వెయ్యి పడగలు ...ఒక సమీక్ష!


వెయ్యి పడగలు ...ఒక సమీక్ష శ్రీ Vadrevu Ch Veerabhadrudu గారు,!
.
'ఈ విద్య దేనికి పనికివచ్చును? ఒక్క తుపాకిముందు నిది యెందుకును పనికిరాదు. ఒకవేళ పనికివచ్చినను చేసెడిదేమి? దేశమున కింకనే విద్యయు అక్కరలేదు.'

'ప్రతి విద్యకును నాల్గు దశలు! అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణము లని. అవి నాల్గు కలిసినచోటే విద్యకు సంపూర్ణమైన స్థితికలదు. నేనొకటి చదువుకుని అది ఇతరులకు చెప్పి దాని నాచరించి యితరుల చేత దాని నాచరింపచేయుట అనునవి నాల్గుదశలు. తనకర్థము కాని దాని నాచరించుటయు, అర్థమైనదాని నాచరించకుండుటయు మన శాస్త్రాలలోనే లేదు.'

'విద్య యనగానేమి? అక్షరములు నేర్పుటయు, వంకర దస్తూరి వ్రాయించుటయునా? ప్రతివానికిని సంగీతజ్ఞానము, లయజ్ఞానము కూడ సునిశితమై యుండుట విద్యావిధానములో ప్రధానమైన విషయము. మన పూర్వులు చదువనగా హృదయపరిపాకము కలిగించునది యని యనుకొనిరిగాని కేవలం చదువుట, వ్రాయుట మాత్రమే చదువనుకొనలేదు. పూర్వము విద్యయే యుండినది,లేనిదిప్పుడు..'

వెన్ను మీద ఛళ్ళున చరిచినట్టున్న ఈ వాక్యాలు విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు 'నవలలోవి.

నిన్న విశ్వనాథ సాహిత్యపీఠం వారు ఆవిష్కరించిన పుస్తకాల్లో 'విశ్వనాథ వేయి పడగలలోని ముఖ్యాంశాలు 'అన్నది కూడా ఒకటి. డా.వెల్చాల కొండలరావుగారు సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని పరిచయం చేసే బాధ్యత నాకప్పగించారు.

వేయిపడగలు నవలలో వివిధ అంశాల మీద విశ్వనాథ సత్యనారాయణ ప్రకటించిన ఎన్నో అభిప్రాయాల్ని ఆ పుస్తకంలో సంకలనం చేసారు. తన గురించి, విద్య గురించి, భాష, సాహిత్యం, వాజ్మయం, కావ్యం, రసం,నృత్యం, సంగీతం, శిల్పం, నాటకం,మతం, సాంప్రదాయం, ప్రేమ,వివాహవ్యవస్థ లాంటి విషయాలమీద ఆ నవల్లో ప్రాసంగికంగా వెలిబుచ్చిన అభిప్రాయాలతో పాటు, కొన్ని ఋతువర్ణనలు, కథలు కూడా సంకలనం చేసారు.

విజ్ఞానసర్వస్వాల్లాంటి నవలలు ప్రపంచంలో చాలానే ఉన్నప్పటికీ, ఒక నవలనుంచి ఇటువంటి ఎంపికతో వచ్చిన పుస్తకాన్ని నేనింతదాకా చూడలేదు. డేవిడ్ కాపర్ ఫీల్డ్, వార్ అండ్ పీస్, బ్రదర్స్ కరమజోవ్, డాక్టర్ ఫాస్టస్ వంటి నవలలకి లభించని ఈ అపురూప గౌరవం వేయిపడగలకి దొరికింది. ఆ మాటే చెప్పాను సభలో.

ఆ సభలో వేయిపడగలకి ఇంగ్లీషు అనువాదం కూడా ఆవిష్కరణ జరిగింది. అయిదుగురు అనువాదకులు కలిసి చేపట్టిన బృహత్ప్రయత్నం.అందుకుగాను ఆచార్య సి.సుబ్బారావు, వైదేహీ శశిధర్, ఆత్రేయ శర్మ, అరుణా వ్యాస్, నారాయణస్వామి లకు తెలుగు జాతి ఎంతో ఋణపడి ఉంటుంది.

అయితే నేనింతకుముందు 'సంస్కార 'నవల విషయంలో చెప్పినట్టుగా, ఇంగ్లీషులో అనువాదం రావడం ఒక ఎత్తు, దాని చుట్టూ ఒక డిస్కోర్సు లేవనెత్తడం మరొక ఎత్తు. విశ్వనాథను సంప్రదాయవాదిగా, అభివృద్ధి వ్యతిరేకిగా, ఫ్యూడలిస్టుగా తెలుగు ప్రపంచం భావించడానికి చాలావరకు వేయిపడగలు నవలనే కారణం. కాని ఆ భావాల్లో చాలావరకు ఈనాడు కొత్తగానూ, కొత్త ప్రాసంగికతతోనూ కనబడటం విశేషం. ముఖ్యంగా విద్య గురించి వేయిపడగలు వ్యక్తం చేసిన భావాలతో ఈ సంకలనం మొదలుపెట్టడం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది.

