శ్రీమద్భాగవతం ------వృతాసుర వృత్తాంతము.!

శ్రీమద్భాగవతం ------వృతాసుర వృత్తాంతము.!
(బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి.)
ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభను తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్వనీ దేవతలు వచ్చారు. యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు వచ్చారు. ఎందఱో పెద్దలు వచ్చారు. వీరందరూ అక్కడ నిలబడి వుండగా అప్సరసలు సేవిస్తూ వుండగా ఇంద్రుడు సముచితమయిన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అందరూ ఇంద్రుని సేవించేవారే తప్ప ఇంద్రుడి చేత సేవింపబడే వారు ఆ సభలో లేరు. గురువులకు ఒక వరుస ఏర్పాటు చేయబడింది. ఇటువంటి సభ నడుస్తూ ఉండగా ఇంద్రుడు కించిత్ అహంకారమును పొంది ఉన్నాడు. అంతమంది తనను సేవిస్తూ ఉండగా తాను చాలా గొప్పవాడినన్న భావన ఆయన మనస్సులో బయలుదేరింది. తానంత గొప్పవాడు అవడానికి కారణమయిన గురువు కనపడినా లేస్తాడా అన్నది అనుమానమే. అహంకారపు పొర కమ్మింది. మహాపురుషుడైన బృహస్పతి సభలోకి విజయం చేస్తున్నారు. ఇంద్రుడు చూశాడు. చూసి వస్తున్నవాడు బృహస్పతి అని తెలుసు. సాక్షాత్తుగా తన గురువని తెలుసు. కానీ ఒక మాట అనుకున్నాడు. ఇంతమంది నన్ను సేవిస్తున్నారు. నేను లేచి నిలబడి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి తీసుకువచ్చి ఆసనం మీద కూర్చోబెట్టడం ఏమిటి? అనుకున్నాడు. గురువు వస్తుంటే చెయ్యవలసిన మర్యాద ఒకటి ఉన్నది. ఇంద్రుడు ఆ మర్యాద చెయ్యలేదు. గురువు వస్తూ సభామంటపంలోకి వచ్చి రెండడుగులు వేసి చూశాడు. ఇంద్రుడు ఎవరో వస్తున్నాడులే అన్నట్లుగా కూర్చొని ఉన్నాడు. వెంటనే బృహస్పతి అనుకున్నాడు –
బృహస్పతికి మనస్సులో కించిత్ బాధ కలిగింది. గురువు వస్తుంటే లేచి నిలబడని కారణం చేత ఇంద్రునికి కలిగిన మద వికారమును తొలగించాలని అనుకుని తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రుడు సభ ఆపలేదు. సభ నడిపించాడు. సభ అంతా అయిపొయింది. అందరూ వెళ్ళిపోయారు. అపుడు ఇంద్రుడు అనుకున్నాడు మనసులో ‘అరెరే, ఇంతమంది నన్ను సేవించడానికి కారణం ఈశ్వరానుగ్రహం. అటువంటి ఈశ్వరానుగ్రహాన్ని నాకు తెచ్చి పెట్టినది గురువు బృహస్పతి. అటువంటి గురువు సభకు వస్తుండగా సింహాసనాధిష్టి తుడయిన రాజు లేవకూడదని చెప్పినవాడు, అధర్మంతో మాట్లాడిన వాడు, ఇంద్రుడనయిన నేనే చెయ్యకూడని పని చేశాను. నావలన ఘోరాపచారం జరిగింది. ఖచ్చితంగా ఇది నన్ను కట్టి కుదిపి తీరుతుంది. దీనిని మా గురువులే ఆపాలి’ అని గబగబా పరుగెత్తుకుంటూ గురువుగారి ఇంటికి వెళ్ళాడు.
తనపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఇంద్రుని మనస్సులో వస్తున్నా భావజాలమును బృహస్పతి తన గృహమునందు కూర్చుని తెలుసుకుంటున్నాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికొక పాఠం చెప్పాలని, తన యోగశక్తితో ఇంద్రుడికి దొరకకుండ అంతర్హితుడయిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు. కానీ ఎక్కడా గురువుగారి దర్శనం అవలేదు. ఖిన్నుడై ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ‘అయ్యో! గురువుగారు ఎక్కడా దొరకలేదు. గురువుగారి పట్ల అపచారం చేశాను. గురువులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను’ అని అనుకుంటున్నాడు. ఈ మాట వినవలసిన వాళ్ళు విననే విన్నారు. అదే ఉత్తర క్షణ ఫలితం అంటే. ఈయన మాటలను రాక్షసుల గూఢచారులు విన్నారు. వెంటనే పరుగుపరుగున వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు. ‘అయ్యా, ఇవాళ ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తొలగిపోయింది. బృహస్పతికి ఆగ్రహం కలిగింది. గురువు ఆగ్రహం ఎవరిమీద కలిగిందో వాడిని పడగోట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఇపుడు ఇంద్రుడు గడ్డిపోచ. మనం యుద్ధమునకు వెళ్ళడం కేవలం నిమిత్తం. ఇంద్రుడు ఓడిపోయి తీరుతాడు. అందుకని మనం యుద్ధానికి బయలుదేరుదాం’ అన్నారు. అంతే రాక్షస సైన్యం అంతా వచ్చేశారు. బ్రహ్మాండమయిన పోరు జరుగుతోంది. ఇంత బలవంతులయిన దేవతలు కూడా గడ్డిపోచల్లా ఎందుకూ పనికిరాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. రాక్షసులకు ఇప్పుడు గురుబలం ఉన్నది. వీళ్ళు దేవతలే కావచ్చు, గురుబలం లేదు. అందుచేత వీరు ఓడిపోయారు. అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంద్రాదులు భయపడి బ్రహ్మగారి దగ్గరకు పరుగెత్తారు. “అయ్యా, కనీ వినీ ఎరుగని విడ్డూరం. కొన్ని సమ్వత్సరములు పోరాడాం. మాకు ఓటమి తెలియదు. అటువంటిది నిన్న బృహస్పతి గారికి కోపం వచ్చి సభలోంచి వెళ్ళిపోయారు. ఇవాళ అమరావతి పోయింది. ఉత్తర క్షణంలో నేను రాజ్య భ్రష్టుడను అయిపోయాను. దేనిమీద కూర్చుని వీళ్ళందరూ నావాళ్ళు అనుకోని గౌరవింపబడ్డానో వాళ్ళ ఎదుటనే ఇంద్రుడు చేతకాని వాడయి ఓడిపోయాడు అనిపించుకుని తిరిగి వచ్చేశాను. దీనికంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించడమే అని అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు జీవితం ఎలా గట్టెక్కుతుంది’ అని అడిగాడు. బ్రహ్మగారు అన్నారు – మీరు అమృతం త్రాగామని, మరణం లేదని సంతోషపడుతున్నారు. మీరు పుట్టినప్పటి నుండి మహానుభావుడు బృహస్పతి బ్రహ్మవిద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుడిని చూస్తూ తనకోసమని కాకుండా మహాత్యాగియై మీకందరికీ ఈ సుస్థిరమయిన స్థానములను కల్పించాడు. అటువంటి మహాపురుశుడిని ఎలా గౌరవించాలో మీకు చేతకాలేదంటే మీరు ఇవాళ మదించి ఉన్నారు. అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యారు’. బ్రహ్మగారే తలచుకుంటే ఒకసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలువగలరు. కానీ గురువుపట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి. ‘మీకు దేనివల రాజ్యము పోయినది? మీకు బాగా ఎరుక కలిగిందా?” అని అడిగారు. అపుడు వాళ్ళు ‘అయ్యా, మాకు బుద్ధి వచ్చింది. మాకు ఇప్పుడు గురువుల అనుగ్రహం కావాలి’ అని చెప్పారు.
గురువు గారి అనుగ్రహం గురువుగారి నుంచే వస్తుంది.
బ్రహ్మగారు దేవతలతో ‘గురుస్థానం ఖాళీగా ఉండకూడదు. అందాకా మీకొక అభయం ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక గురువును ఆశ్రయించి గురువు అనుగ్రహమును పొందండి. ఆచార్య పురుషునిగా ఉండడానికి ఎవరు అర్హుడో వారి పాదములు పట్టుకోండి” అన్నారు. అంటే వాళ్ళు మాకేం తెలుసు. మీరే సెలవివ్వండి’ అని అడిగారు. అపుడు బ్రహ్మ గారు ‘త్వష్ట అనే ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు. వరుసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు. కానీ ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. మీరు అటువంటి మహాపురుషుని సేవించి గురు పదవియందు కూర్చోపెడితే ఆయన అనుగ్రహం చేత ఆయన ఆశీర్వచనం చేత మరల రాజ్యసంపదలు పొందగలరు. అందుకని మీరు వెళ్ళి త్వష్ట ప్రజాపతి కుమారుడయిన విశ్వరూపుని ప్రార్థన చేయండి’ అన్నారు. అంతే వీళ్ళందరూ విశ్వరూపుని ఆశ్రయించారు.
