మధ్యాహ్న పురాణం. 1 (304/16.) తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – రెండవ భాగం

మధ్యాహ్న పురాణం. 1 (304/16.) 

తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – రెండవ భాగం

రచన: కె. వి. ఎస్. రామారావు

ఏడవరోజు

ఏడవరోజు యుద్ధానికి కౌరవసేనని మండలవ్యూహంగా దిద్దాడు భీష్ముడు. అదిచూసి వజ్రవ్యూహం కల్పించమని ధర్మజుడు తన సేనాపతికి చెప్పాడు. రెండు సైన్యాలు ఆవేశంగా రెండోవైపుకు దూసుకుపోయినయ్.

ద్రోణుడు విరాటునితో, అశ్వత్థామ శిఖండితో, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడితో, శల్యుడు కవలల్తో, విందానువిందులు యుధామన్యునితో, అనేకమంది రాజులు అర్జునుడితో తలపడ్డారు. అలాగే భీముడూ కృతవర్మ, అభిమన్యుడూ చిత్రసేన దుశ్శాస వికర్ణులు, ఘటోత్కచుడూ భగదత్తుడు, సాత్యకీ అలంబుసుడు, ధృష్టకేతుడూ భూరిశ్రవుడు, చేకితానుడూ కృపాచార్యుడు, ధర్మజుడూ శ్రుతాయువు, ఎంతోమంది రాజులూ భీష్ముడు జతలుగా పోరసాగారు.

“భీష్ముడి వ్యూహాన్ని చూసుకుని మురిసిపోతూ భయంలేకుండా వీళ్లు మనమీదికి ఎలా వచ్చారో చూశావా, వీళ్ల సంగతి చూస్తా చూడు” అంటూ అర్జునుడు తననెదిరించిన వారి మీద అమ్ములు కురిశాడు. వాళ్ళూ ఒక్కుమ్మడిగా అతని మీద దూకితే కోపంతో అర్జునుడు ఇంద్రాస్త్రం ప్రయోగించాడు. అది వాళ్లు వేసిన బాణాల్ని నాశనం చేసి, వాళ్లకి గాయాలు చేసి, గజహయాల్ని కూల్చి భీభత్సం సృష్టిస్తే ఆ రాజులు పారిపోయి తమతమ సైన్యాల వెనక దాక్కున్నారు. అది చూసి దుర్యోధనుడు, “నా ఎదుటనే మీరిలా పారిపోయి దాక్కోవటం ధర్మం కాదు. ఒక్కడే భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు. అతనికి సాయం చెయ్యండి వెళ్లి” అని గద్దిస్తే అప్పుడు భీష్ముడి చుట్టుపక్కల చేరారు వాళ్లు.

ఒకవంక ద్రోణుడు విరాటుడితో తలపడి అతని రథాన్ని విరిస్తే అతని కొడుకు శంఖుడి రథం ఎక్కి తండ్రీ కొడుకులు ద్రోణుడి మీద బాణాలేశారు. ద్రోణుడు కోపించి వేసిన దొడ్డనారసం శంఖుడి వక్షాన దూరి వెనగ్గా బయటికొచ్చింది. వాడు పైలోకాలకి పోయాడు. అదిచూసి విరాటుడు, అతనితో పాటే అతని సైన్యమూ పారిపోయినయ్.

శిఖండి అశ్వత్థామతో పోరాడు. ఐతే అశ్వత్థామ అతని విల్లూ రథమూ విరిస్తే పలకా వాలూ తీసుకుని కిందికి దూకాడు. అశ్వత్థామ అవీ విరిస్తే శిఖండి సాత్యకి రథం ఎక్కాడు. ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి మీద బాణపరంపరలు వేశాడు. అతని విల్లుని తుంచాడు. నీ కొడుకు ఇంకో విల్లందుకునే లోగా అతని రథాన్ని విరిచాడు. కత్తితో అతను కిందికి దూకితే సౌబలుడు వేగంగా వచ్చి తన రథం మీద ఎక్కించుకుపోయాడు. సాత్యకి అలంబుసుడి మాయని ఇంద్రాస్త్రంతో మాయంచేసి వాణ్ణి గగ్గోలుపెడితే వాడు పారిపోయాడు. సాత్యకి సింహనాదం చేశాడు. కృతవర్మ భీముడితో తలపడితే అతను సారథిని రథాన్ని బాణాల్తో పడేసి కృతవర్మ ఒంటినిండా బాణాలు నాటాడు. ఏదుపందిలా నడుస్తూ అతను నీ బావమరది వృషకుడి రథం మీదికి ఎక్కాడు.

భగదత్తుడు తన ఏనుగుతో పాండవసేనని వేటాడుతుంటే ఘటోత్కచుడతన్ని ఎదుర్కున్నాడు. ఐతే అతను ఘటోత్కచుడి మాయల్ని పటాపంచలు చెయ్యటమే కాక వాడి మీద అనేక బాణాలు వేశాడు. ఆ ధాటికాగలేక వాడు పారిపోతే భగదత్తుడు వాడి బలాన్ని నాశనం చేశాడు.

శల్యుడి మీద అతని మేనల్లుళ్లు శరవృష్టి కురిశారు. అతనూ కోపంగా వాళ్లని నొప్పించాడు. సహదేవుడు వేగంగా వేసిన ఒక బాణం అతని వక్షం నుంచి దూసుకుపోయి రక్తస్పర్శ లేకుండానే వెనగ్గా బయటికొచ్చింది. అతను చచ్చినట్టు మూర్ఛపడటం, అతని సారథి వేగంగా అక్కణ్ణుంచి దూరంగా నడపటం జరిగిపోయినయ్.

చేకితానుడు కృపుడితో పోరాడు. ఇద్దరూ భీషణంగా యుద్ధం చేసి చివరికి కత్తుల్తో కిందికి దూకి పొడుచుకుని మూర్ఛపోయారు. వాళ్లని వాళ్ల పక్కల వాళ్లు పక్కకి తీసుకుపోయారు. దుశ్శాసన వికర్ణ చిత్రసేనుల్తో అభిమన్యుడికి పెద్దయుద్ధమయింది. ఐతే భీముడి ప్రతిజ్ఞల మూలాన అతను వాళ్లని చంపకుండా వదిలాడు. అప్పుడు భీష్ముడు అనేకమంది రాజుల్తో ఆ అభిమన్యుడి మీద తలపడ్డాడు. అదిచూసి అర్జునుడు అటు రథం తోలమన్నాడు. అలా వెళ్తుంటే త్రిగర్తుడు సుశర్మ అతన్ని అడ్డుకున్నాడు. అర్జునుడు అతన్నీ అతని సైన్యాన్నీ తిప్పలు పెట్టాడు. అతని రథరక్షకులు ముప్పైరెండు మంది కమ్ముకుంటే అర్జునుడు చిరునవ్వుతో వాళ్లందర్నీ కడతేర్చాడు.

ఒకపక్క భీష్ముడు ధర్మజుడి విల్లుని విరిచితే కోపంతో భీముడు గదతీసుకుని దుర్యోధనుడి మీదికి పరిగెత్తాడు. అతనికి సైంధవుడు అడ్డం పడ్డాడు. చిత్రసేనుడు భీముడి మీద బాణాలేస్తే అతను కోపంతో గద విసిరాడు. అది ఎవరి మీద పడుతుందోనని నీవైపు రాజులు భయపడి పరిగెత్తారు, రారాజుని తల్చుకున్నవాడే లేడు. చిత్రసేనుడు రథం మీంచి దూకుతుండగా ఆ గదపడి అతని రథం నుగ్గయ్యింది. వికర్ణుడతన్ని తన రథమ్మీద ఎక్కించుకున్నాడు. మరోచోట భీష్ముడు అన్నిదిక్కుల తానే ఐ వీరవిహారం చేశాడు. సూర్యాస్తమయం అయింది.

