ఆంగ్లేయుల పాలనలోనూ వైభవంగా పుష్కరాలు.!


ఆంగ్లేయుల పాలనలోనూ వైభవంగా పుష్కరాలు.!
(తెలగపిండిని ముక్కున కరుచుకుని ఒకే లైన్‌లో పాకే చీమలలాగా
పుష్కర యాత్రీకులు గోదావరి తీరంలో నడిచే వారు.)

దేశ స్వాతంత్య్రానికి ముందు జరిగిన పుష్కరాల తీరు తెన్ను పరిశీలిస్తే ఆనాటి మన పుష్కర సంస్కృతిని తెల్లదొరలు ఎంతగా గౌరవించారో తెలుస్తోంది. 1896 నుంచి 1944 వరకు స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన ఐదు పుష్కరాలకు సంబంధించి వివిధ గ్రంథాలు తెలియజేస్తున్న సమాచారం ప్రకారం చూస్తే మన దేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయులు పుష్కరాలను ఎంతో ఆదరించారని తెలుస్తోంది. రాజమహేంద్రవరానికి చెందిన చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయచరిత్రలో పేర్కొన్న విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి....
1896 పుష్కర విశేషాలు...
1896లో జరిగిన గోదావరి పుష్కరాలకు దేశ, విదేశాల నుంచి ప్రజలు వచ్చారు. అప్పట్లో రాజమండ్రి కలెక్టర్‌గా ఉన్న ఎల్‌పిన్‌స్టన్ దొర పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రాచలం, రాజమండ్రి వద్ద బురద బురదగా ఉండే పుష్కరాల రేవుల్లో యాత్రికులు జారిపోకుండా కర్రదూలాలు పాతించారు.
అప్పటికి రాజమండ్రిలో రైలు వంతెన నిర్మించలేదు. ఆ తర్వాత 1897లో రైలు వంతెనను ప్రారంభించి 1900 ఆగస్టు 19న ఈ వంతెనపై రాకపోకలు ప్రారంభించారు. ఈ కారణంగానే కర్ర దూలాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ పుష్కరాల్లో కలరా, మశూచి ప్రబలకుండా ఆనాడే మరుగుదొడ్లు నిర్మించారు. వాటిని కలెక్టర్ ఎల్‌పిన్‌స్టన్ దొర స్వయంగా పర్యవేక్షించారు.
1908 కీలకనామ సంవత్సరంలో...
1908లో కీలకనామ సంవత్సరంలో పుష్కరాలు వచ్చాయి. అపుడు రాజమండ్రికి ఒర్కిట్ దొర సబ్‌కలెక్టర్‌గా ఉన్నారు. అంతకు ముందున్న ఎల్‌పిన్‌స్టిన్ దొరలాగే ఆయన కూడా పుష్కర యాత్రికులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ఈ ఒర్కిట్ దొర పుష్కరాలను పర్యవేక్షించిన తీరును ప్రశంసిస్తూ కల్లూరి వెంకటశాస్ర్తీ అనేక పద్యాలు రాశారు. తెలగపిండిని ముక్కున కరుచుకుని ఒకే లైన్‌లో పాకే చీమలలాగా పుష్కర యాత్రీకులు గోదావరి తీరంలో నడిచే వారని వర్ణించారు. పగటి వేషగాళ్లు రకరకాల వేషాలు వేసుకుని వీధుల్లో పుష్కర యాత్రికులను ఆనందపరిచారు.
ఉద్యమ సమయంలో...
1920 గోదావరి పుష్కరాలు దేశ స్వాతంత్య్రోద్యమ కాలం సహాయ నిరాకరణ ఉద్యమంలో వచ్చాయి. అప్పటికీ రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండటంతో రైల్వే వంతెన మీద నుంచి ఒక అణా చెల్లించి కొవ్వూరు నుంచి నడిచి వచ్చి యాత్రికులు పుష్కర స్నానాలు చేశారు. 1939 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పుష్కరాలు వచ్చాయి. అప్పుడు పుష్కరాల కోసం వచ్చిన యాత్రికుల్లో యువకులను యుద్ధానికి తీసుకుపోతారనే వదంతులు భారీగా వ్యాపించడంతో వారు గోదావరి స్నానాలకు మొగ్గుచూపలేదు. గోదావరి తీరమంతా వయసు మళ్లినవారు స్నానం చేయడంతోనే నిండిపోయింది. అప్పట్లో అనేక మంది స్వాతంత్య్ర ఉద్యమంలో తలమునకలయ్యేవారు.
మండు వేసవిలో 1944 పుష్కరాలు
1944వ సంవత్సరంలో మండు వేసవిలో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆనాటి పుష్కర వింతలను తెలియజేస్తూ విజయనగరంలో గాయకుడు దొడ్డమదాసు పాడిన పాట ఎంతో ప్రసిద్ధి చెందింది.
గోదావరి పుష్కరాల వింతలు
కొత్తనీటి కుదుపులకు...
కోడెగాళ్ల అదుపులకు...
కొప్పులోని కొత్తసవరం...
కొట్టుకుపోయే దొడ్డమ్మా..
అంటూ సాగే ఈ పాట ఎక్కడ చూసినా గ్రామ్ ఫోన్ రికార్డుల్లో మార్మోగిపోయింది. నండూరి వారి ఎంకిపాటకు వచ్చినంత పేరు ఈ పాటకూ అప్పట్లో వచ్చిందట

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!