విశ్వరూపుడిని ప్రార్థన చేశారు. ‘ఇప్పుడు మాకు గురువు అంటే ఎవరో తెలిసింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి, పరతత్త్వానికి, గురువుకి తేడా లేదు. ఒకటే అయి ఉంటాడు. బ్రహ్మగారి రూపమే తండ్రిగా ఉంటుంది. అందుకే తండ్రి ఉపదేశం చేస్తే బ్రహ్మోపదేశమే! సోదరుడు ఇంద్రుని రూపంలో ఉంటాడు. అన్నగారిని సేవిస్తే దేవేంద్రుని సేవించినట్లు. అమ్మ భూదేవి రూపం. తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు సాక్షాత్తు రాశీభూతమయిన దయా స్వరూపములు. తన భావమే ధర్మ స్వరూపము. అభ్యాగతుడు అగ్నిదేవుని రూపం. సర్వభూతములు కేశవుని రూపములు. అందుకని నీకు మేము తండ్రుల వరుస అవుతాయి. ఎందుకంటే నువ్వు త్వష్ట ప్రజాపతి కుమారుడవు. కానీ ఇవాళ నీలో వున్న జ్ఞానమును మేము గుర్తించాము. నీయందు గురుత్వమును చూసి నిన్ను పరతత్త్వంగా చూసి నీ పాదములకు మా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాము. మాకు ఆచార్యత్వాన్ని వహించి మళ్ళీ దేవేంద్రాది పదవులు వచ్చేటట్లుగా అనుగ్రహాన్ని కటాక్షించు’ అన్నారు.
ఆయన గురుపదవిని స్వీకరించి వచ్చాడు. వస్తూనే ఆయన ఒక మహోత్కృష్టమయిన పని చేశాడు. రాక్షసులకు ఇవాళ ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది అని బేరీజు వేశాడు. వారు ఆ శక్తిని శుక్రాచార్యుల వారి అనుగ్రహం నుండి పొందారని గ్రహించాడు. ఇపుడు దేవతలకు ఎంత శక్తి వస్తే ద్విగుణీకృత ఐశ్వర్యమును ఇంద్రుడు పొంది రాక్షసులను చంపగలడో లెక్క గట్టాలి. ఇది లెక్క గట్టడానికి ఆ తేజస్సును గణించగల శక్తి ఇక్కడ ఉండాలి. అదీ ఆచార్యపదవి అంటే. అదీ గురుత్వం అంటే! ఇప్పుడు ఇంద్రుని కూర్చోబెట్టి నారాయణ కవచం ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి ఒక మాట చెప్పాడు. ‘ఇంతకూ పూర్వం ఈ నారాయణ కవచమును ‘కౌశికుడు’ అనే బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఆయన ఎడారిలో తిరుగుతూ ఉండగా నారాయణ కవచమునే ఉపదేశం తీసుకుని దానినే ధ్యానం చేస్తూ ప్రాణములను విడిచిపెట్టేశాడు. అపుడు ఆ నారాయణ కవచము తేజస్సు ఆయన అస్థికలకు పట్టేసింది. ఆయన ఆస్థి పంజరము ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. చిత్రరథుడు అనే గంధర్వుడు ఆకాశమార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆ విమానం ఎడారిలో పడిపోయి ఉన్న అస్థిపంజరము దగ్గరకు వచ్చింది. రాగానే దానిని దాటడం మానేసి ఆ విమానం క్రింద పడిపోయింది. అందులోంచి గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు. అకస్మాత్తుగా విమానం భూమిమీద పడి పోయిందేమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలఖిల్యుడు అనే మహర్షి అక్కడికి వచ్చి ‘నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా – నారాయణ కవచము ఉపదేశం తీసుకుని నారాయణ కవచమును సశాస్త్రీయంగా ఉపాసిన చేసిన ఒక మహాపురుషుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు, ఇక్కడ ధ్యానంలో శరీరం విడిచి పెట్టాడు. ఆ కవచ ప్రభావం అస్థికలకు ఉండిపోయింది. ఎవరూ ఆ అస్తికలను దాటి వెళ్ళలేరు. కాబట్టి నీవు ఆ అస్తికలను తీసి మూటగట్టి వాటిని దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మరల వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుంది’ అన్నాడు. ఆ చిత్రరథుడు ఎముకలనన్నిటిని ఏరి మూటగట్టి తీసుకువెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి, స్నానం చేసి, ఆచమనం చేసి వచ్చి విమానం ఎక్కాడు. అప్పుడు విమానం ఆ ప్రదేశమును దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచమునకు వున్న శక్తి అంత గొప్పది. నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించి అని ఆ నారాయణ కవచమును ఉపదేశం చేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు రాక్షసులకు ఇచ్చిన శక్తి కన్నా ఇంద్రుడి శక్తి ఎక్కువయిపోయింది. గురువుల అనుగ్రహం కలిగింది. అంతే రాక్షసులను అందరినీ ఓడించి మరల అమరావతిని స్వాధీనం చేసుకుని ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!