పరాధికారము మనము పయిఁ బెట్టు కోరాదు.! .

పరాధికారము మనము పయిఁ బెట్టు కోరాదు.!

.
(నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి.... మిత్రభేదము.)
.
వారణాసియందు ధావకమల్లుఁడను చాకివాఁడు గలడు.
ఒకనాఁడు వాఁడు మిగుల బట్టలు గుంజిన బడలిక చేత మయిమఱచి గుఱువెట్టి నిద్రపోవుచుండెను. ఆ నడిరేయి వాని యిల్లొక దొంగ చొచ్చెను. అప్పుడు వాని యింటి వాకిటఁ గాలి బందముతో గాడిద నిలుచుండెను. ఆ యింటి కావలికుక్క దాపునఁ గూర్చుండి చూచుచుండెను. అవి యొండొంటితో 'లోనికి దొంగ చొచ్చినాఁడు. చూచితివా?', 'చూచితిఁ జూచితి', 'మఱి యేల మొఱుగవు?', 'నాపని విచారింప నీకేమి నిమిత్తము?', 'మన దొరయిల్లు దొద్దవోఁగా నొప్పరికింపవచ్చునా?', 'నీవే మెఱుఁగుదువు? రాత్రి దినము నిమిషమాత్రమయినఁ బ్రమాదపడక తలవాకిలి వదలక యిల్లు గాచుకొని యుండుదును. ఆవంతయయిన నావలని ప్రయోజన మెఱుఁగక యేలిక నాయందు సాతకము లేకయున్నాఁడు. కాఁబట్టి కూడు కమికెఁడయిన దొరకుట కఱవయ్యె. పాటెఱుఁగని దొరను సేవించుట కంటె మిన్నకుంట మేలు.'
ఇట్లు ఖరశ్వానములు ప్రశ్నోత్తరములు జరుపుచుండఁగా గాడిద మిక్కిలి కోపించుకొని 'యోరి దురాత్మ! వినుము. ఒక పోరామి వచ్చినపుడు స్వామి దోషములు దడవి యుపేక్షించి యుంట భృత్యునకు ధర్మము గాదు. అదియును గాక స్వామి రక్షణము విచారింపక సేవకుఁడు స్వార్థపరుఁడయి స్వకృత్యము నందుఁ బ్రవర్తింపఁడేనిఁ గృతఘ్నుఁ డగును. నీవు పాపిష్ఠుఁడవు. దొసఁగు పొసఁగినప్పుడు స్వామికార్య ముపేక్షించితివి. ఇంతటితో నేదియు మునిఁగిపోదు. నీపని నాచేతఁ గాదా? చూడు. మన యేలిక నిప్పుడు ప్రబోధించెదను' అని చెప్పి గట్టిగా నోండ్ర పెట్టెను. అంత నా మడివేలు మేలుకొని నిద్రాభంగమాయెనని మహాకోపముతో లేచి యొక బడియతో గాడిదను మోదెను. ఆయమందా మోఁదు తాఁకుట జేసి యా గాడిద ప్రాణములు విడిచెను. కాబఁట్టి పరాధికారము మనము పయిఁ బెట్టు కోరాదు.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!