పుష్కర గోదావరి – మా తల్లి గోదావరి!

పుష్కర గోదావరి – మా తల్లి గోదావరి!
.
‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు’
నిత్యం స్నానం చేసేముందు జలాన్ని పవిత్రీకరించటానికి పఠించే మంత్రమిది. దైవార్చన సమయంలో కలశంలోని జలాన్ని పవిత్రీకరించటానికి పఠించే మంత్రంలో గంగ, యుమున మొదలగు పుణ్యనదుల జలాలతో పాటు గోదావరి నది జలాన్నీ అనుసంధాన పూర్వకంగా ఆహ్వానించటం ఇందులోని పరమార్థం.
మానవుని జీవనానికి నదులతో విడదీయలేని సంబంధం ఉంది. మనదేశంలో చాల నదులున్నాయి. వీటిలో గంగ, యుమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ తదితర నదులు సుప్రసిద్ధమైనవి. వీటిలో దక్షిణ భారతదేశంలో ప్రవహించే శ్రేష్ఠమైన నదులు మూడు. అవి - గోదావరి, కృష్ణ, కావేరి. ఈ మూడింటిలో ప్రథమ స్థాన పొందినది గోదావరి. పురాణాల్లో గోదావరి నదికి గంగానదితో సమానమైన స్థానం కల్పించారు. అందుకే నన్నయ్య గోదావరిని దక్షిణ గంగ అన్నారు.
గోదావరి మహారాష్టల్రోని నాసిక్ నుండి ఆంధ్ర రాష్ట్రంలోని అంతర్వేది వరకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది. ఈ మధ్యలో అనేక ఉప నదులను కలుపుకుని రాజమహేంద్రవరం దిగువన ఏడుపాయలై బంగళాఖాతంలో కలుస్తుంది. కనుక ఇలాంటి పుణ్యతీర్థాల్లో స్నానమాచరించటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి. అందులో పుష్కర సమయాన ఆచరించే స్నానం ఎంతో ప్రశస్థమైనదని పురాణాలు చెబుతున్నాయి.
పుట్టుపూర్వోత్తరాలు
గౌతమ మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. పరోపకార గుణం కలిగినవాడు. తన చేతితో గింజలు చల్లితే వెంటనే పంటలు పండేలా ఈయన బ్రహ్మదేవుని ద్వారా వరం పొందాడు. దేశానికి కరవు కాటకాలు సంభవించినప్పుడు ఈయన అందరికీ ఆహారం అందించేవాడు. ఈవిధంగా ఈయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఇది ఇతర మునులకు అసూయ కలిగించింది. గౌతముని పేరుప్రతిష్ఠలను సహించలేని ఇతర మునులంతా కలసి ఆయనను అప్రతిష్ఠ పాల్జేయాలని నిశ్చయించుకున్నారు. వారంతా ఒక మాయగోవును సృష్టించి గౌతముని పంటపొలాలపై వదిలారు. ఆ మాయ ఆవు పొలాల్లో మేస్తూ పంటను పాడుచేస్తోందని, పంటలను రక్షించమని చుట్టుపక్కల వారు గౌతముని కోరారు. దయార్థ్ర హృదయుడైన గౌతమ మహర్షి గోవును కొట్టడం ఇష్టం లేక ఒక దర్భపోచతో ‘్ఫ’..! అని మెల్లగా అదిలించాడు. ఆ గడ్డిపోచ తగిలిన వెంటనే మాయ ఆవు అరచి చచ్చిపడిపోయింది.
ఇతర మునులు తమ ప్రయత్నం ఫలించినందుకు లోపల్లోపల సంతోషించి గౌతమునితో ‘నీవు గోహత్య చేశావు. నీకు గోహత్యా పాతకం చుట్టుకొన్నది. కావున నీచేతి అన్నం తినరాదు’.. అంటూ దూషించసాగారు. అమాయకుడైన గౌతమ ముని తన పాప ప్రక్షాళన గురించి వారిని సలహా కోరాడు. ‘శివుని జటాజూటంలోని గంగాజలాన్ని తెచ్చి ఈ ఆవు మృతకళేబరం మీద ప్రవహింపజేస్తే నీ పాపం పోతుంద’ని ఆ మునులు చెప్పారు. దాంతో గౌతముడు ఆశ్రమంలోని పంటంతా మునులకు అప్పగించి పరమేశ్వరుని దర్శనానికి తపస్సు చేశాడు.