ఎనిమిదవ రోజు

కురుపితామహుడు కూర్మవ్యూహంతో సన్నద్ధమైతే ధర్మజుడు దానికి సరైన ప్రతివ్యూహం చెయ్యమని తన సేనాపతికి చెప్పాడు. అతను శృంగాటకవ్యూహం పన్నాడు. రెండు సైన్యాలు మోహరించి ఉత్సాహంగా తలపడినై.

నీ తండ్రి వీరరూపంతో పాండవబలం వైపుకి కదిల్తే భీముడు తప్ప మిగిలిన వాళ్లంతా పక్కకి తప్పుకున్నారు. భీముడు సారథిని చంపటంతో భీష్ముడి రథాశ్వాలు దాన్ని లాక్కుని పరిగెత్తినయ్. నీ కొడుకు సునాభుడు భీముణ్ణి ప్రతిఘటించాడు. భీముడు ప్రళయకాలాంతకుడిలా వాడి తల నరికేశాడు. దాంతో నీకొడుకులు ఆదిత్యకేతుడు, అపరాజితుడు, బహ్వాశి, పండితకుడు, కుండధారుడు, విశాలాక్షుడు, మహోదరుడు ఒక్కసారిగా భీముడి మీద దాడిచేశారు. భీముడు భీకరాకారంతో ఆ ఏడుగుర్నీ యమపురికి పంపాడు. అదిచూసి మిగిలిన నీకొడుకులు భయంతో దాక్కున్నారు.

దుర్యోధనుడు తన చుట్టూ వున్న వీరుల్ని భీముడి మీద కలబడమని పంపి శోకగద్గద కంఠంతో భీష్ముడితో “ఇలా భీముడు నా తమ్ముల్ని చంపుతుంటే ఏమీ పట్టనట్టు చూస్తున్నావ్, అందరూ ఒకేసారి చావాలని ఎదురుచూస్తున్నావా ఏమిటి?” అని నిష్టూరాలాడాడు. అతను బాధపడి, “నేనూ, ద్రోణుడు, విదురుడు నీకు ముందే చెప్పాం ఇలా జరగబోతుందని. విన్నావా? నీ తమ్ముళ్లలో ఒకసారి భీముడి చేతికి చిక్కిన వాళ్లని కాపాట్టం ఎవరివల్లౌతుంది? వీరస్వర్గం కోసం పోరాడుతున్నాం అందరం. గెలుపోటములు దైవాధీనాలు. మన ప్రయత్నలోపం లేకుండా మన ధర్మం నిర్వర్తిస్తున్నాం. గెలుపొస్తే వద్దంటామా?” అని రౌద్రాకారంతో భీముడితో తలపడ్డాడు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి వచ్చి అతనితో పోరాడారు. దుర్యోధనుడు పంపగా వచ్చిన రథికుల్ని చేకితానుడు, ద్రౌపదేయుల్తో కలిసి అర్జునుడు ఎదుర్కున్నారు. అభిమన్యుడు, ఘటోత్కచుడు కౌరవసేన మీదికి లంఘించారు. ఇలా మూడు యుద్ధరంగాల్లో పోరు సాగింది.

ద్రోణుడు ద్రుపదుడి సైన్యం మీద కాలుదువ్వాడు. అంతలో ఉలూచీ అర్జునుల కొడుకు ఇరావంతుడు గుర్రపుసేనతో కౌరవసైన్యంలోకి చొచ్చుకుపోయాడు. శకుని ఆరుగురు తమ్ములు అతన్ని పొదివి బాణవర్షం కురిపించారు. గాయాలైన అతని గుర్రం పడిపోతే ఏమాత్రం తొణక్కుండా కత్తితో కిందికి దూకి ఘోరయుద్ధం చేశాడు. శకుని తమ్ములూ కిందికి దిగి అతనితో తలపడ్డారు. అతనా ఆరుగుర్నీ పన్నెండు ముక్కలుగా నరికాడు. అదిచూసి దుర్యోధనుడు అలంబుసుణ్ణి అతని మీదికి పంపాడు. వాడి మాయాజాలంతో ఇరావంతుడి గుర్రపుసైన్యం మాయమైంది. అలంబుసుడు ఆకాశానికెగిరితే ఇరావంతుడూ ఎగిరి వాణ్ణి తన కత్తితో ఖండించాడు. ఐతే ఆ రాక్షసుడు సరికొత్త రూపంతో మళ్లీ యుద్ధం సాగించాడు. ఇరావంతుడు శేషుడి ఆకారంలో నాగబాణాలు వేస్తే వాడు గరుత్మంతుడి రూపంలో వచ్చి నాగబాణాల్ని మింగి కత్తితో అతని తల నరికాడు.

సోదరుడు ఇరావంతుడి తల అలా ఇల పడటం చూసి ఘటోత్కచుడు అపరకాలుడిగా కౌరవసేన మీద విరుచుకుపడ్డాడు. గజాల్ని, అశ్వాల్ని, రథాల్ని, రథికుల్ని అదీ ఇదీ అని చూడకుండా నాశనం చేశాడు. దుర్యోధనుడి మీదికి దూకి అతన్ని చంపటానికి శక్తి ఎత్తితే వంగరాజు అతనికి అడ్డుపడ్డాడు. ఆ శక్తితో వాడి ఏనుగు చచ్చింది. వాడు నేల మీద పడ్డాడు. ఐతే దుర్యోధనుడు ఒక్కడే ఘటోత్కచుడికి ఎదురు నిలిచి వాడి మీద ఒక మహాస్త్రం వేశాడు. దాన్ని దార్లోనే నరికి వాడు సింహనాదం చేస్తే అది విని భీష్ముడు రారాజుకి రక్షణగా వెళ్లమని కేక వేస్తే ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, చిత్రసేనుడు – ఇలా ఎంతోమంది దొరలు అటువైపుకు పరిగెత్తి ఘటోత్కచుడితో తలపడ్డారు. అలా అంతమంది రథికులు ఒక్కసారి కమ్ముకునే సరికి ఆగలేక ఆ రాక్షసుడు ఆకాశాని కెగిరాడు.

అదిచూసిన ధర్మరాజు భీముడితో, “ఇక్కడ భీష్ముడిని ఆపటానికి అర్జునుడున్నాడు. అక్కడ ఘటోత్కచుడికి సాయంగా నువ్వు త్వరగా వెళ్లు” అనటంతో వేగంగా భీముడక్కడికి తరలాడు. ఒక అర్థచంద్రాకార బాణంతో దుర్యోధనుడు భీముడి వింటిని విరిచి మరో పదునైన బాణం అతని వక్షాన నాటాడు. ఆ దెబ్బకి భీముడు తూలాడు. అది చూసి పాండవకుమారగణం నీ కొడుకు మీద కోపంతో దూకారు. కృప బాహ్లికాదులు వాళ్లనెదుర్కున్నారు. ద్రోణుడొక బాణంతో భీముణ్ణి రక్తపరిషిక్తుణ్ణి చేస్తే భీముడు రౌద్రంగా వేసిన బాణంతో ద్రోణుడు మూర్ఛపోయాడు. దుర్యోధన, అశ్వత్థామలు భీముడి మీదికి దూకారు. ఇంతలో ద్రోణుడు తెలివికి వచ్చాడు. అతనూ కృపుడూ భీముణ్ణి చుట్టుముడితే అభిమన్యుడు, ద్రౌపదేయులు వాళ్లని అడ్డగించారు.

