత మజాగా కాల్తుందో. హవానా అంటారు దొర్లు దీన్ని. రేప్పొద్దున్నరా రెండు కట్టలిస్తాను.
.
బంట్రోతు శిత్తం సొమ్ము మాటేం శలవండి.
.
గిరీశం చెప్పా`నుకానా? రేప్పొద్దున్న యివ్వకపోతే మాలవాడికొడుకు ఛండాలుడు.
.
బంట్రోతు మాలాడికొడుకు శండాలుడు కాకుంటే మరేటండి.
.
గిరీశం నీకు నమ్మకం చాలకపోతే యిదిగో గాయత్రీపట్టుకు ప్రమాణంచేస్తాను.
.
బంట్రోతు శిత్తం, రేపు పొద్దున్న సొమ్మియ్యకపోతే నా ఆబోరుండదండి.
.
గిరీశం
ఆహాఁ! నీ ఆబోరు ఒహటీ, నా ఆబోరు ఒహటీనా?
.
[బంట్రోతు నిష్క్రమించును.]
.
ఇన్నాళ్లకి జంఝప్పోస వినియోగంల్లోకి వొచ్చింది. ధియాసొఫిస్టుసు చెప్పినట్లు మన ఓల్డు కస్టమ్సు అన్నిటికీ యేదో ఒహ ప్రయోజనం ఆలోచించే మనవాళ్లు యార్పరిచారు. ఆత్మానుభవం అయితేనేగాని తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని వొదుల్చుకునేసరికి తలప్రాణంతోక్కొచ్చింది.
శీఘ్రబుద్ధేః పలాయనం. పెందరాళే యీవూర్నించి వుడాయిస్తేనేకాని
ఆబోరు దక్కదు. యిక మధురవాణి యింటికి వెళదాం.
మేక్ హే వైల్దీ సన్ షైన్స్ అన్నాడు.
Comments
Post a Comment