మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 29.

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 29.

-

అర్థమనర్థం భావయ నిత్యం 

నాస్తితతః సుఖలేశః సత్యం|

పుత్రాదపి ధన భాజాం భీతిః

సర్వత్రైషా విహితా రీతిః||

-

శ్లోకం అర్ధం :

ధనమెల్లప్పుడును అనర్ధమునే కలిగించునని గ్రహించుము, ధనము వలన సుఖము కొంచెమైనను కలుగదు, ఇది సత్యము. ధనవంతులు పుత్రునివలన కూడా భయపడుదురు. ప్రపంచమంతా ఇదే రీతిగా ఉన్నది.

తాత్పర్యము : 

మోసము తోటి, కపటము తోటి ఎన్నో అడ్డదారులు తొక్కి కూడబెట్టిన అస్తే చివరకు నీకు కష్టమును కలిగించును. అధికమైన సంపదల వలన నీకు నీ బంధువుల వలన, మిత్రుల వలన, సేవకుల వలన, చివరకు నీ సొంత బిడ్డల వలన కూడా అపాయము జెరుగ వచ్చును. 

మొదట ధనము సంపాదించుటకు అవస్థలు పడి, తరువాత దాచుకొనుటకు అవస్థలు పడి, చివరకు నీ ప్రాణము రక్షించుకొనుటకు అవస్థలు పడవలసి వచ్చుచున్నది. అట్టి ధనములో చింతాకంత కూడా నీవు నీతో తీసుకుపోలేవు. నా బిడ్డలు, నా వాళ్ళు అని స్వార్ధముతో నీవు దాచిన ధనము వలన నీకు ప్రయోజనమేమిటి. 

అంతే కాదు, ఆ ధనము నీవు సంపాదించి వారికి పెట్టువరకే నీకు మర్యాద, దానిని సంపాదించలేనపుడు నీ సంగతి ఎవ్వరూ పట్టించుకోరు. ధనహీనుడవైన నీవు నలుగురిలో అపహాస్యపు పాలు కూడా అగుదువు. 

కనుక, ధన చింతన మాని, సమయమును దైవ చింతనకై ఉపయోగించి జీవితమును సఫలము చేసుకొనుము. 

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!