ఇంతలో అనూప రాజు, భీముడి మిత్రుడు నీలుడు అశ్వత్థామతో యుద్ధంలో గాయపడితే ఘటోత్కచుడు అశ్వత్థామతో తలపడితే కొడుక్కి సాయంగా ద్రోణుడూ అతని మీద బాణాలేశాడు. కోపంతో ఘటోత్కచుడు మాయ పన్నాడు. దానివల్ల దుర్యోధనుడు, ద్రోణుడు, అక్కడున్న ఇతర కౌరవరథికులు నెత్తుటిమడుగుల్లో పడివున్నట్టు కౌరవసేనకి తోచి అందరూ హాహాకారాలు చేస్తుంటే భీష్ముడు వచ్చి అది మాయే కాని నిజం కాదని ఎంతచెప్పినా వినక సైన్యం కకావికలైంది. దుర్యోధనుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్లి నిష్టూరాలాడాడు. అతను భగదత్తుణ్ణి పిలిచి, “నీకు రాక్షసుల మాయలు అంటవు కనక వెళ్లి ఈ ఘటోత్కచుడితో పోరాడు” అని చెప్పాడు. ఆ భగదత్తుడు సుప్రతీకమనే తన ఏనుగుతో పాండవసేనని నుగ్గుచేశాడు. అభిమన్యుడు, ద్రౌపదేయులు అనేక బాణాల్తో దాన్ని నొప్పిస్తే అది పాండవబలమ్మీదికే పరిగెత్తి అనేక గుర్రాల్ని సైన్యాల్ని చంపింది.

భీముడు అర్జునుడికి ఇరావంతుడి మరణం గురించి చెప్పాడు. అది విని దుఃఖించాడర్జునుడు. అతని శవం ఎక్కడో చూపించు అని అర్జునుడక్కడికి వెళ్లి కొడుకుని తలుచుకుని రోదించాడు. అది చూసి కృష్ణుడు “ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ ఇంతలోనే మర్చిపోయావా?”అన్నట్టు చిరునవ్వు నవ్వాడతన్ని చూసి. “నువ్వు చెప్పిన మాటలు మర్చిపోలేదు, పద యుద్ధం చేద్దాం” అని అర్జునుడక్కణ్ణుంచి బయల్దేరాడు. మళ్ళీ పోరు ఘోరమైంది. ద్రోణుడు భీముడితో యుద్ధంచేస్తుంటే అతని రక్షణలో వుండి భీముణ్ణి మర్దించొచ్చని నీకుమారులు కొందరు భీముడితో యుద్ధానికి తగులుకున్నారు, ఐతే అతను ఎన్నో బాణాలు తగిలినా లెక్కచెయ్యక నీకొడుకులు గుండభేది, అనాధృష్యుడు, కనకధ్వజుడు, విరావి, సుబాహుడు, దీర్ఘబాహుడు, దీర్ఘలోచనులని దీర్ఘనిద్రకి పంపాడు.

చీకటి పడటంతో సేనలు వెనక్కి మళ్లినయ్.

శిబిరానికి వెళ్తూ దుర్యోధనుడు వెంటనే కర్ణ శకునుల్ని రప్పించమని దుశ్శాసనుడికి చెప్పాడు. ఆ ముగ్గురితో దుర్యోధనుడు “భీష్మ ద్రోణ అశ్వత్థామలు మధ్యస్తులై వుండి పాండవబలమ్మీద గట్టిగా పోరాడటం లేదు. మన బలాలు రోజురోజుకీ చచ్చి సన్నగిల్లుతున్నయ్. ఇప్పుడు ఏమిటి మన కర్తవ్యం?” అనడిగాడు. రణోత్సాహంతో కర్ణుడు “భీష్ముణ్ణి తప్పించు. నేను యుద్ధంలో దూకి పాండవబలం అంతం చూస్తా” అన్నాడు. “ఐతే నేను తాతతో మాట్లాడతా” అని చెప్పి స్నానం చేసి చక్కగా అలంకరించుకుని మణిఖచిత రథమ్మీద భీష్ముడి శిబిరానికి చేరాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడితో. తాత అనుమతితో లోపలికి వెళ్ళి చేతులు మోడ్చి “నువ్వు మనసు పెట్టి యుద్ధం చెయ్యనందువల్ల ఎనిమిది రోజులైనా పాండవసైన్యానికి పెద్ద నష్టమేమీ జరగలేదు. ఇదంతా ఎందుకు, నువ్వు యుద్ధం నుంచి తప్పుకుని కర్ణుణ్ణి రప్పించు” అన్నాడు. ఆ మాటలు శూలాల్లా గుచ్చుకుంటే భీష్ముడు అత్యంత విషాదంతో కొంచెం సేపు మౌనంగా వుండిపోయాడు. “నీకోసం ఓపిక కొద్దీ ప్రాణాల మీద ఏమాత్రం తీపి లేకుండా యుద్ధం చేస్తుంటే నువ్విలా అనటం భావ్యమా? ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోసినట్టేనా? అర్జునుడు ఎంత వీరుడో నీకు తెలియంది కాదు. ఐనా ఈ యుద్ధం తెచ్చిపెట్టుకున్నావ్. ఒకటి చెప్తా విను. అర్జునుడిని, శిఖండిని నేను గెలవలేను. ద్రుపద, విరాట, యాదవ సైన్యాల్ని మట్టిగరిపిస్తా. పాండవుల సంగతి మీరు చూసుకోండి. అర్థరాత్రి వచ్చి కష్టం కలిగించే మాటలంటే గెలుపు వస్తుందా? వెళ్లు. రేపు నా పరాక్రమాన్ని చూద్దువు గాని” అని పంపాడు.

తొమ్మిదవ రోజు

సముచిత సమయానికి లేచి యుద్ధానికి బయల్దేరాడు నీ పెద్దకొడుకు. భీష్ముణ్ణి చూపిస్తూ మిగతా రాజులతో అన్నాడూ, “ఇతనివాళ పాంచాలాది బలగాల్ని చంపి పాండవుల్ని ఓడిస్తానని నాతో రాత్రి చెప్పాడు. కాబట్టి మనందరం మన బలం, శౌర్యం చూపించాలి” అని. దాంతో భీష్ముడికి చీదర కలిగిందతని మీద. ఐనా తమాయించుకున్నాడు. అది గమనించి దుర్యోధనుడు దుశ్శాసనుడితో “మనం అంతా తాతతోనే వుందాం, ఇరవై రెండు వేల రథాల వాళ్లని అతని ముందు పెట్టించు” అని చెప్పాడు. అతనలాగే చేశాడు. అలాగే ద్రోణ, కృప, అశ్వత్థామల్తో “ఆ నీచుడు శిఖండికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన దొరక్కుండా మీరంతా కాపాడాలి” అని చెప్తే వాళ్లు అందుకు సిద్ధమయారు. భీష్ముడు సర్వతోభద్ర వ్యూహం పన్నాడు. అదిచూసి అర్జునుడు ధృష్టద్యుమ్నుడితో, “భీష్ముడికి ఎదురుగా శిఖండిని నిలబెట్టు. మనం అందరం కలిసి భీష్ముణ్ణి చుట్టుముట్టేట్టు వ్యూహం తయారుచెయ్యి” అంటే అతను అలాగే చేశాడు. ఇలా సన్నద్ధమై రెండూ సైన్యాలూ పోరుకు తలపడినయ్.

ముందుగా అభిమన్యుడు దూదిమీదికి దూకే అగ్నిలాగా మన బలగాల మీదికి దూకాడు. మన వ్యూహం చెల్లాచెదురయింది. దుర్యోధనుడు అలంబుసుణ్ణి పిలిచి “నువ్వు తప్ప ఇప్పుడు వీణ్ణి ఆపగలిగే వాడు మన సేనలో లేడు. నువ్వు వాడి సంగతి చూడు, మేం పాండవులకి అడ్డుపడతాం” అని అభిమన్యుడి మీదికి పంపాడు. ఐతే వాడికి అడ్డంగా ద్రౌపదేయులు వచ్చి వాణ్ణి ఎదుర్కున్నారు. ఇరువైపులకీ ఘోర యుద్ధం జరిగింది. అలంబుసుడు ఆ ఐదుగురి ధాటికి సొమ్మసిల్లి తూలి జెండాకొయ్య పట్టుకు నిలబడ్డాడు. అంతలోనే తేరుకుని వాళ్ల విల్లులని విరిచి, ఒక్కొకర్ని ఐదైదు బాణాల్తో నొప్పించాడు. సోదరుల్ని అలా గాయపరుస్తున్న అలంబుసుడితో అభిమన్యుడు తలపడ్డాడు. మిగిలిన వాళ్లంతా యుద్ధం మాని వాళ్లిద్దరి పోరు చూస్తున్నారు. అలంబుసుడు మాయల్లో అసాధ్యుడు, అభిమన్యుడా అస్త్రవిద్యలో అఖండుడు, వీళ్లిద్దరి యుద్ధం ఏమౌతుందో అని అంతటా కుతూహలం. అలంబుసుడి మాయల్ని అవలీలగా పటాపంచలు చేస్తూ అభిమన్యుడు వాడి ఒళ్లంతా తూట్లు కొడితే వాడు రథాన్నొదిలి కాలికొద్దీ పరిగెత్తాడు.

