సినీమా(ట)ల తూటాలు !


సినీమా(ట)ల తూటాలు !

 

ఆఫీస్ లో లంచ్ అవర్ లో కొలీగ్స్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు.  ఆ రిపోర్ట్ పంపమని బ్రాంచ్ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పావా? అడిగాడు సురేష్.  “చెప్పాను, నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు”, రేపటికల్లా ఆ రిపోర్ట్ ఇక్కడ ఉంటుంది అన్నాడు రమేష్.  వాళ్ల కంత “సీన్” లేదు, పంపారో లేదో మళ్ళీ కనుక్కో రిటార్ట్ ఇచ్చాడు సురేష్.

“ఓ ఫైవ్ ఉంటే ఇస్తావా”?, (ఫైవ్ అంటే ఇక్కడ అయిదు వందలు, అయిదు రూపాయలు కాదు), అడిగాడు అప్పారావు ఈ లోపల (అతని అసలు పేరు ఏదైనా, అందరూ అలాగే పిలుస్తారు).   అతని బారి నుంచి తప్పించుకోడానికి టాపిక్ మారుస్తూ, అవునూ “తీ తా” (తీసేసిన తాసిల్దారు) సంగతి ఎంతవరకు వచ్చింది? అని ఆ మధ్య సస్పెండ్ అయిన కొలీగ్ గురించి అడిగాడు రమేష్.  “అమ్యామ్యా” కేసులు అంత తొందరగా తేలుతాయా?  గడ్డి తినే ముందే బుద్ధి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని జవాబు.

“హింస రాజు” (బాస్) అర్జెంటు గా నిన్ను టూర్ వెళ్ళమన్నాడుట?, నువ్వు నీ గోవా ట్రిప్ మానుకుని వెళుతున్న్నావుట?, నిజమేనా?  ఇంకో కొలీగ్ ప్రశ్న.  “అతిగా హింసించే బాస్, ఇతరుల విషయాలలో అతిగా తల దూర్చే కొలీగ్ బాగు పడినట్టు చరిత్రలో లేదు”, కోపంగా సమాధానం.

రోజూ బుద్ధిగా డబ్బా తెచ్చుకునే మహేష్, ఆ రోజు ఉప్మా తెస్తే – “ఫామిలీ, ఫామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తోంది” అని కోరస్.  రోజూ తినలేక చస్తున్నా, ఈ బాక్స్ తీసుకుని ఆ చపాతీలు ఇటు ఇవ్వండి అంటూ తన జవాబు.

 

“ముందు నువ్వు ప్రేమించావా, లేక తను నిన్ను ప్రేమించిందా”, అడిగారు జస్ట్ మారీడ్ నరేష్ ని.  ముందు తను ప్రేమించింది, తరువాత నేను “ప్రేమించాల్సి వచ్చింది”, నవ్వు ఆపుకుంటూ గంభీరంగా చెప్పాడు నరేష్.  ఘోల్లున నవ్వులు అక్కడ.

ఆదివారం దినపత్రిక లో వచ్చిన “అల్ కూర చంచం” వెరైటీ డిష్ చేసి తెచ్చాను, అందరూ తినండి అంటూ వచ్చింది సుజాత.  అందరూ బిక్క మొహం వేసినట్టు నటించి, “ఇంట్లో చెప్పి రాలేదు” అని ఒకరు, “ఇన్సూరెన్స్ తీసుకోలేదు” అని ఒకరు, ఉండండి “నా బ్యాంకు బాలన్స్ వివరాలు అన్నీ మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పి” తింటాను అని ఒకరు అంటూ, మొత్తానికి ఆ డిష్ మొత్తం లాగించేశారు.

““బెస్ట్ ఎంప్లాయి” అవార్డు గెలుచుకున్న కవిత గారికి వేయండి ఒక “వీరతాడు”,  అనగానే అందరూ చప్పట్లు కొట్టారు.  పార్టీ ఇవ్వాలి అంటే తప్పకుండా అన్న కవితతో, ఒట్టు? అడిగింది సుజాత.  నేను “ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పను” అని తెలుసుగా సుజాత? గంభీరంగా ఆవిడ  జవాబు.  మళ్ళీ నవ్వులు.

పార్టీ అనగానే “ఇంగ్లీష్లో మాట్టాడుకుని” చాలా రోజులయ్యింది అంటూ ఇద్దరు ముగ్గురు ఈ లోపల వేరే ప్రణాళికలు వేసుకోవడం మొదలెట్టారు.

ఒక్క అరగంట లోనే ఇన్ని కబుర్లు, వాటిలో పేలిన జోక్స్.

ఈ కబుర్లు  అలా సాగడానికి, ఆ జోక్స్ అలా పేలడానికి కారణం ఏంటో మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. అవును, అందుకు కారణం ఈ కబుర్లలో తెలుగు సినిమా డయాలాగ్స్, అదేనండి డవిలాగులు, వాడడం వల్ల.