గౌతముడు జరిగినదంతా పరమేశ్వరునికి తెలిపి ‘గంగాజలాన్ని అనుగ్రహించమ’ని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు సహ్యాద్రి పంక్తుల్లోని బ్రహ్మగిరి శిఖరం మీద నుంచి తన జటాజూటంలోని గంగాజలాన్ని కొంచెం ప్రసరింపజేశాడు. గౌతముడు ఆ జలధారను తీసుకొచ్చి చనిపోయిన గోమాతను బతికించాడు. గౌతముని తపోబలానికి మునులంతా సిగ్గుపడి ‘క్షమించమ’ని ఆయన పాదాల మీద పడ్డారు. ఉదారమూర్తి అయిన గౌతముడు వాళ్లందరినీ దయతో మన్నించాడు. ఈవిధంగా గంగాజలాన్ని తీసుకొచ్చి గోహత్యాపాతకం నుండి విముక్తుడయ్యాడని - బ్రహ్మాండ పురాణంలో ఒక గాధ. చనిపోయిన ఆవుకు ప్రాణదానం చేసినందున ‘గోదావరి’ అన్నారు. గౌతముడు తన తపోశక్తితో తెచ్చాడు కనుక ‘గౌతమీ’ అన్నారు. శివుని నుండి జాలువారింది కనుక ‘గంగ’ అన్నారు. ఇదీ గోదావరి కథ.
ప్రతి 12 సంవత్సరాలకోసారి బృహస్పతి పుష్కరునితో కలసి ఒక్కో నదిలో ప్రవేశిస్తుంది. అలా ఏ నదిలో ప్రవేశిస్తే ఆ సంవత్సరం ఆ నది పుష్కరంగా పిలుస్తారు. బృహస్పతి పుష్కరునితో కలసి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి. ఇలా పుష్కరాలు ప్రారంభమైన మొదటి 12రోజులు ప్రధాన పుష్కర పర్వదినాలు. ఈ సమయంలో యాత్రికులు స్నాన, దాన, హిరణ్యశ్రాద్ధ, తీర్థశ్రాద్ధ పితృతర్పణ విధులతోను, గంగా పూజతో భక్తిశ్రద్ధలతో నదీస్నానం, ఇతర కార్యక్రమాలు చేయాలి. ఇది భారతీయుల సంప్రదాయం.
పుష్కర స్నానం
నదిని సేవించటం అంటే నదిలో స్నానం చేయటం. విధివిధానాల్ని అనుసరించి పవిత్ర స్నానం చేయటం. సర్వదా సిద్ధపురుషులు సేవించే గోదావరిలో స్నానం చేస్తే ‘గవామయనం’ అనే యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుందని - మహాభారతం చెబుతోంది. స్నానం దశవిధాలని శాస్త్రం చెబుతోంది. ఈ దశవిధాల్లో తీర్థస్నానం ఒకటి. దశవిధ స్నానాల్లో అతి శ్రేష్ఠమైనది కూడా అదే. తీర్థస్నానానికి ఒక విధివిధానముంది. నది ప్రవాహానికి అభిముఖంగా నడుములోతు నీటిలో నిలబడి నది ప్రాముఖ్యతను, నది మహిమను స్మరించి, నదికి అధిదేవత, అభిమాన దేవత అయిన భగవంతుని స్మరించి మునకలు వేయాలి. నదీస్నానం కేవలం శరీరానికి మాత్రమే కాదు, తనలో సూక్ష్మరూపంలో ఉన్న దైవరూపానికి అనికూడా గ్రహించాలి. గోదావరి పుష్కర దినాల్లో ఈ నది ప్రవహించిన చోట ఎక్కడ స్నానం చేసినా పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. మనం పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ నశించి మోక్షం కలుగుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఈ 12రోజులూ ఎన్నో పుణ్యకార్యాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి వ్యక్తి విధిగా స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్టాలను, పితృపిండ ప్రదానాలను చేయాలని మన మహర్షులు బోధించారు. ఈ కర్మలను ఆచరించటం వల్ల శారీరక, మానసిక కల్మషాలు తొలగి మానవులు పవిత్రులు, తేజోవంతులు, ఉత్తేజవంతులు అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కర్మలు ఆచరించటం వల్ల మనుష్యజాతిలో భిన్నత్వంలో ఏకత్వం సిద్ధిస్తుంది.
