ఆంధ్రమహా భారతం పుట్టింది ఇక్కడే..

ఆంధ్రమహా భారతం పుట్టింది ఇక్కడే..
.
ఆంధ్రజ్యోతి....(29-Jun-2015)

తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి.. అందరికీ తెలిసిన నానుడి.. ఈ రెండింటికి లింకేమిటో తెలియదుగానీ, గోదావరికి, భారతానికి కచ్చితమైన బంధం ఉంది. ఆదికవి నన్నయ్య మహా భారతాన్ని తెనుగీకరించింది ఇక్కడే. అంతే కాదు, భారతానికి సృష్టికర్తలైన పాండవులు నడయాడిన జాడలూ ఇక్కడున్నాయి. అటు రామాయణం
ఇటు భారతం. గోదావరి స్మృతి పథాలు!

వేంగీ రాజ్యాన్ని పెదవేగి కేంద్రంగా విమలాదిత్యుడు పాలన సాగించేవాడు. 1019లో ఆయన మరణానంతరం ఆయన కుమారుడు రాజరాజ నరేంద్రుడు 1021లో పట్టాభిషక్తుడయ్యాడు. తమ కులదైవం ఆది వరాహస్వామి ఆశీస్సులతో, ప్రధానమంత్రి వజ్జియ సోమయాజి దీక్షాదక్షతలతో ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టాడు. నదీవాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సుసంపన్నం చేశాడు. చంద్రాదిత్య దండనాథుడి ఆధ్వర్యంలో శాంతి భద్రతలను పరిరక్షించాడు.

ఆంధ్ర మహాభారతం. ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది పవిత్ర గోదావరి తీరం.. రాజమహేంద్రవరం.. దాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు..అతడి ఆస్థానకవి నన్నయ భట్టారకుడు. ఆదికవి నన్నయ్య అవతరించిన చోటే ఆంధ్ర మహాభారత రచనకు బీజం పడింది. వ్యాస విరచితమైన 18 పర్వాల మహాభారత గ్రంథాన్ని తేట తెలుగులో అనువదించే మహద్భాగ్యాన్ని నన్నయ్యకు కలిగించింది రాజరాజ నరేంద్రుడే. క్రీ.శ. 1021-1061 మధ్య నాలుగు దశాబ్దాలపాటు రాజరాజ నరేంద్రుని పాలన ఎంత జనరంజకంగా సాగిందో.. ఆయన కాలంలో ఆంధ్ర మహాభారత రచన అంత ప్రాశస్య్తాంగానూ సాగింది.

రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం..
రాజమండ్రి లీగల్‌: మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆదికవి నన్నయ పేరిట రాజమండ్రి నగరంలో విశ్వవిద్యాలయమే వెలిసింది. ఉభయ గోదావరి జిల్లాలకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలన్న సంకల్పంతో 2006లో రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. వీసీ, రిజిసా్ట్రరు, కొందరు సిబ్బందితో ప్రభుత్వ అటానమస్‌ కళాశాల ప్రాంగణంలో దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాజానగరం మండలం వెలుగుబందలో సుమారు 110 ఎకరాల విస్తీర్ణంలో సొంత భవనాల్లోకి మారింది. 2014 నుంచితరగతులు నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని డిగ్రీ కళాశాలలను ఈ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు.

నన్నయ్యభట్టారకుని సంక్షిప్త చరిత్ర
భారత ఆంధ్రానువాదంలో నారాయణభట్టు సహకారం
పాలనాదక్షుడిగా ఎంతో పేరు పొందిన రాజరాజ నరేంద్రునిలో సాహితీ ప్రకర్ష కూడా ఎక్కువే. కవి, పండితులతో గోష్ఠులు జరుపుతూ, వారిని సన్మానిస్తూ ఉండేవాడు. అతడి ఆస్థాన కవి నన్నయ భట్టు. సంస్కృతాంధ్ర పండితుడు. ఉభయ కవి మిత్ర బిరుదాంకితుడు. మంత్రి వజ్జియ కుమారుడికి సహాధ్యాయి. నిత్యం ఇంటి వద్ద భారత, భాగవత కథలను అందరికీ వినిపించేవాడు.వ్యాసుడు రచించిన మహా భారతాన్ని ఆంధ్రీకరించాలన్న సంకల్పం రాజరాజుకు కలిగింది. ఇందుకు సమర్ధుడు నన్నయేనని ఈ బృహత్తర బాధ్యతను ఆయన భుజస్కంధాల మీద ఉంచాడు. అతడి మరో సహాధ్యాయి నన్ని నారాయణభట్టు. తూర్పు చాళుక్య రాజు మొదటి ఆహవమల్ల సోమేశ్వరుడి మంత్రే ఈ నారాయణభట్టు. సంస్కృత, ఆంధ్ర, కన్నడభాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట. అటువంటి నారాయణభట్టు ప్రోత్సాహంతో ఓ శుభ ముహూర్తంలో భారత రచన ప్రారంభించాడు నన్నయ. ఆది, సభ పర్వాలతోపాటు అరణ్య పర్వంలో సగం మాత్రమే పూర్తి చేయగలిగాడు. శత్రురాజుల కుట్రలను తిప్పికొట్టడంలో కుమార రాజేంద్రదేవుడికి అన్ని విధాలా సహకరించిన నారాయణభట్టుకు రాజరాజ నరేంద్రుడు మూడేరుల నందమపూడి అగ్రహారాన్ని ఈనాంగా రాసిచ్చి అగ్రహారీకుడిని చేశాడు. మహాభారతాన్ని ఆంధ్రీకరించడంలో తనను ప్రోత్సహించినందుకు కృతజ్ఞతగా నన్నయ తన కుమారుడికి నారాయణభట్టు కుమార్తెతో వివాహం చేసి వియ్యమందాడని కూడా ఒక కథనం. మహామంత్రులు, దండనాథులు, కవిత్వంలోనే కాక మంత్రాంగంలోనూ నిష్ణాతులైన నారాయణభట్టు వంటి వారి సమర్థత, సహకారాలతో రాజరాజ నరేంద్రుడు నాలుగు దశాబ్దాలపాటు అంటే 1061 వరకూ రాజ్యపాలన సాగించాడు. ఈయన కాలంలో ఆది వరాహమూర్తి ముద్రతో ‘వరహా’ అనే నాణం చలామణిలో ఉండేది. వరహా అంటే ఇప్పటి లెక్కల్లో నాలుగు రూపాయలని అర్థం. ఆది వరాహమూర్తినే తన ధ్వజంలో ఆవిష్కరింజేసుకున్న దైవభక్తిపరుడు రాజరాజ నరేంద్రుడు. ఆయన మరణానంతరం ఆంధ్ర మహాభారత రచన ఆగిపోయిందని చెబుతారు. కానీ అరణ్యపర్వం తెనిగిస్తుండగా నన్నయ్య మరణించాడని, దాంతో రచన ఆగిపోయిందన్నది కూడా ఒక కథనం. గంభీర మధురమైన నన్నయ్య రచన తెలుగు సాహిత్యంలో నిరుపమానమైనది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!