అది చూసి అనేకమంది రథికుల్తో వచ్చి భీష్ముడు అభిమన్యుడితో తలపడ్డాడు. ఐతే అతను ఏమాత్రం తొణక్కుండా అందరికీ అన్ని రూపులై యుద్ధం సాగిస్తుంటే అర్జునుడు వచ్చి భీష్ముడి మీదికి దూకాడు. అభిమన్యుడి మీదికి పోబోతున్న కృపుడి మీద సాత్యకి బాణాలు కురిపిస్తే వాటిని అశ్వత్థామ మద్యలోనే తుంచి, అలాగే సాత్యకి విల్లుని కూడ విరిచాడు. అతను కోపించి ఇంకో వింటిని తీసుకుని ఒక నిశితబాణంతో కొడితే అశ్వత్థామకి మూర్ఛ వచ్చి సిడం పట్టుకుని ఒరిగాడు. కాని అంతలోనే తెలివి తెచ్చుకుని తనూ ఒక పదునైన బాణంతో సాత్యకి వక్షాన్ని మోదాడు. దాంతో వీరోద్రేకంతో సాత్యకి అతన్ని అనేక బాణాల్తో కప్పేశాడు. అదిచూసి పరుగున వచ్చి ద్రోణుడు సాత్యకి మీదికి వెళ్తుంటే అర్జునుడు ద్రోణుడితో తలపడ్డాడు.

అది విని, “సంజయా, ఇది చాలా ఆసక్తికరమైన సన్నివేశం. ద్రోణుడికి అర్జునుడంటే బహుప్రీతి. అర్జునుడికీ ద్రోణుడి మీద గొప్ప గౌరవం, భక్తి. మరలాటి వాళ్లు ఒకరితో ఒకరు యుద్ధం ఎలా చేశారో!” అన్నాడు ధృతరాష్ట్రుడు. “క్షాత్రానికి పూనుకుని యుద్ధానికి వచ్చాక గురువులు, చుట్టాలు అని చూస్తారా? యుద్ధం చెయ్యటం తప్ప మార్గం లేదు” అని కథ చెప్పటం సాగించాడు సంజయుడు.

అర్జునుడు ద్రోణుడి మీద అనేకబాణాలు ప్రయోగించాడు. దానికి ఏమాత్రం చెదరకుండా ద్రోణుడు తనూ అన్ని బాణాలతో అర్జునుణ్ణి ముంచెత్తాడు. ఐతే ఇంతలో దుర్యోధనుడు పంపితే వచ్చిన త్రిగర్తులు ద్రోణుణ్ణి దాటి అర్జునుడితో తలపడ్డారు. వాయుబాణంతో అర్జునుడు వాళ్లని ఆపాడు. ద్రోణుడు దాన్ని ఉపసంహరింపజేస్తే అర్జునుడు సుశర్మ కొడుకుల్ని కూల్చాడు. దాంతో దుర్యోధనుడు, కృపుడు, శల్యుడు, బాహ్లికుడు అర్జునుణ్ణి తాకారు. అర్జునుడితో యుద్ధం వాళ్లందరికీ తలమునకలైంది.

మరోవంక భీష్ముడు ధర్మరాజు మీదికి ఉరికాడు. శకుని, భూరిశ్రవుడూ నకుల సహదేవుల్తో తలపడ్డారు. కాళింగుడు, భగదత్తుడు భీముడితో కలబడ్డారు. ఐతే భీష్ముడి దెబ్బకు ధర్మరాజు చాలక అందర్నీ కేకలేసి పిలిస్తే భీముడక్కడికి ఉరుకులు పరుగుల్తో వచ్చాడు. ఈలోపు గానే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాటుడు, ద్రుపదుడు భీష్ముడికి అడ్డుపడి పోరుతున్నారు. శిఖండి తప్ప మిగిలిన వాళ్లందరితో భీష్ముడు అపరరుద్రుడై పోరు సాగించాడు. భీముడటు వెళ్లటం చూసి యాదవ వీరులు, ద్రౌపదేయులు కూడ అక్కడికే చేరితే అదిచూసి మన సైన్యం లోని ముఖ్యమైన వాళ్లందరూ అక్కడికే పరిగెత్తారు. రెండుమూకలకూ రణం దారుణమైంది. దుర్యోధనుడు శకుని దుశ్శాసనుల్ని భీష్ముడికి తోడుగా వెళ్లమని పంపి పదివేల ఆశ్వికబలంతో ధర్మరాజుని ఎదుర్కున్నాడు. ధర్మరాజు, కవలలు ఆ గుర్రపుసేనని చీల్చి చెండాడారు. దాంతో దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్లి దీనంగా ఇప్పుడు నువ్వు తప్ప ఆ ధర్మజుణ్ణి, కవల్ని ఆపేవాళ్లు లేరు అనటంతో అతను వాళ్లమీద విరుచుకుపడ్డాడు. అది గమనించి భీమార్జునులు శల్యుడి మీదికి వస్తే ఇటునుంచి భీష్మద్రోణులు అతనికి తోడుగా వచ్చి చేరారు.

అప్పుడిక భీష్ముడు మధ్యాహ్న సూర్యుడిలా విజృంభించి పాండవులందర్నీ నానా విధాలుగా హింసించాడు. అతన్ని అరికట్టటానికి ఎవరూ సాహసించ లేకపోయారు. కృష్ణుడు ఎంతగా ప్రోత్సహించినా అర్జునుడు కూడ నిరుత్సాహంతో నిలబడ్డాడే కాని దుర్నిరీక్ష్యుడైన తాత వంక చూడలేకపోయాడు. “ఇదివరకు అన్ని బీరాలు పలికి ఇప్పుడిలా నీరసంగా వుంటే ఎలా?” అని కృష్ణుడంటే, “అందర్నీ చంపి రాజ్యం సంపాయించటం అంత ఘనకార్యమా? నా మనసొప్పటం లేదు. సరే, ఐనా రథాన్నటు నడుపు, ఆ భీష్ముడి సంగతి చూస్తా” అన్నాడు అర్జునుడు. భీష్ముడితో తలపడ్డాడు. కాని భీష్ముడు వీరాకారంతో అర్జునుడి అంగాంగాలా అస్త్రాలు గుచ్చి కృష్ణుణ్ణీ, గుర్రాల్నీ కూడ నొప్పించాడు. అర్జునుడు కోపంతో భీష్ముడి విల్లు విరిచాడు. అతను మరో విల్లు తీసుకుంటే దాన్ని విరిస్తే, ఔరా అర్జునా అంటూ భీష్ముడు ఇంకో విల్లు పుచ్చుకుని వందబాణాలు ఒక్కసారిగా అర్జునుడి మీద ప్రయోగించాడు. ఆ ధాటికి అర్జునుడు తూలుతూ శక్తికొద్దీ యుద్ధం చేస్తుంటే చూసి దారుణరోషంతో కృష్ణుడు పగ్గాల్ని రథమ్మీద పారేసి ములుకోల చేతబట్టి రథం మీంచి కిందికురికాడు.