పుణ్యస్నానం

పుణ్య కార్యాలన్నింటిలోకీ ముఖ్యమైనది, ఎంతో ఫలితాన్నిచ్చేది పుష్కర స్నానం. తరువాత దానం. నదులు దైవ, ఆర్ష, మానవ, అసుర బేధంతో నాలుగు రకాలని బ్రహ్మపురాణం చెబుతోంది. త్రిమూర్తిల చేత ప్రవర్తింప చేయబడేవి మొదటి తరగతికి చెందుతాయి. అలా మొదటి తరగతికి చెందినది గోదావరి. కనుక గోదావరి నదిలో స్నానం చేయటం మహాపుణ్యం.
‘జన్మప్రభృతి యత్పాపం స్ర్తీయావాపురుషేణవా
పుష్కరేస్నాత మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి’..
అంటే, పుట్టినప్పటి నుండి స్ర్తి గాని, పురుషుడు గాని చేసే పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుందని అర్థం. పుష్కర సమయంలో ప్రాతఃకాలంలో స్నానం చేయటం ఉత్తమం. గోదావరి పుష్కర యాత్రకు వెళ్లి 12రోజులు అక్కడ ఉండి యాత్రా కార్యక్రమాలు చేసేవారు ఇంట్లో విఘ్నేశ్వర పూజ చేసుకుని పుష్కరాలకు ఒకరోజు ముందు గోదావరి తీరానికి చేరాలి. పుష్కర ప్రవేశదినానికి ముందురోజు ఉదయం నదీస్నానం చేసి సర్వప్రాయశ్చిత్తము చేసుకోవాలి. ఆనాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు శిరోముండనం చేయించుకొని గోదావరి నదీస్నానం చేయాలి. స్నానం తరువాత యథాశక్తిగా దానం చేయడం, దశదానాలు, షోడశ మహాదానాలు చేసి తీర్థశ్రాద్ధాలు చేసే పితురులను సంతృప్తి పరచాలి.

12 రోజులు చేయాల్సిన దానాలు
తొలిరోజు : బంగారం, వెండి, ధాన్యం, భూదానాలు
రెండోరోజు : వస్త్రం, లవణం, గోవురత్నాలు
మూడోరోజు : బెల్లం, గుర్రం, కూరలు, పండ్లు
నాలుగోరోజు : పాలు, పెరుగు, తేనె, నెయ్యి
ఐదోరోజు : ధాన్యం, బండి, గేదె, వృషభం, నాగలి
ఆరోరోజు : ఔషధం, కర్పూరం, చందనం, కస్తూరి
ఏడోరోజు : గృహం, పీఠం, శయ్య, పల్లకి
ఎనిమిదోరోజు : గంధపు చెక్క, పుష్పాలు, దుంపలు, అల్లం
తొమ్మిదోరోజు : పిండ ప్రదానం, శయ్యము
పదోరోజు : శాక, సాలగ్రామ, పుస్తకం
పదకొండోరోజు : ఏనుగు, మొదలైనవి
పనె్నండోరోజు : విద్యుక్త స్నానం, దానాలు.
ఇలా, గోదావరి నది పుష్కర సమయంలోని పనె్నండు రోజులూ తమ శక్తికొద్దీ దానాలు చేసినవారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతారు. ఈ పనె్నండు రోజులూ ఒక్కోరోజు ఒక్కో దానం ఒక్కో రకమైన ఫలితం ఇస్తుందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.పుష్కర సమయంలో దేవతలు, ఋషులతో పాటు పితృదేవతలు కూడా వస్తారన్నది ప్రమాణ వాక్యం. కనుక పుష్కర సమయంలో చనిపోయిన పితృదేవతలకు శార్థకర్మలు ఆచరించాలి. అలాచేస్తే పితృదేవతలు సంతసించి వంశవృద్ధిని కలిగిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
పనె్నండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో భాగంగా ఈ సంవత్సరం జూలై 14 మొదలు 25 వరకు గోదావరి నది పుష్కరాలు జరుగుతాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో గోదావరి నది ప్రవహిస్తున్నందున ఆయా ప్రదేశాల్లో పుణ్యస్నానాలు ఆచరించి దానాలు, శ్రాద్ధకర్మలు యథాశక్తి చేయవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి తమ జన్మ చరితార్థం చేసుకుంటారని ఆశిద్దాం.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!