శ్రీ కృష్ణుడు తో నెయ్యం.!


శ్రీ కృష్ణుడు తో నెయ్యం.!
.
ఆవలి అంచుకు మొదటి అడుగున కృష్ణయ్య కు సమర్పణలతో

కృష్ణాష్టమి కు దేవదేవుడి కి ------ చివరి అంచున.... ప్రయాణపు మొదటి అడుగున నిలిచిన యాత్రికురాలి గా మారే క్షణం లో ఆలోచనలను నైవేద్యం గా .

జీవితం లో లెక్కలేని ఆటు పోట్లను ఎదుర్కొని ప్రయాణపు ఆఖరి మజిలిలో నిలిచిన నాకు, ఈ తుది లేఖను రాయటానికి హృదయం పగిలి ముక్కలయిన రక్తాశ్రువులే తోడవుతున్నాయి సఖా.... ఏ మనిషికైనా జీవిత ఆఖరి చరణం లో అసహాయత, అహంకారం రెండిటిని వదిలేసి.. చెలికాడా నీవు తప్ప అన్యధా శరణం నాస్తి అని నిన్నే వేడుకోవలసి వస్తుందేమో.... అది అసహాయత అనవచ్చేమో, కాని అసహాయత ప్రతిఫలం ఆశించి, అది సాధించలేని అశక్తత తో కలిగేది.... ఇప్పటి ఈ క్షణాన, ఇక భౌతిక కోరికలేవి నా దరి దాపులకైనా రాని ఈ ఘడియ లో నే నిను వేడేది, " నా పుట్టుకనే నీది చేసుకున్న నా ప్రాణ సఖా..... ఈ నిరంతర యాత్ర లోని వేదనను, ఆనందాలను ఇంకొక్కసారి మననం చేసుకుని, సమీక్షించుకోవాలని వుంది" అనే. నా అంతరంగాల ఆంతర్యాలు నీకు తెలియవని కాదు...... ఆ అంతరాగాన్ని.... ఆంతర్యం లోని కోరికను సృష్టించింది నీవైనప్పుడు, దానినే నీకు తిరిగి మనవి చేయటం ఈ అంత్య క్షణాలలో నాకు కలిగిన సంధి ప్రేలాపనే కావొచ్చు, ఐనా ఈ రోజు ఇలా మొండి తెగువ తో నీ ముందు నీకు తెలిసిన దానినే నీకు తేట తెల్లం చేయాలనే ఈ కోరికను మన్నించి .....ఈ లేఖ పూర్తవ్వక ముందే నా ఆత్మ ను నీ పాదాల చెంత సుగంధభరిత పూరేక గా చెయ్యక, నా మనసును బిగ్గర గా ఈ రోజు నీకు నివేదన చేసేంత వ్యవధినివ్వు.......

నీ సృష్టి లో ప్రతి జననానికి మరణానికి ఒక కారణం, ఒక వుద్దేశం నిర్దేశింపబడుతుంది అంటారే... మరి నన్ను ఏకారణానికి వుద్దేశించి సృజించావో ఇప్పటికైనా...... నీకైనా అర్ధం అయ్యిందా........? ప్రపంచానికే ప్రేమను పంచి ఇవ్వగలప్రేమ మూర్తి వే... నీ ప్రేమ కోసం నన్ను జీవితమంతా వేచి వుండేటట్లు చేయటం న్యాయమా.... స్త్రీ మనసు కుసుమకోమలమైనది... అది నిరంతరం ప్రేమాన్వేషి... కాని ప్రేమ ఒక్క స్త్రీ పరమేనా... దానిని సృజించి పంచి ఇవ్వగల పురుషుడిసొంతం కూడా ఐనప్పుడు, అతను మాత్రం ప్రేమాన్వేషి కాదా... జగాన ప్రతి క్షణాన బిడ్డగా, సోదరుడి గా, స్నేహితుడి గా, భర్త గా, తండ్రి గా రకరకాల పాత్ర లలో అతను మాత్రం ప్రేమాన్వేషి గా మారడా.. మరి మాకే ఎందుకు ఆ పేరు? అది కూడానీ విలాస వివరాలలోని ఒక భాగమా... ఈ అసమానత్వపు వెతుకులాటల సమీకరణ లో నేనెప్పుడూ శేషం గానేమారేనెందుకు.......??

