అర్జునుడికి ఊర్వశి ఎందుకు శాపం పెట్టింది?


అర్జునుడికి ఊర్వశి ఎందుకు శాపం పెట్టింది?

.


పరమశివుడు కిరాతుని రూపంలో అర్జునుని విలువిద్యను పరీక్షించిన తర్వాత అతని శక్తియుక్తులకు సంతోషించి పాశుపతాస్త్రం ప్రసాదించాడు. ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు కూడా అర్జునుని ప్రశంసిస్తూ దివ్య అస్త్రాలను ఇచ్చారు. తర్వాత అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడు.
స్వర్గలోకంలో అర్జునునికి ఘనస్వాగతం లభించింది. అర్జునుని గౌరవార్థం నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. స్వర్గలోక అప్సరస అపురూప సౌందర్యవతి, మహోజ్జ్వల మెరుపుతీగ ఊర్వశి మహాద్భుతంగా నాట్యం చేసింది. మైమరపింపచేసిన ఆ నాట్యాన్ని చూసిన అర్జునుని కనులు ఆశ్చర్యంతో రెప్ప పడలేదు.
అర్జునుడు తనను కన్నార్పకుండా చూడడం గమనించిన ఊర్వశి ఆనందానికి అంతు లేదు. తన ముగ్ధమోహన లావణ్యానికి అర్జునుడు మోహంలో పడిపోయాడని అర్ధమైంది. దేవేంద్రుడు కూడా అలాగే అనుకున్నాడు.
ఆవేళ అర్జునుడు తూగుటుయ్యాలలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఊర్వశి వచ్చింది.
అర్జునుడు ఊర్వశిని చూసి లేచి కూర్చున్నాడు. ఊర్వశి నవ్వుతూ ''అర్జునా! నీ చూపులు నాకు అర్ధమయ్యాయి. నాకు కూడా నువ్వెంతో నచ్చావు. నీ ధైర్యపరాక్రమాల గురించి ఎన్నోసార్లు ఎంతగానో విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాక, ఆ మాటలెంత నిజాలో స్పష్టమైంది. తొలిచూపులోనే నిన్ను వలచాను. సంతోషపెట్టాలని వచ్చాను..'' అంది.
ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ''తల్లీ, నీ మాటలు నాకు ఎంతమాత్రం ఆనందాన్ని ఇవ్వలేదు, ఆందోళన కలిగిస్తున్నాయి. నువ్వు పురూరవుడి భార్యవి.. ఆయన మా వంశంవాడే.. కనుక నువ్వు నాకు తల్లితో సమానురాలివి. అలాగే ఇంద్రునికి ఇష్టసఖివి. అలా చూస్తే కూడా మాతాసమానురాలివే. నిన్ను నేను, నన్ను నువ్వు మొహించడం అనేది అనైతికం. దయచేసి ఈ ఆలోచనలను వదిలేసి హాయిగా వెళ్ళి పడుకో'' అన్నాడు.
ఆ మాటలు ఊర్వశికి రుచించలేదు. కోపావేశంతో రగిలిపోయింది. అయినా తమాయించుకుని మెల్లగా నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. దేవలోకంలో ఇలాంటి నీతులు ఉండవని, అప్సరసలు ఉన్నదే ఆనందింపచేయడానికని చెప్పింది.
కానీ, అర్జునుడు ససేమిరా అన్నాడు. ''నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించదు.. నువ్వు నాకు తల్లితో సమానం'' అన్నాడు.
దాంతో ఊర్వశి కోపం అవధులు దాటింది. ''అర్జునా, అందరూ నన్ను మోహించేవారే కానీ, తిరస్కరించిన వారు ఒక్కరూ లేరు. ఇన్నాళ్ళకి నువ్వే ఇలా మాట్లాడావు.. ఈ పరాభవాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇంత అవమానించిన నీకు ఫలితం తప్పదు. నువ్వు కొన్నాళ్ళు నపుంసకుడిగా జీవించాల్సి వస్తుంది చూడు.. నీ ధైర్యసాహసాలకు భిన్నంగా ఆడవాళ్ళతో కలిసి జీవించాల్సి వస్తుంది.. ఇదే నా శాపం'' అంది.
అలా ఊర్వశి, అర్జునునికి ఇచ్చిన శాపం కారణంగా అర్జునుడు నాట్యాచార్యుడు బృహన్నల అవతారం ఎత్తవలసి వచ్చింది. అర్జునుడు, బృహన్నలగా ఏడాది గడిపాడు. అయితే, ఊర్వశి ఇచ్చిన శాపం ఒకవిధంగా అర్జునునికి వరమే అయింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!