ముస్లిము చరిత్రలు


ముస్లిము చరిత్రలు

హిందూదేశమునందు చరిత్ర రచన మహమ్మదీయుల ఆగమనముతో ప్రారంభమయినది. మహమ్మదీయులకు చరిత్రాభిమానము మెండు; కావున వారు మొదటినుండియు చరిత్ర రచనకు పూనుకొని పెక్కు చరిత్ర గ్రంథములను రచించిరి; కాని అవి దేశ చరిత్రలు కావు; అవి యన్నియు మహమ్మదీయ రాజ్యముల యొక్కయు, మహమ్మదీయ రాజవంశముల యొక్కయు చరిత్రములు. కావున వానియందు ఆ రాజ్యములకును రాజవంశములకును సంబంధించిన విషయములు మాత్రమే వర్ణింపబడినవి. వానిలో దేశ ప్రజలనుగూర్చి కాని, హిందూ రాజ్యములను గూర్చికాని ప్రస్తావము ఉండదు. మరియు మతాభిమానము పెంపున మహమ్మదీయ చరిత్రకారులు హిందువులనుగూర్చి కాని, హిందూ రాజ్యములనుగూర్చి కాని విధిలేక చెప్పవలసివచ్చినపుడు ఉన్నది ఉన్నట్లు చెప్పక, సత్యమును కప్పిపుచ్చి, తమ యాధిక్యమును స్థాపించుకొనుటకు విషయమును తారుమారు చేసి చెప్పుదురు; కావున ఆధునిక దృష్టితో దేశ చరిత్రము రచియించునప్పుడు వానియందలి విషయములను చక్కగ పరిశీలించి కైకొనుట యుక్తము. క్రీ. శ. 14 శతాబ్ద ప్రారంభమునుండియు దక్షిణ భారతమున మహమ్మదీయుల ప్రాబల్యము అధికము కాజొచ్చినది. అప్పటినుండియే మహమ్మదీయ చరిత్రలలో దక్షిణ హిందూ రాజ్యముల ప్రస్తావము కానవచ్చును. ఈ చరిత్రలలో సమకాలిక రచనములును, అర్వాచీన రచనములును కలవు.

మహమ్మదీయ చరిత్రకారులలో ప్రప్రథమమున పేర్కొనదగినవాడు అమీరు ఖుస్రూ. ఇతడు బహు మేధావి; మహాకవి, సంగీత విద్వాంసుడు. ఇతడు అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ కాలమునుండి ఘియ్యాజుద్దీన్‌ తుఘ్లకు కాలము పర్యంతము ఢిల్లీ సుల్తానుల యాశ్రయమున వర్ధిల్లి పారశీక భాషలో పెక్కు కావ్యములను రచించుటయే కాక 'తారీఖ్‌-ఇ-ఆలై' అను నామాంతరము గల 'ఖజైన్‌-ఉల్‌-ఫుతూహ్‌', 'తుఘ్లక్‌ నామా' యను చరిత్రలను వ్రాసెను. ఇందు మొదటిది వచన రచన. అందే అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ యొక్క యాంధ్రదేశ దండయాత్రలును, తక్కిన దక్షిణ దిగ్విజయములును వర్ణింపబడినవి. ఈ చరిత్ర గ్రంథమునందే కాక అతనిచే విరచితమైన 'ఖిజ్ర్‌ఖాన్‌ వ దవల్‌ రాణీ', 'నూ సిపిహ్ర్‌' అను కావ్యములలోను ఖిల్జీ సుల్తానుల దక్షిణ దిగ్విజయములు అందందు సందర్భానుసారముగ వర్ణింపబడినవి.

