భగీరధ ప్రయత్నం!

భగీరధ ప్రయత్నం!

-

భగీరధుడు ఘోర తపస్సు చేసి దేవలోకంలో ఉన్న గంగను భువికి దించి తన పితరులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు. 

ఇదీ సాదారణంగా అందరికీ తెలిసిన కధ.కానీ భగీరధుడి పూర్వులకు ఏమైనది? వారికి పుణ్యలోకాలు ఎందుకు కలగలేదు? అంటే మాత్రం ఏ కొద్ది మందో తప్పితే చెప్పలేరు.

.

ఇప్పుడు భగీరధుడు గంగ కోసం తపస్సు చెయ్యాల్సిన అవసరం ఎందుకొచ్చింది? చివరికి ఏమైనది అనేది ఈ ప్రచురణలో వివరిస్తాను

సగరుడు ఇక్ష్వాకు వంశంలోని రాజు. శ్రీరాముని పూర్వుడు. అతనికి యవనాశ్వుడనే పుత్రునితో పాటు అరవై వేల మంది పుత్రులు కలరు. ఒకనాడు సగరుడు అశ్వమేధ యాగము చేయుటకు తలచెను.తలచినదే తడవుగా తన కులగురువును సంప్రదించి సుముహుర్తము నిర్ణయించి యాగము ప్రారంభించెను.యజ్ఞ సమాప్తి అయిన పిదప యజ్ఞాశ్వమును వదలి దానికి రక్షకులుగా సగరుని అరవై వేల మంది పుత్రులు వెడలిరి.ఈ యాగమును చూసి ఇంద్రుడు ఇది తన ఇంద్ర పదవి కొరకై జరుగుతున్న యజ్ఞము గా భావించి దానిని భగ్నము చేయుటకై ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి పాతాళం లో ఉన్న కపిల మహర్షి ఆశ్రమములో దాచెను. అశ్వ రక్షకులైన సగరుని పుత్రులు దాని కొరకై వెదకుచూ అన్ని లోకములలోనూ గాలించి చివరకు పాతళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో తమ అశ్వాన్ని కనుగొని , కపిలుడే తమ అశ్వమును అపహరించినాడని తలచి పరిపరివిధముల కపిలుని దూషించిరి. దానికి మిక్కిలి కోపోద్రిక్తుడైన కపిలుడు వారిని భస్మము చేసెను. 

-

అశ్వ రక్షకులుగా వెళ్ళిన తన పుత్రుల జాడ తెలియక చింతించుచున్న సగరుని అతని మనుమడైన(యవనాశ్వుని పుత్రుడు) అంశుమంతుడు ఊరడించి వారిని గాలించుటకు తాను వెడలెను. అంశుమంతుడు సకల లోకాలనూ గాలించి చివరకు కపిల ముని ఆశ్రమమునకు చేరుకొని అక్కడ తమ యజ్ఞాశ్వమునూ, దాని ప్రక్కననే ఉన్న భస్మ రాశులను చూసి జరిగినది గ్రహించి కపిలుని వద్దకు వెళ్ళి పరిపరివిధముల ప్రార్ధించి తన పితరులకు పుణ్యలోకములు ప్రాప్తించు మార్గమును తెలుపమనెను. దానితో శాంతుడైన కపిలుడు అతనిని ఊరడించి దేవలోకములో నున్న గంగా జలము వారి భస్మ రాశుల పై నుండి ప్రవహించినచో వారికి పుణ్యలోకాలు సంప్రాప్తించగలవని సెలవిచ్చెను.

