"కిమపి కిమపి..."

శ్రీ కామేశ్వర రావు భైరవభట్ల గారు (Kameswara Rao Bh)

అశోకవనంలో సీతాదేవికి శుభసూచకంగా, "లోని నాళము చిన్నిమీను కదల్చిన కొలకుపై తమ్మిపూవిలసనంబు"లా ఎడమకన్ను అదిరిందని వాల్మీకి పోలికని తన మాటల్లో అంటారు విశ్వనాథ.

"కిమపి కిమపి..." అనే ప్రసిద్ధమైన భవభూతి శ్లోకానికి సందర్భానుసారంగా విశ్వనాథ చేసిన తెలుగుసేత కొత్తగా కనిపించింది. రోజులో ఒకోవేళ ఒకో రకంగా తనపై ప్రసరించే రాముని చూపులనూ, ఆతని కన్నులనూ స్మరిస్తూ సీత చెప్పిన పద్యాలలో ఇది ఒకటి:

వదలక యూసుపోకలను వాకొను చింకను జాలులే మఱిన్

నిదురనుబోద మంచు మఱి నిద్దురపోవగనీక యేదియో

మొదలిడి ప్రొద్దుపోయి యరమోడుపులం గనుగొంచు నన్ను గ్ర

క్కదలిన హాసరమ్యముల గన్నుల నెంతు సుషుప్తిచారులన్

విశ్వనాథకే స్వంతమైన కల్పనలు కూడా అంతే మధురంగా ఉంటాయి చాలాచోట్ల. తనను చూసిన గుర్తుగా ఏమైనా ఇమ్మని అడిగిన హనుమంతునితో సీత అంటుంది కదా:

చూచితి సీతనం చనిన శూరశిఖామణి! నీదు మాటలో

జూచితివం చెఱుంగుజుమి శూరశిఖామణి రామచంద్రుడున్

జూచితినంచు నింకొకడు క్షోణితలంబున జెప్పగల్గునే

నీ చతురత్వమున్ మఱియు నీ భుజశాలిత యేరి కుండునో!

అలా కాదు ఏదైనా ఉండి తీరాలని అంటే,

ఆయన యుంగరమ్మె మఱి యాయన చేతికి గొంచుబోయి యి

మ్మాయన గుర్తుపట్టున మదక్షి నిరంత పరిస్రవన్మహాం

భోయుత బాష్పధారలను బుచ్చిన యూరుపులన్ నిరంతర

ధ్యేయుడ వీవె సీతకని తెల్పును స్వామికి నంగుళీయమే

ఆయన యిచ్చిన ఉంగరాన్నే ఆయనకి తిరిగి యిస్తే చాలట, ఆయన గుర్తుపడతాడు. తన కన్నులనుండి నిరంతరంగా ప్రసరించే కన్నీళ్ళ చెమ్మతో నిండిన తన ఊర్పులు సోకిన అంగుళీయకం, రామునిపై తనకున్న ఎడతెగని ధ్యాసని స్పష్ట పరుస్తుందని సీత నిశ్చయం.

చివరకి యిలా అంటుంది:

అమ్మ నాకును గనిపించె నంచు జెప్పు

మంతకంటె నభిజ్ఞాన మనవసరము

అమ్మగొనిరాకపోతివా యనిన, నీవు

కొంచు రమ్మంటివా యను మంచితముగ

రామాయణానికి ప్రాణం సుందరకాండము. ప్రాణాల లోతులని పట్టి కదిలించేసే సన్నివేశాలు ఎన్నెన్నో!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!