ధరణీచక్రం తొట్రుపడేట్టు కృష్ణుడలా ఉరికి భీష్ముడి మీదికి వెళ్తుంటే అందరూ గగ్గోలు పడిపోయారు. నీ సేన చెల్లాచెదురయింది. భీష్ముడొక్కడే మనసు చల్లబడగా హాయిగా నవ్వుతూ, “మహాత్మా, త్వరగా రా. ఇంతకన్నా నాకు కావలసిందేముంది? నీ దయవల్ల ఈ లోకంలో కీర్తి, పైలోకంలో సద్గతీ కలగబోతున్నాయి” అంటూంటే అర్జునుడు హడావుడిగా రథం దూకి పరిగెత్తి వెనక నుంచి కృష్ణుడి చేతులు పట్టుకుని వేలాడితే, ఆగకుండా విడిపించుకుని అతను ముందుకు సాగుతుంటే, అర్జునుడు వదలక అతన్ని పట్టుకుని లాగి వేలాడి ఆపి “యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసి ఇలా ఉరకటం నీకు ధర్మమేనా? ఏదో అలిసిపోయి కొంచెంసేపు సరిగా పోరాడలేదు గాని ఇక నా ప్రతాపం చూద్దువు గాని, తిరిగి రా” అని ప్రార్థిస్తే చివరకు వెనక్కు మళ్లాడు కృష్ణుడు. ఐనా భీష్ముడి ఘోరనారాచాల ధాటికి ఎవ్వరూ ఆగలేక బిక్కమొగాల్తో చూస్తుంటే వాళ్ల దైన్యం చూడలేకా అన్నట్టు సూర్యుడు అస్తాద్రికి చేరాడు.

భీష్ముడి చేతిలో దెబ్బలు తిన్న పాండవసేనని చూసి ధర్మరాజుకి గుండె నీరయింది. ఆ రాత్రి తమ్ముల్ని వెంటబెట్టుకుని కృష్ణుడి శిబిరానికి వెళ్లాడు. “ఇవాళ భీష్ముడి యుద్ధం చూస్తే అతన్ని అరికట్టటం మాకు సాధ్యం కాదని తేలిపోయింది. నేను అడవులకి వెళ్లి తపోవృత్తిలో గడుపుతా. అలా చెయ్యటానికి ధర్మవిరోధం కాని మార్గం ఏమిటో బోధించు” అనడిగాడు. “ఇంత దీనత నీకు పనికిరాదు. అవసరమైతే నేను నీకు రాజ్యం సంపాయించి ఇస్తా” అని ధైర్యం చెప్పాడు కృష్ణుడు. “యుద్ధం చెయ్యనని నువ్వన్నమాట నీచేత తప్పిస్తానా? ఐనా భీష్ముడు నాకు మేలు చేస్తాడు, రాజ్యం ఇప్పిస్తాడు” అని అంతలోనే, “చూశావా, తండ్రి చనిపోయిన దగ్గర్నుంచి తనే తండ్రిగా మమ్మల్ని పెంచిన తాతనే చంపాలని ఆలోచిస్తున్నా, ఈ రాజధర్మం ఎంత క్రూరమైంది!” అని నిట్టూర్చాడు. “ఇతనిప్పుడు భీష్ముడి దగ్గరికి వెళ్లాలని ఆలోచిస్తున్నాడు” అని గ్రహించాడు కృష్ణుడు. “ఇదివరకు మళ్ళీ వద్దువులే అని నీతో అన్నాడు కదా భీష్ముడు? కనక అదే కర్తవ్యం. మనందరం అతని దగ్గరికి వెళ్లి అతన్ని చంపే మార్గం అడుగుదాం. ఇప్పుడు తప్పక చెప్తాడు” అని కర్తవ్యం బోధించాడు. సౌమ్య వేషాలు ధరించి అందరూ అతి రహస్యంగా భీష్ముడి మందిరానికి వెళ్లి అమితభక్తితో అతని పాదాలకి నమస్కరించారు.

భీష్ముడు ఆదరంగా పేరుపేరునా అందరి క్షేమాలు అడిగి కనుక్కున్నాడు. “ఇక్కడికి మీరు వచ్చిన పనేమిటి? ఏం కావాల్సినా అడగండి, తప్పక చేస్తా” అన్నాడు. ధర్మరాజు దీనంగా ఇలా అన్నాడు – “ఇంకా సైన్యం ఎక్కువగా చావకుండా మాకు రాజ్యం దక్కే మార్గం ఉపదేశించు”. “నేను యుద్ధం చేస్తుంటే నీకు సైన్యక్షయమూ తప్పదూ, రాజ్యమూ రాదు. కాబట్టి నన్ను ఓడించటమే మార్గం” అన్నాడు భీష్ముడు. “మూడో కన్ను మూసి, చేతి త్రిశూలం దాచి, వచ్చిన రుద్రుడిలా నువ్వు యుద్ధం చేస్తుంటే నిన్ను ఓడించటం ఏ మగవాడి వల్ల ఔతుంది? నీ దయ ఉంటే తప్ప నిన్ను గెలవలేం” అన్నాడు ధర్మరాజు. “నువ్వన్నది నిజం. నేను, పుట్టినప్పుడు కాకుండా మధ్యలో మగవాడైన వాడితో యుద్ధం చెయ్యను. శిఖండి అలాటి వాడు. కాబట్టి వాణ్ణి ముందుంచుకుని అర్జునుడు నన్ను నొప్పించి పడెయ్యాలి. అలా చెయ్యండి. మీకు నా ఆశీస్సులు” అని వాళ్లని దీవించి పంపాడు భీష్ముడు.

దారిలో అర్జునుడు భీష్ముడలా చావుకి సిద్ధం కావటమూ ఆ నీచపు పని తన చేతి మీదగా చెయ్యాల్సి రావటమూ తల్చుకుని బాధపడుతూ కృష్ణుడితో అన్నాడు – “గురువు, మహాజ్ఞాని, ధర్మపరుడు, వయోవృద్ధుడు, దయావంతుడైన తాతని ఇలా వంచనతో చంపటం నా వల్ల కాదు. చిన్నప్పుడు మట్టికొట్టుకుని వున్న నన్ను ఎత్తుకుని ఆ మట్టంతా తన బట్టలకు అంటుకుంటున్నా పట్టించుకోకుండా కౌగిలించుకుని మా తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకునేవాడు. తండ్రి చనిపోయినప్పటినుంచి పెంచిన మహాభుజశాలిని అధర్మంగా చంపేంత క్రూరులా పాండవులు?” దానికి కృష్ణుడు, “నువ్వు రాజధర్మం మరిచిపోతున్నావు. అదిగాక భీష్ముణ్ణి చంపుతానని ఇదివరకు అన్నావు గుర్తులేదా? ఆ మాట నిలబెట్టుకోవటం నీ ధర్మం కాదా?” అన్నాడు. “ధృష్టద్యుమ్నుడు పుట్టింది ద్రోణ సంహారానికని అంటారు. అతను భీష్ముణ్ణి కూడ చంపగలడు. ఈ పనీ అతనికే అప్పగిద్దాం. అతనికి అడ్డం వచ్చిన వాళ్ల సంగతి నేను చూస్తా” అని తప్పించుకో చూస్తే నవ్వి కృష్ణుడు “నువ్వు తప్ప అంతటి పరాక్రమశాలిని చంపగలిగే వాడు ఇంకెవడూ లేడు. నీకు వేరే దారి లేదు” అని నచ్చ చెప్పాడు. చివరికి “అప్పటికి ఎలా కావాల్సుంటే అలా ఔతుందిలే” అని మెత్తబడ్డాడు అర్జునుడు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

పదవ రోజు

సూర్యోదయ సమయం. పాండవులు అమితోత్సాహంతో యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ముందుగా శిఖండి. అతనికి రెండుపక్కల భీమార్జునులు. వెనక అభిమన్యుడు, ద్రౌపదేయులు. వాళ్లకి రెండు వైపుల చేకితానుడు, సాత్యకి. వాళ్ల దగ్గర్లో ధృష్టద్యుమ్నుడు, ఇతర పాంచాల రాకుమారులు. వాళ్ల వెనక ధర్మరాజు. అతనికి పక్కల కవలు. వీళ్ల సైన్యాల్ని పొదువుకుని విరాటుడు, ద్రుపదుడు, కేకయపంచకం, ధృష్టకేతుడు.