మన తెలుగువారికి వినోదానికి ప్రధాన మాధ్యమం సినిమాలే కదా?  ఆ సినిమాలలో కొన్ని సంభాషణలు, చతురతతో కూడిన పదాలు/వాక్యాలు చాలా పాపులర్ అవుతాయి.  ఎంతగా అంటే, అవి నలుగురి నోళ్ళలోనూ నానుతాయి.  ఉదా. “సుత్తి” అనేది ఒక డయాలాగ్ గా వచ్చి, ఎంతో ప్రాచుర్యం పొంది, ఆ తరువాత అందరు వాడే సర్వసాధారణ పదం అయిపొయింది.  పైగా, పలు విధాలుగా రూపాంతరం చెందింది కూడానూ.  సుత్తి కొట్టకు అని మామూలు అర్ధమే కాకుండా, అందరు కలిసి వచ్చేయండి సుత్తేసుకుందాం అని, చెప్పేదేదో సూటిగా చెప్పు సుత్తి లేకుండా – ఇలా ఇంప్రూవ్ కూడా చేసారు.   ఇలాంటి పదాలు, వాక్యాలు ఎన్నో మనకి తెలిసి, ఒక్కోసారి తెలియకుండానే, మన దైనిందిన సంభాషణలలో భాగం అయిపోయి.

 

వాడికి తోచిందే తప్ప ఎవ్వరి చెప్పినా మాటా వినని వాడి గురించి చెప్పాలంటే సింపుల్ గా ”వాడో సీతయ్య రా బాబు” అంటాం.  అదే మన గురించి చెప్పుకోవాలంటే గొప్పగా “ఒక్క సారి కమిట్ అయితే నా మాటే నేనే వినను” అని బిల్డ్ అప్ ఇస్తాం.

 

ఏంటి ఈ మధ్య బాగా మారిపోయావు, అస్సలు ఆరు అవగానే ఇంటికి వెళ్ళిపోతున్నావు అంటే “కొత్తగా ఉందని ట్రై చేస్తున్నా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది” అని ఓ జోకు వేస్తాం.   మీటింగ్ కి ఒక్కడివే వెళ్ళవా? అని అడిగితే, పెద్ద లెవెల్ లో “సింహం సింగిల్ గానే వెళుతుంది” అంటూ సమాధానం రెడీ.

 

“నీ ఆఫీస్ కి వస్తా, నీ కాబిన్ కి వస్తా”, కాఫీ తెప్పించి రెడీ గా పెట్టు అంటూ మిత్రుడిని కలవడానికి వెళ్తూ ఫోన్ చేసి చెప్తాం.

సరే, ఈ మధ్య అయితే “నాకు కొంచెం తిక్కుంది” – దానికో లెక్కుంది అని , అసలు లెక్కే లేదు అని, దాంట్లో కిక్కుంది అని – ఇలా పరి పరి విధాలుగా వాడుతున్నారు.  ఈ “పరి పరి విధాలు” కూడా ఒక సినిమాలో వాడిన పదమే.  భూలోకం కి వచ్చాకా యముడికి ఆకలి అనిపించి, అదేంటో తెలీక “నాకు ఉదరము నందు ఒక విధముగానున్నది, ఏమిటో తెలియకున్నది” అంటాడు.  అందుకు చిత్రగుప్తుడు “నాకు పరి పరి విధములుగా నున్నది ప్రభూ, దీనినే ఆకలి అందురు” అంటాడు.   తరువాత వాళ్ళు హిమక్రీములు తింటారు.  అప్పటి నుంచి మనమూ, వనిల్లా, బటర్ స్కాచ్, చొకలెట్ – యే ఫ్లేవర్ తెచ్చుకున్నా వాటిని హిమక్రీములు అనుకుంటూ తింటున్నాము కదా. ఉత్తినే ఇస్క్రీం అనేకంటే ఈ పదం వాడితే, అదొక ఆనందం.

 

“చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందొ” అంటూ లెవెల్ వేయడం, “ఏది, ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో” అంటూ సెటయిర్ వేయడం, “మీతో సెటయిర్ వేస్తే నేను రిటైర్ అయిపోతాను” అంటూ మరొక డవిలాగ్ చెప్పడం మనకి పరిపాటి.

 

“నువ్వు చేసే పని ఎంత సైలెంట్ గా ఉంటె రిసల్ట్ అంత పెర్ఫెక్ట్ గా ఉంటుంది” అంటూ సలహా ఒకటి పారేస్తాం.  చెప్పిన పని ఎప్పుడు చేస్తావ్? అంటే, “అదే నా తక్షణ కర్తవ్యం” అని టకీమని జవాబు.  అది చేస్తామో లేదో తరువాతి సంగతి అనుకోండి.