ఇతని తరువాత చెప్పదగినవాడు ఈసామీ. ఇతడు బాల్యమున ముహమ్మద్‌ బిన్‌ తుఘ్లకు ఢిల్లీ నుండి రాజధానిని దౌలతాబాదుకు మార్చినపుడు దక్కనుకు వచ్చి యచ్చటనే స్థిరముగ నిలిచిపోయెను. ముహమ్మదు బిన్‌ తుఘ్లకుపై దక్షిణదేశములవారు తిరుగుబాటు కావించి స్వతంత్ర రాజ్యములు స్థాపించుకొనినపుడు ఇతడు దక్కనునందే యుండి, అచట అపుడు నడచిన చరిత్రాంశములను ప్రత్యక్షముగ చూచెను. క్రీ. శ. 1347 లో స్వతంత్రుడై గుల్బరగ రాజధానిగ బహమనీరాజ్యమును స్థాపించిన అల్లా ఉద్దీన్‌ హసన్‌ గంగూ బహ్మన్‌షాను ఆశ్రయించి అతని యాదర గౌరవములకు పాత్రుడై క్రీ. శ. 1349 వ సంవత్సరమున, 'ఫుతూహ్‌-ఉస్‌-సలాతీ' నను ఉత్తమోత్తమ పద్యచరిత్ర గ్రంథమును రచించి అతనికి అంకితమొసగెను. ఇతని చరిత్రలో ఒక యాంధ్రదేశమునందే కాక దక్షిణ భారతమున నడచిన చరిత్రాంశములు విపులముగ వర్ణితము లైనవి. ఇతడు మహమ్మదీయ చరిత్రకారు లందరిలో గరిష్ఠుడు. ఇతడు గాఢ మతాభిమానము గలవాడైనను సత్యముమీదనే దృష్టి అధికముగ కలవాడు. కావున ఇతడు రచించిన చరిత్ర అత్యంతము విశ్వాసపాత్రమైనది.

ఈసామీకి సమకాలికుడు జియా ఉద్దీ\న్‌ బరనీ అను మహమ్మదీయ చరిత్రకారుడు మరియొక డుండెను. ఇతడు మహమ్మదు బి\న్‌ తుఘ్లకు ఆస్థానమున ఉండెను. మొట్ట మొదటినుండి ముహమ్మదు బి\న్‌ తుఘ్లకు పర్యంతము ఢిల్లీని పాలించిన మహమ్మదీయరాజుల చరిత్రను ఇతడు 'తారీఖ్‌-ఇ-ఫిరోజ్‌షాహి' అను గ్రంథమున వివరించెను. బరనీకి మతాభిమానముతోపాటు జాత్యభిమానముగూడ గాఢమైనందువలన ఇతడు రచించిన చరిత్ర ఈసామీ గ్రంథమువలె పక్షపాతరహితమైనది కాదు. హిందువుల యెడలను, మహమ్మదీయమతము నవలంబించిన భారతీయుల యెడలను ఇతడు ద్వేషముకలవాడై సందర్భము చిక్కినపుడెల్ల వారిని దూరుచుండును. కావున ఇతని యభిప్రాయములను పరిశీలించి చూచి కైకొనుట యుక్తము.

బరనీ వలెనే 'తారీఖ్‌-ఇ-ఫిరోజ్‌షాహి' అను పేరుగల చరిత్రను వ్రాసిన చరిత్రకారుడు మరియొకడు కలడు. ఇతని పేరు షమ్స్‌-ఇ-సిరాజ్‌ ఆఫీఫ్‌. ఇతని చరిత్ర బరనీ గ్రంథమంత ఉపయుక్తమైనది కాదు; కాని ఇందు మరియెచ్చటను కానరాని చరిత్రాంశములు కొన్ని కలవు.