మనవైపు ముందుగా భీష్ముడు. అతని చుట్టూ నీ కొడుకులు. ద్రోణుడు, అశ్వత్థామ వాళ్లకి ఇరుపక్కల. కృపుడు, కృతవర్మ, భగదత్తుల్తో మధ్యలో నీ పెద్దకొడుకు. అతని చుట్టూ బృహద్బలుడు, కాంభోజుడు. ఆ వెనక త్రిగర్తులు.

ఇలా దిట్టమైన వ్యూహాల్తో రెండు సైన్యాలు కదిలినయ్. దేవాసుర సమరంలా భీకరరణం మొదలైంది. కవలు కౌరవసైన్యం మీదికి దూకి చెల్లాచెదురు చేస్తుంటే భీమార్జునులు పదండి పదండని ప్రోత్సహిస్తుంటే పాండవసేన పరమోత్సాహంతో కదలటంతో కల్పాంతభైరవుడిలా భీష్ముడు బాణవర్షం కురిపించసాగాడు. శిఖండి భీష్ముడి మీద మూడస్త్రాలు వేస్తే అతను శిఖండి వంక చూడకుండానే “శిఖండినీ! బ్రహ్మ నిన్ను ఆడదానిగా పుట్టించాడు. ఇప్పుడు మగవేషం వేసుకొచ్చినంత మాత్రాన నేను నీతో పోరతానా? నువ్వు వెయ్యి బాణాలెయ్యి, నవ్వేస్తానే తప్ప నీ మీద విల్లెక్కుపెట్టను” అన్నాడు. దానికి రోషం వచ్చి శిఖండి “రాజులందర్నీ గెలిచావంట, పరశురాముడితోనే యుద్ధం చేసి మెప్పించావంట, నాతో మాత్రం చెయ్యలేవా? ఇవాళ నీ వీరత్వం ఏమిటో బయటపెడతా” అని అతని మీద బాణాలేశాడు. అది చూస్తున్న అర్జునుడు, “ఇదేదో దైవప్రేరణలా వుంది. శిఖండి ఇలా మాట్టాట్టం ఇదివరకెప్పుడూ వినలేదు” అనుకుంటూ శిఖండిని ఇంకా పుర్రెక్కించాడు, ఇన్ని మాటలని ఏమీ చెయ్యకుండా ఊరుకుంటే జనం నవ్వరా? నేనుండగా నీకు భయం వద్దు. భీష్ముడి మీద బాణాలెయ్ అంటూ. ఐతే భీష్ముడు పక్కకి తొలిగి పాంచాలబలాల మీదికి దూకాడు. అర్జునుడు కౌరవసేనని కార్చిచ్చులాగా కాల్చటం మొదలుపెట్టాడు. నీ కొడుకు దైన్యంగా భీష్ముడికి మొరపెట్టుకున్నాడు మన సేన ఎన్ని తిప్పలు పడుతుందో చూస్తున్నావా అని. దానికి భీష్ముడు, “పదివేలమంది దొరల్ని చంపుతానని నీకు మాట ఇచ్చా, అది నిలబెట్టుకున్నా. ఈరోజు యుద్ధం చూస్తుంటే నేనో పాండవులో ఇవాల్టితో తేలిపోయేట్టు కనిపిస్తుంది. ఐతే వాళ్లా దైవబలం వున్నవాళ్లు, నాలాటి ఒక మనిషి చేతిలో చస్తారా? ఏదేమైనా కానీ నా చేతుల బలం చూపిస్తా, చూడు” అంటూ పాండవసేనావనాన్ని ఈ వైపు నుంచి తనూ కాల్చటం మొదలుపెట్టాడు.

అర్జునుడు శిఖండితో, “నువ్వు భీష్ముణ్ణి వదలొద్దు. నీ వెనక నేనున్నా. ధైర్యంగా పద” అంటూంటే ధృష్టద్యుమ్నుడు విని అందర్నీ భీష్ముణ్ణి చుట్టుముట్టమని పిలిచి చెప్పాడు. అప్పుడు పాండవపక్షంలో పెద్దవీరులంతా భీష్ముడి మీదికి వెళ్లబోతుంటే నీ సేనలోని యోధవరులు వెళ్లి వాళ్లతో తలపడ్డారు. ఇరువర్గాల యుద్ధం చూస్తున్న దేవతల అనిమేషత్వం సార్థకమయ్యింది. శిఖండిని ముందుంచుకుని భీష్ముణ్ణి తరుముతున్న అర్జునుడికి దుశ్శాసనుడు అడ్డుపడి భీకరంగా పోరాడు. అర్జునుడి దెబ్బకి అతను మూర్ఛపడితే సారథి రథాన్ని భీష్ముడి వెనక్కి తోలుకుపోయాడు. ఐతే అంతలోనే తెలివి తెచ్చుకుని తిరిగొచ్చి అర్జునుడితో తలపడ్డాడతను. అర్జునుడు అతిరౌద్రంగా అతని విల్లు తుంచి, ఒళ్లంతా గాయాలు చేసి, గుర్రాల్ని నొప్పిస్తే అతనక్కణ్ణుంచి పారిపోయాడు. ఇక అర్జునుడు భీష్ముడికి అడ్డంగా వున్న వాళ్లందర్నీ చంపసాగాడు. అదిచూసి ద్రోణుడతనికి అడ్డుపడటానికి వేగంగా వస్తుంటే ధర్మరాజు అతన్ని ఎదుర్కున్నాడు. ద్రోణుణ్ణి అక్కణ్ణుంచి కదలనివ్వకుండా పోరాడుతుంటే ద్రోణుడు దగ్గర్లో వున్న కొడుకుని పిలిచాడు “దివ్యబాణాల తంత్రం తడబడుతున్నది, మంత్రాలు తప్పుతున్నయ్, వింటిచెయ్యి ఒణుకుతుంది, మనసు వశం తప్పుతున్నది, శకునాలు బాగాలేవు, అర్జునుడి పంతం ఈరోజుతో నెరవేరేట్టుంది. నన్నా వీళ్లిక్కడి నుంచి కదలనిచ్చేట్టు లేరు. ఇది ఎవరమూ ప్రాణాలు దాచుకునే సమయం కాదు, వెళ్లి భీష్ముణ్ణి రక్షించు” అని పంపాడతన్ని.

అక్కడ శిఖండిని ముందుంచుకుని అర్జునుడు భీష్ముణ్ణి చంపటానికి అనువుగా వుండేట్టు భీముడు కౌరవసేనని చెల్లాచెదురు చేస్తున్నాడు. అదిచూసి భగదత్తుడు, కృపవర్మ, ఇలా మొత్తం పదిమంది మహారథులు అతన్ని ఎదుర్కున్నారు. వాళ్లందరితో అతనొక్కడే పోరటం చూసి అర్జునుడు సాయంగా వచ్చి వాళ్లని తిప్పలు పెడుతుంటే సుశర్మ, ఇంకా ఆ చుట్టుపట్ల వున్న రాజుల్ని భీమార్జునుల మీదికి పంపాడు దుర్యోధనుడు. ఇలా అంతమందీ భీమార్జునుల మీద తలపడితే అభిమన్యుడు, సాత్యకి సైన్యాల్తో అక్కడికి వచ్చి వాళ్లనెదుర్కున్నారు. ఈలోగా భీష్ముడొకపక్క పాండవసేనని నుగ్గుచేస్తూ వీరవిక్రమం చూపుతూ విహరిస్తున్నాడు.

మధ్యాన్నమయింది.

