సుగ్రీవవిజయము యక్షగానము ...
( పీఠిక- శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి)
.
శ్రీమద్రామాయణమునఁ గల కథాఖండములలో సుగ్రీవవిజయకథ యొక కండపట్టు. అత్యల్ప
కాలమున వడివడిగా గంటలలో నడచిన యీకథపట్టు రామలక్ష్మణులు, హనుమంతుఁడు,
సుగ్రీవుఁడు, వాలి, అంగదుఁడు, తార అను కథాపాత్రముల శీలపు మేలిమినొఱసి
మెఱుఁగు తఱుగులు చూపిన యొఱగల్లనఁ దగినది.
తెలుగున గుత్తెనదీవిరామాయణాదు లగు రామాయణ గేయకృతులలో నీసుగ్రీవవిజయపుఁ గథపట్టు చాలహృద్య రచనములతో నున్నది.
"ఎంతపనిచేసితివి రామా! నిన్ను
నేమనందును సార్వభౌమా!
చెంతకిటు రాలేక చెట్లనో దాగుండి
వింతమృగమునుగొట్టు విధమాయెనాబ్రదుకు!"
ఇత్యాది గేయములను పలువురు పాడుచుందురు.
ఈ రుద్రకవి సుగ్రీవవిజయమునుగూడ స్త్రీ వృద్ధ పామరాదులు పలువురు
పాడుచుందురట! ఆయా పాత్రముల పాటలు తత్తద్వేషధారులు వచ్చి పాడునట్లును తక్కిన
సంధివచనాదులు ఒక్కరిద్దఱు సూత్రధార ప్రాయులు పఠించునట్లును,
నీసుగ్రీవవిజయము వీథియాటగా నాడబడుచుండెడిది. ప్రాచీన సంస్కృతనాటకరచయితలు
భాసభవభూత్యాదు లీ సుగ్రీవ విజయౌచిత్యమును దమ నాటకములలో విమర్శించిరి.
శ్రీరాముని శీలమును శ్రీవాల్మీకి రామాయణ పద్ధతిని సమర్ధించిరి.
భవభూతి "యద్వా కౌశల మింద్రసూనుదమనే తత్రాప్యభిజ్ఞో జనః" యని దీని యౌచిత్యము
నించుక చెనకెను. మనరుద్రకవి సంస్కృతాంధ్ర రామాయణకవులు త్రొక్కిన త్రోవనే
త్రొక్కెనుగాని, యపూర్వకల్పనాంశము నేమాత్రము నిందు జేర్పలేదు.
ఆయాపాత్రములు ప్రసిద్ధ రామాయణములలో నెట్టి యుక్తి ప్రత్యుక్తులు గలవిగా
చిత్రములయ్యెనో ఇందు నదేతీరు గలదు. కాని యిది దేశిరచనముతో గేయరూపమున నుండుట
విశేషము. ఇం దీక్రింది గేయరచనలు ప్రశస్తము లయినవి!
"హా సతీమణి! ధర్మచారిణి! హా గుణోన్నత! జనకసుత! నను
బాసిపోయితి వింతలోనె పద్మనయన!"
"లేఁటి మాయలు మదిని దెలియగ లేక పాపపు రక్కసునిచే
బోటి! నిను గోల్పడితిని నిఁక నాకేటిబ్రతుకు"
"లలన! నినుఁ గలనైనఁ బాయఁగఁగలన, నీవిటలేక యుండినఁ
జలనమొందెను నాదు హృదయము జలజనయనా!"
"తరణి కులమున బుట్టి శరచాపములు బట్టి
తరుణిఁ గోల్పడు కంటె మరణమే మేలు!
నను శౌర్యవంతుఁడని తనపుత్రి నిడినట్టి
జనకవిభుఁ డీవార్త విని వగవకున్నె!"
"నాయమెఱుఁగక చంపితివి నరనాథ! పాపముఁ గట్టుకొంటివి
బోయ వింతియె గాక నీవొక భూమిపతివా?"
"శ్రీరామ! నీరామఁ జెఱఁగొన్న రావణుని
వారధుల ముంచితిని వాలమునఁజుట్టి
ఒకమాట నాకుఁ జెప్పకపోయితివి గాక
సకలదైత్యుల దున్మి జానకిని దేనె."
"ఆలి చెఱఁగొని పోయినట్టి దశాస్యుఁడుండగ నిర్నిమిత్తము
వాలినేటికిఁ జంపితివి రఘువంశ తిలకా!
ఇట్టి సాహస కర్మ మెచటికి నేఁగె భరతుఁడు సీమవెడలఁగఁ
గొట్టి రాజ్యము పుచ్చుకొన్నెడఁ గువలయేశా!
నాయమేటికిఁ దప్పితివి రఘునాథ! జానకితోడనే చెఱఁ
బోయెనే నీ రాజనీతియు భూరిమతియున్?"
శ్రీరామచంద్రమూర్తి చెట్టుచాటుననుండి వాలిమేనఁ గాఁడనేసిన వాఁడిములుకుల
కంటె, నిక్కడ తార ప్రత్యక్షమై నిలుచుండి శ్రీరాముని యంతరంగము
నుచ్చిపోవునట్టు ప్రయోగించిన పలుకుములుకులు క్రొవ్వాఁడి గలవి.
ఈలఘుకృతి వీరకరుణరస భరితము. నీతిహృద్యము. స్త్రీ బాల పామరాదులు గూడ పఠింపఁ దగినది.
Comments
Post a Comment