ఇతనితరువాత పేర్కొన దగినవాడు నిజామ్‌ ఉద్దీన్‌ అహమద్‌ బఖ్షి. ఇతడు ఢిల్లీయందు అక్బరుపాదుషా యాస్థానమునం దుండెను. ఇతడు చరిత్ర రచనయం దొక క్రొత్త దారిని తొక్కెను. పూర్వులగు భారతీయ మహమ్మదీయ చరిత్రకారులవలె ఢిల్లీ సుల్తానుల చరిత్రతో తృప్తి నొందక బంగాళ, మాళవ, గుజరాతు, దక్కను ప్రాంతములలో స్వతంత్రరాజ్యములను స్థాపించి పరిపాలించిన మహమ్మదీయ రాజవృత్తాంతములను కూడ వర్ణించి యున్నాడు. నేటివరకు లభ్యమైన బహ్మనీ మొదలగు దక్కను మహమ్మదీయ రాజవంశ చరిత్రలలో నెల్ల నిజాముద్దీ\న్‌ అహమదుచే విరచితమైన 'తబకాత్‌-ఇ-అక్బరీ' లోని గ్రంథభాగమే ప్రాచీనతమ మైనది. అర్వాచీన మహమ్మదీయ చరిత్రకారులలో పెక్కండ్రు నిజామ్‌ ఉద్దీ\న్‌ అహమదు మార్గమును అవలంబించి విపులమైన చరిత్రలను రచించిరి. కాని మహమ్మదీయ చరిత్రలలో నిజామ్‌ ఉద్దీ\న్‌ రచనకు కొంత ప్రత్యేకత కలదు.

నిజామ్‌ ఉద్దీ\న్‌ యొక్క పద్ధతి ననుసరించి చరిత్రను వ్రాసిన రచయితలలోనెల్ల ముహమ్మదు కాసిం హిందూషా ఫెరిస్తా సుప్రసిద్ధుడు. ఇతడు హిందూదేశమునందు మహమ్మదీయుల అభ్యుదయమును వర్ణించుచు ఒకగొప్ప చరిత్ర గ్రంథమును వ్రాసెను. ఇది 'తారీఖ్‌-ఇ-ఫెరిస్తా' అనుపేర వాసికెక్కినది. ఫెరిస్తా దక్కను వాస్తవ్యుడు; మొదట నిజాంశాహి సంస్థానమును ఆశ్రయించి కొంత కాలము అతడు అహమదునగరమున నివసించి యుండెను. తరువాత అతడు విజాపురమునకు వచ్చి అచట ఆదిల్‌ శాహి ప్రభువులను ఆశ్రయించి వారి యనుగ్రహమునకు పాత్రుడై చరిత్ర రచన సాగించెను. భరతఖండమునందు ప్రభుత్వము సల్పిన మహమ్మదీయ రాజవంశము లన్నింటి వృత్తాంతమును ఫెరిస్తా తాను రచించిన చరిత్రమున వర్ణించి యున్నను దక్కను రాజవంశములను, అందును ముఖ్యముగ బహ్మనీ, ఆదిల్‌శాహీ, నిజామ్‌శాహీలను గూర్చి విస్తరించి చెప్పుట వలన అది దక్కను మహమ్మదీయ రాజ్యముల చరిత్రగనే ప్రసిద్ధిచెందినది; కాని ఫెరిస్తాకు స్వమతాభిమానముతో కూడ తనకు ఆశ్రయ మొసగిన ఆదిల్‌శాహీలపై ఆదర మధికమగుటవలన అతడు తరచుగా చరిత్రాంశములను విడిచిపెట్టియు, తారుమారు చేసియు సత్యమును కప్పిపుచ్చి యున్నాడు; కావున అతని చరిత్ర విశ్వాసపాత్రమైనది కాదు. అతని వ్రాతల లోని విషయములు ఇతర చరిత్రాధారములవల్ల రుజువైన కాని అంగీకార్యములు కావు.