ఆధునిక తెలుగు సాహిత్యంలో వైతాళిక పాత్ర పోషించిన రచనలు- కన్యాశుల్కం, గణపతి, కోనంగి, వేయిపడగలు వంటివి తెలుగు జాతి ప్రాచీన ఆధునిక విద్యలపట్ల గొప్ప సంఘర్షణకు లోనైన కాలంలో వచ్చిన రచనలు.

భారతదేశం ఆధునీకరణ చెందుతున్న యుగసంధిలో తలెత్తిన ఆ ప్రశ్నలకీ, ఒక శతాబ్ద కాలం తర్వాత మనమంతా ఎదుర్కొంటున్న ప్రశ్నలకీ మధ్య ఎంతో సారూప్యం ఉంది.

ఈ విద్య ఒక్క తుపాకి ముందు పనిచెయ్యదని విశ్వనాథ ఏ విద్య గురించి మాట్లాడేడో, ఆ విద్య ఇప్పటికీ అలానే ఉంది. విద్య అంటే బలవంతుడి భాష బలవంతంగా నేర్చుకోవడమని ( Education is learning the language of the dominant) ఇప్పటి విద్యావేత్తలు వాపోతున్నారు. ఆధునిక విద్య తలెత్తుతున్న తొలినాళ్ళల్లో ఆ విద్యను విమర్శించడాన్ని అభివృద్ధి వ్యతిరేకంగా విమర్శకులు భావించారు. కాని ఇప్పటికి ఆ విద్య స్వరూప స్వభావాలు మనకి బోధపడ్డాయి కాబట్టి, విశ్వనాథ ఆవేదన సహేతుకమేననని మనకి ఒప్పుకోక తప్పట్లేదు.

మరో మాట కూడా చెప్పాను నా ప్రసంగంలో. విశ్వనాథను సంప్రదాయవాదిగా చూడటం ఆయన భావాలకు సమగ్ర రూపాన్నివ్వడం కాదని. ఆయన్ని వివరించడానికి సరైన పదం ఆయన్నొక anti-colonial రచయితగా గుర్తించడం. 'జీవుడి ఇష్టము ' (1942) లాంటి కథ రాసేటప్పటికి ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో చెప్పుకోదగ్గ యాంటీ కలోనియల్ రచన ఏదీ తలెత్తనే లేదు. ( ఫ్రాంజ్ ఫానాన్ The Wretched of The Earth రావడానికి ప్రపంచం 1961 దాకా ఆగవలసి వచ్చింది.)

సహృదయంతోనూ కొంత నిశితంగానూ విశ్వనాథను చదివినప్పుడు మనకి తెలిసేదేమంటే ఆయన తన చైతన్యం colonize కాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించాడని. ఆధునిక రచయితలు మానవీయ సమాజాన్ని కలగన్న మాట నిజమే గాని అందుకు వాళ్ళు ఎంచుకున్న నమూనాలు కలోనియల్ నమూనాలే. Pre-modern సమాజం మాడర్నైజ్ అయితే మరింత మానవీయంగా మారుతుందనే వాళ్ళు నమ్మారుగాని, ఆ నమ్మకంలో ఎంత అమాయికత్వం ఉందో postmodern thought బయట పెట్టినదాకా మనకు బోధపడలేదు.

గురజాడ, గాంధీ,విశ్వనాథ వంటివారి భావాల్లో సారూప్యత లేకపోయినప్పటికీ, వాళ్ళందరిలోనూ ఉమ్మడిగా కనవచ్చే అంశం, మాడర్నిటీని ధిక్కరించడమే. మాడర్నైజేషన్ ని ఒక కలోనియల్ ప్రక్రియగా నిదానించడంలో వారి జాగరూకత సరైనదేనని ఇప్పుడు మనకి తెలిసి వస్తున్నది.

అలాగని విశ్వనాథ భావాలన్నీ ఆరోగ్యకరమైనవీ,ఆమోదయోగ్యమైనవీ అని కాదు. ఆయన వేయిపడగలు నవలలో తాత్త్వికంగా ఎంత అస్పష్టతకు గురయ్యాడో ఆర్.ఎస్.సుదర్శనంగారు యాభై ఏళ్ళ కిందటనే ఎంతో యుక్తియుక్తంగా విమర్శించారు. కాని ఇప్పుడు మనం చూడవలసింది, చర్చించవలసింది ఆ భావాల కన్నా కూడా ఆ భావాల వెనక ఉన్న స్వతంత్రతా ప్రవృత్తి గురించీ, తాను మానసికంగా colonize కావడానికి ఇష్టపడని ఒక జీవుడి ఇష్టం గురించీను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!