“పదిరోజుల నుంచి ఉగ్రంగా ఉత్తమక్షత్రియుల్ని ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నా, అలిసినట్టనిపిస్తుంది, ఈ శరీరం ఇంక వదలటం మంచిది” అని ఆలోచిస్తున్నాడు భీష్ముడు. యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూ ధర్మరాజు పక్కకి చేరి “నువ్వు నా మేలు కోరేవాడివైతే ఇప్పుడే మీరంతా కలిసి నామీద పడి శిఖండిని ముందు పెట్టుకుని చంపండి, ఆలస్యం చెయ్యొద్దు” అన్నాడు. ధర్మజుడు దగ్గర్లో వున్న ధృష్టద్యుమ్నుడితో “విన్నావుగా భీష్ముడి మాట? భీమార్జునుల్తో చెప్పి అందర్నీ ఒక్కసారిగా భీష్ముడి మీదికి వెళ్లమని చెప్పు” అని చెప్పాడు. అలా అంతా కలిసి అతని మీదికి వెళ్తుంటే నీ కొడుకులు, ఇతర రాజులు భీష్ముడికి అడ్డంగా వచ్చి యుద్ధం సాగించారు. అర్జునుడు దారి చేసుకుని భీష్ముడి వైపుకు వెళ్తుంటే దుశ్శాసనుడు అడ్డం వచ్చాడు. ఐతే సవ్యసాచి అతన్ని తీవ్రంగా బాణాల్లో ముంచేస్తే వెనక్కి తగ్గి భీష్ముడి వెనక్కు చేరాడు. అర్జునుడు శిఖండితో, “అడుగో భీష్ముడు, బాణాలెయ్, బాణాలెయ్” అంటూంటే ఇంతలో మన యోధులు భీష్ముణ్ణి దాటుకుని అర్జునుడి మీదికి దూకారు. శిఖండి భీష్ముడి మీద బాణాలేశాడు గాని అతను నవ్వుతూ మిగిలిన వాళ్లతో యుద్ధం సాగించాడు. అర్జునుడి బాణపరంపరకి మన యోధులు చెల్లాచెదురయారు. అది చూసి నీ కొడుకు అందర్నీ పిలిచి అర్జునుడి మీదికి పురికొల్పాడు. కళింగ, మాళవ, బాహ్లిక, విదేహ, శూరసేన బలాలు అర్జునుడి మీదికి కదిలినయ్. ఐతే దివ్యాస్త్రాల్తో అతను వాటిని ఛేదించాడు. అప్పుడు దుశ్శాసనుడు కృప, శల్య, వివింశతి, వికర్ణుల్ని కూడగట్టుకుని భీష్ముడికి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. పార్థుడు వాళ్లందర్నీ విరథుల్ని చేశాడు. అదిచూసి దుర్యోధనుడు తన తమ్ములందరితో వచ్చి అర్జునుణ్ణి ఎదుర్కున్నాడు. పోరు ఘోరమైంది.

అభిమన్యుడు మొదలైన పాండవ కుమార వీరుల్తో పొంగుతున్న పాండవసేనని చూసి ఒక దివ్యాస్త్రం తీశాడు భీష్ముడు. అది వెయ్యబోయేంతలో ఎదురుగా శిఖండి కనపడేసరికి దాన్ని వదిలేశాడు. ఇంతలో విరాటుడి తమ్ముడు శతానీకుడు ఆవేశంగా భీష్ముణ్ణి ఎదుర్కుని వాడి బాణాల్తో అతన్ని నొప్పించాడు. కోపించి అతని తల నరికాడు భీష్ముడు. అదిచూసి పాండవసేన అల్లకల్లోలమైంది. ఇంకా ఊరుకోవటం భావ్యం కాదు, భీష్ముడి పని ముగించమని అర్జునుణ్ణి ప్రోత్సహించాడు కృష్ణుడు.

శిఖండి బాణాలేస్తుంటే వాటి వెనకనే తనూ ఓ నిశితబాణమేసి భీష్ముడి విల్లు విరిచాడు అర్జునుడు. అదిచూసి మన బలగంలో మహావీరులు అర్జునుడి మీదికి దూకుతుంటే పాండవబలం వాళ్లు వాళ్లని ఎదుర్కున్నారు. అందరికీ అన్నిరూపులుగా శరసమాధానాలు చెప్తూ, మరోవంక భీష్ముడు ఎన్ని విల్లుల్ని తీసుకుంటే అన్నిట్నీ విరుస్తూ, శిఖండిని కాచుకుంటూ, భీష్ముణ్ణి తరుముతూ, సవ్యసాచి భీష్ముడి సారథిని చంపి కేతనాన్ని కూల్చాడు. భీష్ముడు మనసులో అనుకున్నాడూ, “కృష్ణుడు లేకుంటే ఈ పాండవులందర్నీ నేనొక్కణ్ణే జయిద్దును, ఐతే కృష్ణుణ్ణి తీసుకుని పాండవులు వస్తే నన్నెలా చంపొచ్చునో వాళ్లకి చెప్పా, ఆ మాట నిలబెట్టుకుంటా” అని. ఆకాశాన్నుంచి దేవతలు కూడ “ఇదే సరైన మార్గం” అని అతనితో అన్నారు. అది అతనికీ నాకూ మాత్రమే వినపడింది. అప్పుడు సూక్ష్మజలశీకర మారుతం అతని మీద వీచింది, దేవదుందుభులు మోగినయ్. అవీ మా ఇద్దరికే తెలిసినయ్.

ఐనా యుద్ధం చెయ్యకపోవటం ధర్మం కాదు గనక బాణాలేయటం సాగించాడు భీష్ముడు. శిఖండి అతని మీద వేస్తున్న బాణాలు అతన్ని ఏమీ చెయ్యలేకపోతుంటే వెనక నుంచి అర్జునుడు భీష్ముడి మీదికి క్రూరనారాచాలు ప్రయోగించాడు. చుట్టుపక్కలే వున్నా నీ కొడుకులు భీష్ముణ్ణి రక్షించటానికి రాలేక చూస్తుంటే నీ తండ్రి నీ పెద్దకొడుకుతో “ఈ అర్జునుణ్ణి చూడు, ఈ మహావీరుణ్ణి గెలవటం దేవాసురులకైనా అసాధ్యం. మనలాటి సామాన్యుల వల్ల ఔతుందా? వీడు తప్ప మిగిలిన వాళ్లందర్నీ నేనొక్కడినే గెలవగలను” అంటూండగా శిఖండి వేసినట్టుగా అతని వెనక నుంచి అర్జునుడు భీష్ముడి మీదికి నిశితాస్త్రాలు వేశాడు. భీష్ముడు దుశ్శాసనుడితో “పిడుగుల్లాటివి, సూటిగా శరీరాన్ని చొచ్చేవి, యమదూతల్లాటివి – ఇలాటి బాణాలు శిఖండికి సాధ్యం కావు, ఇవి అర్జునుడివే, అనుమానం లేదు” అంటూ ఇంకో విల్లు తీసుకుని అర్జునుడి మీద బాణాలేస్తే అతనా వింటినీ విరిస్తే వాలూ పలకా తీసుకుని రథం దిగబోతుంటే అర్జునుడు తన సైన్యాల్ని కేకేసి పిలిచి “నేనుండగా మీకేం భయం వద్దు, భీష్ముణ్ణి పొడవండి, చంపండి” అనరిచాడు. అదిచూసి మన సేన భీష్ముడికి అడ్డుపడబోతుంటే అర్జునుడు వాళ్లని కదలకుండా బాణాల్తో ముంచుతుంటే అతని సేనలో వాళ్లు అదే అదనుగా శరీరం మీద వేలెడైనా ఖాళీ లేకుండా భీష్ముడి ఒంటినిండా బాణాలు నాటారు. అర్జునుడూ ఘోరమైన అస్త్రాల్తో భీష్ముణ్ణి కింద పడేశాడు.