ఫెరిస్తా అనంతరము వెలసిన మహమ్మదీయ చరిత్ర కారులలోనెల్ల ఖాఫీఖాను ముఖ్యుడు. ఖాఫీ యనునది అతని వాస్తవ నామము కాదు. అతడు మొగలాయి చక్రవర్తియగు ఔరంగజేబు కొలువులోని యుద్యోగి. ఆ చక్రవర్తి తన చరిత్ర ఎవ్వరును వ్రాయగూడదని శాసింపగా ఇతడు తాను రచించిన చరిత్రను గుప్తముగ దాచియుంచెను. తత్కారణముగ ఇతనికి (ఖాఫీ) దాచి పెట్టిన ఖానుడని పేరు కల్గెనని చెప్పుదురు. ఇతడు తనకు ముందు నడచిన చరిత్రను పూర్వచరిత్రలను ఆధారపరచుకొని వ్రాసెను. దక్కను విషయమున ఇతడు ఫెరిస్తా చరిత్రను అనుసరించినను అందందు ఫెరిస్తా వ్రాతకు విరుద్ధములైన అన్యగ్రంథములలోని చరిత్రాంశములను ఉదాహరించి యున్నాడు. తన కాలమున జరిగిన చరిత్రను మతాభిమాన దృష్టితో కాక యథాతథముగ వర్ణించి సత్యమును తెలిపి యున్నాడు. కావున ఇతని రచన అత్యంతము విశ్వాసపాత్రమని ఆధునిక చరిత్ర పరిశోధకుల యభిప్రాయము.

పైన చెప్పిన వారివలె హిందూస్థాన చరిత్రలను వ్రాయక మరికొందరు మహమ్మదీయ చరిత్రకారులు ప్రాంతీయ మహమ్మదీయ రాజ్యములనుగూర్చి గ్రంథములను వ్రాసిరి. వారిలో ముఖ్యుడు సయ్యద్‌ ఆలీ తబాతబా అను నతడు. ఇతడు నిజామ్‌శాహి సంస్థానమును ఆశ్రయించుకొని రెండవ బుర్హా\న్‌ నిజామ్‌శాహి కాలములో అహమదు నగరమునందు నివసించుచు బహ్మనీ సుల్తానులను గూర్చియు, నిజాంశాహి వంశజులను గూర్చియు 'బుర్హా\న్‌-ఇ-మ అసీ'రను చరిత్ర గ్రంథమును వ్రాసి ప్రకటించెను. సయ్యద్‌ ఆలీ తబాతబా ఫెరిస్తాకు సమకాలీనుడు. హిందువులపై ద్వేషమునందు ఇతడు ఫెరిస్తాకు పైమెట్టు; కాని ఫెరిస్తా గ్రంథము కంటె ఇతనిదే విశ్వాసపాత్రమని చరిత్ర పరిశోధకుల యభిప్రాయము.

ఇట్లే ఆదిల్‌శాహి, కుతుబ్‌శాహి వంశ చరిత్రలను వర్ణించిన రచయితలును కలరు. ఇబ్రాహీం ౙబీరీ యను నతడు 'బుసాతీన్‌-ఉస్‌-సలాతీన్‌' అను గ్రంథమునను ౙహూర్‌ ౙహూరీ యను నతడు 'ముహమ్మద్‌ నామా' యందును విజాపుర సుల్తానుల చరిత్రమును వర్ణించి యున్నారు. అజ్ఞాతనామధేయుడగు చరిత్రకారు డొకడు 'తారీఖ్‌-ఇ-ముహమ్మద్‌ కుల్లీ కుతుబ్‌శాహి' అను గ్రంథమున కుతుబ్‌శాహీల చరిత్రమును వర్ణించి యున్నాడు. మరియొకడు 'హదీకత్‌-ఉల్‌-ఆలమ్‌' అను గ్రంథమున ఈ వంశజుల చరిత్రమును కడపటి కుతుబ్‌శాహి సుల్తానగు తానాశాహ పతనమువరకును వివరించి యున్నాడు. ఈ మహమ్మదీయ చరిత్రలయం దాయా రాజ్యములను ఏలిన సుల్తానుల చరిత్రలే కాక ఇరుగు పొరుగుల తెలుగు రాజ్యములకు సంబంధించిన విషయములును ప్రస్తావవశమున వర్ణింపబడి యుండుట వలన ఇవి తెలుగుదేశ ప్రాచీన చరిత్ర రచనకు మిక్కిలి ఉపయుక్తము లగు చున్నవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!