చిన్నతనానే నేనెవరో నాకు తెలియకుండానే.... నా పైన కమ్ముకున్న నీలి మేఘమై... నా హృదయాన వర్షించిన వంశీనాదమై.........నన్నావరించుకున్న నీలాకాశ శూన్యమై జీవితాన ఒంటరి పధాన్ని ప్రేమతో కలబోసి సూచించావు. నేనేఅర్ధం చేసుకోలేని దాననై, అనేక రూపాల ప్రేమ ప్రలోభాలకు లోనై, నేను నిర్మించుకున్న దారుల వెంట పరుగెత్తేను. అలాపరుగెత్తటం కూడా నీ మాయలోని భాగమా మోహనకృష్ణా....... పరుగెత్తి తగిలించుకున్న దెబ్బలను చూసుకుని ఈక్షణాన నవ్వుకోగల విజ్ఞత నీ దయేనా......! సమస్తం నీ పాదాల దగ్గర అర్పణ చేసి, కర్మ నాది కాదు, కర్మఫలం నాదికాదు అని వదిలెయ్యగల ధీమా, కొడిగొట్టిపోయే ముందు వెలుగు జిలుగులా?

బాల్యాన నా ఆట పాటలలో ఒక బొమ్మవై, నాతో నిరంతరంసంచరించే బాల్య స్నేహితుడి గా నీ రూపు చిరపరిచితమేనాకు.... తాయిలాల దాచిన మధుర తీపిదనం... ఆటలలోనిఅమాయకత్వం.... నిదుర కళ్ళలో సుఖం.... వానపొద్దు నీటిబుడగల పై తేలిన నవ్వురవ్వల వరాల వెన్నెల లో నాతోసదా సంచరించిన మువ్వల రవళులు నీవే కదా.. యవ్వనాన కోటి ఆశల మైమరుపుల కళ్ళ మీదకుశీతాకోకచిలుక లా వాలిన జిలుగుకలల రూపానివై, నాతోప్రేమ బృందావనాన సంచరించిన కృష్ణయ్యవు నువ్వే కదా.... రాధ గా నేను నీకు అర్పణ చేసుకుని నేను నువ్వులో ఒకభాగమనుకున్నప్పుడు, చిలిపినవ్వుల మానసచోరుడివై నాతో కలసి పక పక లాడిన యదువంశసుధామణి వి నువ్వుకాదూ......?

నీ రూపును.... మదిన, జీవితంలో నిలుపుకుని నీ తోటి సరాగాలను కోటి కలలు గా కనులలో దివ్వెలుగా నింపుకుని, నీముంగిట పూచిన పువ్వై మారాలనుకున్నప్పుడు నువ్వేనా.......... ఆనతిచ్చి, నా జీవితసహచరుడిగా మారి నా కలలోకి, కౌగిలిలోకి వచ్చావు....... నా గుండెలోని కేశవుడివై, ఆ పైన నా వొడిలో బాల కృష్ణుడివై నిలచావు.!!!!! మధ్య వయసుతడబాటులలో సంసార రధ చక్రాల కింద నలిగిఫొకుండా చేయూతనిచ్చినా దుఃఖంలో నేనున్నాని వూరటనిచ్చింది నువ్వేకాదా.!!! వృద్ధాప్యాన వొణికిన కాళ్ళ వూతమై, మానసిక చాంచల్యం రాకుండా వెన్నంటి కాపాడిన నేస్తానివై నదయామయుడివి నీవు కాదు.... ఐనా కూడా... ఇన్ని రూపాలలో నువ్వు నాతో వున్నా ఎందుకీ అసంతృప్తి.....? ఏక్షణానా....... నువ్వే అది నువ్వే అని నేనెందుకు ప్రామాణికంగా గుర్తించలేక పోయాను? నీ నీలి క్రీనీడలో నువ్వుండిఎందుకు దోబూచులాడేవు?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!