-

అంశుమంతుడు విచారవదనుడై తిరిగి వచ్చి జరిగిన వృత్తాంతమును అందరికీ వివరించెను. అంశుమంతుడూ , అతని కుమారుడైన దిలీపుడూ గంగను భువికి తెచ్చు మార్గమును అన్వేషించుచునే పరమపదించినారు. దిలీపుని కొదుకైన భగీరదుడు తన పితరులకు ఎటులైననూ పుణ్యగతులు కలిగించవలెనని యోచించి గంగను గూర్చి తీవ్రముగా తపస్సు చేసెను. అటుల కొన్ని సంవత్సరములు గడచిన పిదప గంగ ప్రత్యక్షమాయెను. ఆమెకు ప్రణమిల్లి భగీరదుడు తన పితరులను పునీతులను చేయమని ప్రార్ధింపగా, తాను దివి నుండి భువికు వచ్చు వేగమును భూమి తాళలేదనియూ , తనను భరించువానిని చూపమని చెప్పి అదృశ్యమయ్యెను. తరుణోపాయము కానక భగీరదుడు బ్రహ్మ గురించి తపమారంభించెను. కొన్నాళ్ళకు బ్రహ్మ ప్రత్యక్షమై గంగను భరించుటకు తగినవాడు పరమశివుడే గాన ఆతనిని గురించి తపస్సు చేయమని సూచించెను. భగీరదుడు పరమశివుని గూర్చి తీవ్రమైన తపస్సు చేసెను. దానికి సంతసించి పరమశివుడు ప్రత్యక్షమై వరము కొరుకోమనగా గంగ భువి నుండి దివికి దిగు సమయమున ఆమె వేగమును భరించుమని వేడగా అట్లే యని తన అంగీకారము తెలిపెను. పిదప భగీరదుడు గంగను ప్రార్దించగా గంగ తీవ్రమైన ఉద్ధృతితో పై నుండి ప్రవహించగా మహదేవుడు అద్భుతముగా తన జటాజూటిలో బంధించెను. మరలా భగీరదుడు శివుని ప్రార్ధించగా తన జటలోనుండి ఒక పాయగా గంగను వదిలెను.అటుల భువికి దిగిన గంగ తన ప్రయాణంలో ఐదు పాయలుగా విడిపోయి ఒక పాయ భగీరదుని వెంట రాగా మిగిలిన పాయలు చెరొక దిశగా నాలుగు దిక్కులకూ ప్రవహించినవి.

-

అటుల భగీరదుని వెంట వచ్చుచున్న గంగలో ప్రజలందరూ పుణ్య స్నానములాచరించి పవిత్రులైరి. అలా వచ్చుచున్న గంగ ఉద్ధృతికి జహ్ను ముని ఆశ్రమమంతయూ జలమయమయ్యెను.దానికి కోపించిన ఆ ఋషి భగీరదుని వెంట వచ్చుచున్న గంగ లోని జలమంతయూ త్రాగి వేసెను. భగీరదుడు ఆ మునిని ప్రార్ధించగా ఆయన తన కర్ణ రంధ్రము ద్వారా గంగను వదిలెను. అలా ప్రయాణిస్తూ చివరికి పాతళంలోనున్న కపిలుని ఆశ్రమం చేరి అక్కడ ఉన్న సగర పుత్రుల భస్మరాశుల పై ప్రవహించి వారి కి పుణ్యలోక ప్రాప్తి కలిగించెను. సగరుల భస్మరాశులు కలిసిన ఆ ప్రదేశం సాగరం గా ప్రసిద్ధి చెందెను. అటులనే భగీరదుని చే భువికి గొని రాబడుటచే భాగీరధి అనియూ, మూడు లోకములనూ పావనము చేసినది గాన త్రిపధగ(ముల్లోకముల లోనూ ప్రవహించునది) అనియూ, జహ్నుముని చే ఉద్ధరింపబడెను కావున జాహ్నవి అనియూ పలు నామములతో కీర్తింపబడుచున్నది.

ఈ విధంగా భగీరధుడు గంగను భువి కి దించి తన పితరులకు పరలోక ప్రాప్తి కలిగించెను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే భగీరధుడు తన స్వార్ధం కోసం ఏమీ చేయలేదు. తన పితృదేవులకు పరలోకప్రాప్తి కలిగించాలనేదే అతని ఆశయం.నిజానికి భగీరధుడు అలా చేయకపోయినా ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు. కానీ తనే ఎన్నో కష్టాలను లెక్క చేయక ఈ కార్యాన్ని సాధించాడు.ఇంకొక విషయం ఏంటంటే భగీరధుడు తపస్సు చేసిన ప్రతిసారీ అతనికి ఆ దేవత/దేవుడు ప్రత్యక్షం కావటానికి పట్టిన కాలం కొన్ని వేల సంవత్సరాలు అని గుర్తించాలి . 

-

ఇప్పుడు మీరే చెప్పండి భగీరధుని పేరు ప్రయత్నానికి మారుపేరుగా నిలిచిపోవటం సమంజసమే కద!

-


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!