భవభూతి -కాళిదాసుల తాంబూల చర్వణం లేక ఒక అణా కధ . !

భవభూతి -కాళిదాసుల తాంబూల చర్వణం లేక ఒక అణా కధ . !

(ఆచార్య @ Satyanarayana Choppakatla గారి అద్బుత కధ )

భవభూతి కాళిదాసులు సమకాలికులా?కాదా? అనేది సంస్కృతవాఙ్మయచరిత్రలో యిప్పటికీ వివాదాంశమే, అయితే వీరిద్దరూ మహాకవులగుట మాత్రం చెరగని నిజం. కాళిదాస కృతమైన అభిజ్ఙాన శాకుంతలమ్ నాటకాని కెంత ప్రశస్తిగలదో భవభూతి ఉత్తర రామచరితమ్ నాటకానికిగూడా అంతేప్రశస్తి యేర్పడింది. అదీ వారికవితలలోని విశిష్ఠత! మనకి ఆవివాదాలతో పనిలేదు. లోకంలో వారిద్దరికీ సంబంధించిన ఒక కథ ప్రచారంలోవుంది. దాన్నితెలిసికొందాం!

ఆమహా కవులిద్దరూ ఒకనాడు సాయంసమయంలో వాహ్యాళికి బయలుదేరారు. మాటలు చెప్పుకంటూ కొంతదూరం వచ్చారు. ఇంతలో భవభూతికి తాంబూలంమీద మనసు మళ్ళింది. రొంటినున్న తములపు సంచిని తెరచి చూచారు. సున్నండబ్బా కనబడలేదు. ఆకులుగూడా తక్కువగానేఉన్నాయి. వెంటనే యిటునటు చూసి, ఎదుట నున్నగృహం అరుగుమీద ఆసీనులయ్యారు. ఇంతలో నొక కాంచనాంగి వచ్చి నమస్కరించి సెలవీయండి అని వినయంగా పలికింది. వెంటనే భవభూతి ,

" తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే!(పున్నమి చమదమామ వంటి మొగముగల ఓచిన్నదానా వెంటనే సున్నంతెచ్చిపెట్టు - అనిదానియర్ధం)

ఆపిల్ల "చిత్తం"- అంటూ లోపలకు పోబోయింది. అంతలో కాళిదాసుగారు" అయి !శ్రూయతాం "పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతాకీర్ణ లోచనే ! అన్నాడు.(" ఓవిశాలాక్షీ! బంగారు రంగుగల తములపాకులనుగూడా కొన్నింటిని గొనితెమ్ము"- అనిదానియర్ధం)

ఆమె నవ్వుకుంటూ లోనికేగి బంగరు పళ్ళెరమున తములపాకులను వక్కలను సున్నమును తక్కుగల సుగంధ వస్తువులను గొనితెచ్చి ముందుగా కాళిదాసుగారికి ఆపళ్ళెం అందించింది. అదిచూచి భవభూతి యించుకకోపంతో

" యేంపిల్లా! ముందు అడిగింది నేనుగదా ? నాకీయక కాళిదాసున కేలయిచ్చితివి? మర్యాదను పాటింపకుండుట పాడియే"-యనిపలికెను.

అంత నామె వినయముతో కవివరా ! నేను మర్యాద నతిక్రమించలేదు. మాకులపు మర్యాదను పాటించినాను.మేము వేశ్యలముగదా! యెవరెక్కువ సొమ్మిచ్చిన వారిని ముందుగౌరవించుట మాకుల ధర్మము.

మీరు మూడణాలే యిచ్చారు.కానీ, 

కాళిదాసుగారు ఐదణాలు చదివించారు.

మరి ముందుగా కాళిదాసుగారికే యివ్వాలిగదా! అందుకే యిచ్చాను.మరి నా తప్పేముంది? అన్నదట!

ఈఅణాల గొడవేమిటో యిప్పుడు పరిశీలిద్దాం! బ్రిటీషువారి హయాంలో ద్రవ్య వినిమయంలో అణా అనే నాణెం ఉండేది.రూపాయి, అర్ధరూపాయి,పావలా,బేడ, అణా, కానీ, ఇదీనాటి వ్యవహారం. అందులోఅణా!

తెలుగు అక్షరమాలలో ణ అనే అక్షరంఉంది. దాన్ని మనవాళ్ళు ఉచ్చారణలో అణా అంటూఉంటారు.

ఇప్పుడు చూడండి," తూర్ణ మానీయతాం చూర్ణం పూర్ణ చంద్ర నిభాననే! ఇందులో 3 అణాలేఉన్నాయి.

పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతా కీర్ణ లోచనే! ఇందులో 5అణాలున్నాయి. మొదటిది భవభూతిది కాగా రెండవది కాళిదాసుది.కాబట్టి యెక్కువ యిచ్చిన వారికే మాయింట ముందుగా గౌరవం లభిస్తుందండీ యిది మాకులాచారమన్నదట! 

ఔరా!యెంతజాణ! ఆవారాంగన!

పూర్వం పెళ్ళిలలో యిలాంటివి జరుగుతూ ఉండేవి.మేజువాణిలో ప్రథమ తాంబూలంకోసం మొగవారు యెగబడి ఒకరికన్నా మరొకరు సొమ్ములు చదివించేవారు.

ఇంతకీ కాళిదాసు కాలంలో యీఅణాలున్నాయా? ఇదేదో కల్పన. అయినా వినటానికి యింపుగాఉందిగదూ?

స్వస్తి!.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!