 

ఎప్పుడూ ఫైల్స్, మీటింగులేనా, “మడిసన్నాకా కూసింత కళాపోసన ఉండాలి” అనేది ఈ రోజుకీ చాలా పాపులర్ కదా.   ఇంకొక పాపులర్ దవిలాగ్ “నా మానాన  నేను” – మాడి పోయిన మషాళా దోశ తింటుంటే అనేది ఒరిజినల్ వెర్షన్ అయితే – వేరే ఇంకెన్నో సందర్భాలలో వాడుతాం.  నా మానాన నేను – పని చేసుకుంటుంటే,  చదువుకుంటుంటే, రాసుకుంటుంటే  - వచ్చి డిస్టర్బ్ చేసాడు అంటూ.

అలాగే, ఫ్రెండ్స్ ని కలవడానికి ఆలస్యం గా వెళ్తే, వెళ్ళగానే “లేట్ గా వచ్చినా లేటెష్ట్ గా వచ్చా” అని డయాలాగ్ విసురుతాం.  పైగా “ఏం జరుగుతోంది ఇక్కడ, నాకు తెలియాలి, తెలిసి తీరాలి” అంటూ ఆవేశ పడిపోతాం.  ఆడే పేకాటలో ఎలాగో ఒకసారి షో అయితే “ఎప్పుడోచ్చామని కాదు అన్నయ్య, ముక్క పడిందా లేదా” అంటూ తెగ హడావుడి.

 

మనం చెప్పేది అవతలి వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే “అర్ధం చేసుకోరూ” అంటూ సున్నితంగా మందలిస్తాం.

 

ఇందాక చెప్పిన అప్పారావు, ఇవ్వాల్సిన దాంట్లో సగం బాకీ తీర్చేసాడు రా, అంటే, నమ్మం సరి కదా – వీడికి “సెకండ్ స్టేజి హాలూసినేషన్” వచ్చింది అని జాలి నటిస్తాం.

 

బండి సర్వీసింగ్ కి ఇచ్చి సాయంత్రం వెళ్ళి తీసుకోవాలి అన్నప్పుడు ఫ్రెండ్ ని లిఫ్ట్ అడిగితే, తను స్టైల్ గా కూర్చొని, ఒక చేత్తో ఇంకో అర చేతిలో కొట్టుకుంటూ “నా కేంటి?” అని అడిగినప్పుడు, సర్లే నీకో స్పెషల్ సింగిల్ చాయి తాగిస్తాలే –– తొందరగా పద వాడు వర్క్ షాప్ క్లోస్ చేస్తాడు అంటాం.

 

“తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా?” అని కాదమ్మా, ఏదైనా పని చెయ్యి, అని దొరికినవాడికి లెక్చర్ పీకుతాం.  ”దేశం చాలా క్లిష్ట పరీస్తితులలో ఉంది” అంటూ తెగ బాధ పడిపోవడం ఎప్పటినుంచో ఉన్నదే కదా.

 

“గట్ల డిసైడ్ చేసినావా అన్నా …. వాకే”, అని ఆ పనిలో పడిపోతాం.   “గోడ మీద బల్లుందా, ఇంట్లో పిల్లుందా” అని బుర్ర తినేస్తాడు రా బాబూ అంటూ కొందరిని తప్పించుకు తిరుగుతాం.  “నా దారి రహదారి” అని ఒకసారి, “నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు” అంటూ ఒకసారి, ఇలా సమయానుసారంగా సమాధానం చెప్తూ ఉంటాం.

 

“కష్టపడి కాదు ఇష్టపడి పని చేయి” అని, “ట్రెండ్ ఫాలో అవ్వకు సెట్ చేయి”, “తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత” అని పెర్సనాలిటి డేవలెప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాం ఈ మధ్య వీటి సాయంతో.   ఫ్రెండ్ ఓ పని చేయాల్సి ఉండి, తటపటాయిస్తుంటే, “సాహసము సేయరా సోదరా” అని ప్రోత్సహిస్తాం.

 

ఇహ మనం ఈదుతున్న “భవసాగరాలు”, రొజూ ఇరుకుంటున్న ట్రాఫిక్ జామ్లు, ఎక్కడి కెళ్ళినా ఎదురయ్యే చాంతాడు క్యూలు – అయినా సరే అక్కడికి వెళ్ళాలి, ఆ పని చెయ్యాలి, తప్పదు అన్నప్పుడు  – మనం చెప్పుకునే పాజిటివ్ మంత్రం – “లైట్ తీసుకో”, పని చూసుకో.

 

ఇలా, ఎన్నో ఎన్నెన్నో, పదాలు, వాక్యాలు అలవోకగా వాడుతూ, ఆ విధంగా ముందుకెళుతూ ఉంటాం.  అవునూ, ఇదంతా చదివితే మీకూ ఇంకెన్నో డవిలాగులు గుర్తొచ్చాయి కదూ?  అవేమిటో వెంటనే చెప్పేయండి.  అయితే, అవి కేవలం డవిలాగులు లా కాకుండా, మీరు మీ ఫ్రెండ్స్ తోనో, కొలీగ్స్ తోనో ఏదో సందర్భం లో చెప్పినట్టు ఉండాలి.  ఎందుకంటారా? – అలా ఉంటే “ప్చ్, అదో తుత్తి” మరి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!