ప్రబంధాలలోని యందాలు!!

ప్రబంధాలలోని యందాలు!!
-------------------------------------


ఆంధ్రసాహిత్యంలో ప్ర బంధాలది ప్రముఖ స్థానం. రాయల కాలంలో వెలసిన ఆగ్రంధాలలో యెన్ని వినూతన మైన యందాలో.! కావ్య నాయికా కల్పనలో వారుజూపిన నేర్పు అపూర్వం. పెద్దన, తిమ్మన, రామరాజ భూషణుల కావ్యాలలోని నాయికలు . అంతకు ముందులేని కొత్తపోకడలను బోయారు. వాటిని గురించియే యీప్రస్థావన.

రాయల సభలో నొకనాడు కవులను జూచుచు ప్రభువు ప్రశ్నించినాడట." రామకృష్ణయ్యగారూ! మనప్రబంధ కవులు నాయికలనుచక్కగా  వర్ణిం చేరు... మీ  అభిప్రయం   వివరిపుడనెనట.
.
" ఆ ఁ యేమున్నదిలెద్దురూ !" అల్లసానివారు అల్లనల్లన యేడిస్తే ,ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగాయేడ్చాడు. యిక మన భట్టుమూర్తి గారైతే బావురు మనియేడ్చారు" . అన్నాడట.
రాయలు ఫక్కున నవ్వి యేదీ ఆపద్యాలేవో వివరించండీ? అన్నాడట.రామకృష్ణుడు వివరణకుపూనుకొన్నాడు.

1 మనుచరిత్త్రము :- అల్వసానిపెద్దన ;

ఉ: పాటున కింతు లోర్తురె? కృపారహితాత్మక! నీవుత్రోయ , ని
చ్చోట, భవన్నఖాంకురము సోకె; కనుంగొనుమంచు జూపి, య
ప్పాటల గంధి , వేదన నెపంబిడి యేడ్చె,' కలస్వనంబుతో' '
మీటిన విచ్చు గుబ్బ చను మింటల నశ్రులు చిందువారగన్; - ఇదీ ఆపద్యం!

ఇది ప్రవర వరూధినీ సంవాద సందర్భ ము లోనిది. ప్రవరుడు యెంతబ్రతిమి లాడినను తనప్రణయమునకు సమ్మతి తెలుప కుండుట వలన యిక మాటలతోగాదు చేతల తోనయిన నితనిని దారికి తేవలెననుకొని, ప్రవరుని పైబడి కౌగిలించుకొని ,మోవినందికొని ముద్దిడ జూచినది. ప్రవరుడు సరసుడుగాడాయె, విరసుడాయె,పరాంగనా విముఖుడాయె," ఛీపొమ్మని " మొగము పక్కకు తిప్పుకొని యాభుజమునుదాకి క్రందకు త్రోసివైచినాడు. అప్పుడామె తనప్రయత్నమును కొనసాగించుచు, " దయలేనివాడా!చూడవయ్యా! నీగోళ్ళుగుచ్చుకొని నాపయోధరములెంత గాయపడినవో"నంటూ " కలస్వనంతో యేడ్చినదట. ( కలస్వనం అంటే మనం వివరింపలేని మధుర నాదం )అప్పటికీ ఆయన కరగ లేదు. యిక అదివేరే సంగతి;

2 ముక్కు తిమ్మన :- పారిజాతాపహరణము;

ఉ:- ఈసున బుట్టి , డెందమున హెచ్చిన కోపదవానలంబుచే
గాసిలి, యేడ్చె, ప్రాణవిభు కట్టెదుటన్ లలితాంగి! పంకజ
శ్రీ సఖ మైన మోముపయి చేల చెరంగిడి ," బాల పల్లవ
గ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్ ;--ఇదీ ఆపద్యం!

కొంటెనారదుడు పారిజాత పుష్పాన్నితెచ్చి కృష్ణునకు యిచ్చి కొంపలో చిచ్చుపెట్టాడు. యెవరికివ్వాలి?యెదుట రుక్మిణి ,సరేఆమెకిచ్చాడు. నారదుడు రుక్మిణిని పొగిడాడు.నీవు సత్యకన్నామిన్నవని, యీసంగతి సత్యకితెలిసింది. ఆమె అలకృబూని కోపగృహ ప్రవేశంచేసింది. పాపం కృష్ణుడువచ్చి కాళ్ళపైబడి , మన్నింపగోరాడు.కోపంమీద ఉందేమో ఆమె మొగుణ్ణి కాళ్ళతో తన్నింది.కృష్ణుడు బ్రతిమాలసాగినాడు. అయినా వినకుండా యేడ్పు మొదలెట్టింది.యెలాఉందాయేడుపు? లేచిగురాకులను మేసినందున వగరుతెగిన గొంతుక గలకోయిల కూసినట్టున్నదట! అదీ కాకలీ ధ్వనితోనే! అలాయేడిస్తే మనవాళ్ళు యెంతసేపైనా వినమా?

3 వసుచరిత్రము-:- రామరాజ భూషణుడు;

శా:- ఆజాబిల్లి వెలుంగు వెల్లియల డాయంలేక రాకాసఖా
రాజ శ్రీ సఖమైన మోమున పటాగ్రంబొత్తి, యెల్గెత్తి ,యా
రాజీవానన యేడ్చె; కిన్నరవధూ రాజత్కరాంభోజ కాం
భోజీ రాగ విపంచికారవ సుధాపూరంబు తోరంబుగన్;

వసుచరిత్ర ప్రబంధనాయిక గిరిక. ఆమె వసురాజు ప్రణయమున మునిగినది. విరహ దశలో వెన్నెలలకు తాళలేక, పాపమాచిన్నది ,యేడుస్తున్నది.యెలా? చంద్ర సమానమైన మోమున వస్త్రము నడ్డుగానిడుకొని ,బిగ్గరగా గొంతెత్తి ,కిన్నర స్త్రీలు కాంభోజీరాగంలో మేళగించిన వీణియ మ్రోగినట్లుగా యేడ్చినదట!

రామరాజ భూషణుడు సంగీత విద్యా ప్రవీణుడు. కాబట్టే విషాదానికనుకూలంగాఉండేరాగంలో ఆమెనేడ్పించాడు. ఇంతకీ ఆమె బావురు మనియేడ్చింది. అంతేమనకి కావలసింది. చూశారా?నాయికలను యేడ్పించినా, ప్రబంధకవులు యెంత సొగసుగా యేడ్పించారో!!!

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!