అందరూ అవాక్కులై చూస్తుండగా భీష్ముడు తల తూర్పు దిక్కుగా నేలకేసి ఒరిగాడు. అతని శరీరం నేలకి తాకకుండా బాణాలే తల్పం సమకూర్చినయ్. “అయ్యయ్యో దక్షిణాయనంలో ఈ మహానుభావుడు, పుణ్యశాలి మరణిస్తున్నాడే” అని దేవతలు కటకటపడుతుంటే భీష్ముడు, “దేవతలారా, ఆందోళన వద్దు. అందుకే ప్రాణాల్ని శరీరంలోనే ఉంచాను. నా తండ్రి నాకు అవధ్యుడిగా, స్వచ్ఛంద మరణం కలిగేట్లు వరాలిచ్చాడు. అందువల్ల నా అనుమతి లేకుండా నన్నెవరూ చంపలేరు, నా ప్రాణాలు నా వశాలు” అని సమాధానపరిచాడు. ఇంతలో అతని తల్లి గంగాదేవి పంపగా ఆ విషయమే చెప్పటానికి హంసల రూపంలో వచ్చిన మునులు కూడ అది విని ఆనందించి వెళ్లారు.

దుర్యోధనుడు పంపితే దుశ్శాసనుడు వెళ్లి భీష్ముడు పడిన సంగతి ద్రోణుడికి చెప్పాడు. అదివిని అతను మూర్ఛపోయి మెల్లగా తెప్పరిల్లి అక్కడికి బయల్దేరాడు. పాండవసేనలు సంతోషంతో బొబ్బలు, అరుపులు పెట్టారు, తూర్యధ్వనులు మోగించారు. ఇటువైపు ఏడుపులు, హాహాకారాలు వినపడ్డయ్. యుద్ధం చెయ్యటానికి చేతులు రాక అందరూ బొమ్మల్లాగా నిలబడిపోయారు. సూర్యాస్తమయం అయింది.

అదంతా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో “నాది గుండో రాయో గాని నీమాటలన్నీ విని కూడ ఇంకా పగలకుండా వున్నది. ఇంకా నువ్వు చెప్పాల్సినవి వున్నాయా?” అనడిగాడు.

దానికి సంజయుడు “అప్పుడందరూ కవచాలు, ఆయుధాలు విడిచి యుద్ధం విషయం వదిలి పితామహుడి చుట్టూ కూర్చున్నారు. అర్జునుడొక్కడే ధనుర్బాణాల్తో వచ్చాడు. తనకు తలకింద ఎత్తు కావాలని భీష్ముడు నీకొడుకుల్తో చెప్తే వాళ్లు తలగడల కోసం పంపారు. అతను చిరునవ్వుతో అర్జునుణ్ణి పిలిచాడు. అర్జునుడు గాండీవం పక్కన పెట్టి కళ్లనుంచి అశ్రువులు కారుస్తూ అతని దగ్గరికి వెళ్లాడు. శరతల్పంతో సరిగా తలగడకి కూడ బాణాలు ఏర్పాటు చెయ్యమని చెప్తే అలాగేనని వెళ్లి అర్జునుడు గాండీవం తీసుకుని మూడు బాణాల్ని అభిమంత్రించి భూమిలో నాటాడు. అవి సరిగ్గా తనకు తలగడగా సరిపోయాయని భీష్ముడు ఆనందించాడు.

అక్కడున్న వాళ్లందర్నీ చూస్తూ, “ఉత్తరాయణం వచ్చేవరకు నేనిలాగే వుంటాను, కనక నాకు గట్టి రక్ష ఏర్పాటు చెయ్యండి” అని చెప్తే వెంటనే కౌరవులూ పాండవులూ కూడ తగిన వాళ్లని ఆ పనికి నియోగించారు. చికిత్సకులు వచ్చి శల్యచికిత్స చేస్తామంటే భీష్ముడు వాళ్లని వారించి పంపాడు. భీష్ముడు దాహం అడిగితే పరిగెత్తుకెళ్లి అనేకమంది నీళ్లు తీసుకొచ్చారు కాని అతను “శరతల్పగతుడినైన నేను తేజోమయాస్త్రాలతో వెలికి తీసిన నీళ్లు మాత్రమే తాగాలి” అంటే అందరూ బిత్తరపోయి చూశారు. అతను అర్జునుణ్ణి పిలిచి ఈపనికి నువ్వే సమర్థుడివని చెప్తే అతను అలాగేనని తాతకి ప్రదక్షిణం చేసి తేజోమయమైన బాణాన్ని పర్జన్యమంత్రంతో మంత్రించి భూమిలో నాటితే దివ్యగంధంతో కూడిన ధార బయటికొచ్చింది. ఆ నీటితో భీష్ముణ్ణి సంతృప్తుణ్ణి చేశాడు అర్జునుడు.

అప్పుడు భీష్ముడు నీ కొడుకుతో “కృష్ణార్జునులు కారణజన్ములు, వాళ్లని గెలవటం ఎవరికీ తరం కాదు. ఈ యుద్ధం మాని వాళ్లకి ఇంద్రప్రస్థంతో అర్థరాజ్యం ఇచ్చి కొందరైనా బతికి బట్టకట్టండి” అని చెప్తే కౌరవపాండవులందరూ మౌనంగా విని అతనికి నమస్కరించి సెలవు తీసుకుని వారి వారి నివాసాలకి వెళ్లారు.

ఆ తర్వాత కర్ణుడు భీష్ముడి దగ్గరికి వెళ్లి భక్తి వినయాల్తో పాదప్రణామం చేసి “నామీద కోపం విడిచి వాత్సల్యంతో నాకు తగిన మాటలు చెప్పు” అని అడిగితే అతన్ని గౌరవంగా దగ్గరికి పిలిచి ఆ చుట్టుపక్కల వున్న వాళ్లందర్నీ దూరంగా పంపి ఇలా అన్నాడు భీష్ముడు – “పిల్లలు నీ మూలాన చెడుతున్నారన్న రోషమే తప్ప నువ్వంటే నాకు కోపం కాదు. పైగా నువ్వు కౌంతేయుడివని వ్యాసుడు ఇదివరకే చెప్పాడు. ఆ పాండవులతో వైరం వద్దు, నువ్వూ వాళ్లతో కలువు” అని చెప్పాడు. ఐతే రాధేయుడు మాత్రం “ఇదంతా నేనూ ఇదివరకు విన్న విషయమే. ఐనా దుర్యోధనుడు నాకు ఇంతకాలం ఎంతో గౌరవం ఇచ్చాడు, అతన్ని వదలటం భావ్యం కాదు. అలాగే పాండవుల్ని నేను సమయం దొరికినప్పుడల్లా అవమానించాను. సర్వమూ దైవాధీనం. నా శక్తి కొద్దీ నేను యుద్ధం చేసి రారాజు ఋణం తీర్చుకుంటాను. వేరే మాట లేకుండా నాకు అనుజ్ఞ ఇవ్వు” అన్నాడు. “నాకు తెలియదా, అలాగే. దుర్యోధనుడికి ఏది ప్రియమో అది చెయ్యి. మనస్సులో ఎలాటి అనుమానాలూ వద్దు. అనుజ్ఞ ఇస్తున్నా” అని అతన్ని పంపించాడు భీష్ముడు.

జనమేజయుడితో వైశంపాయనుడు ఇలా చెప్పాడు – భీష్ముడి అంపశయ్య గురించి వివరంగా విన్న ధృతరాష్ట్రుడు ఆ తర్వాతి యుద్ధ క్రమం చూడమని సంజయుణ్ణి రణభూమికి పంపాడు. కొడుకు విజయం గురించిన వార్త అతనెప్పుడు తీసుకువస్తాడా అని ఎదురుచూస్తున్నాడు. ఒకరోజు రాత్రివేళ సంజయుడు తిరిగివచ్చాడు. హడావుడిగా అంతఃపురం ప్రవేశించి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి యుద్ధవిశేషాలు చెప్పటం ప్రారంభించాడు.

“అలా ఆ రాత్రి నీకు భీష్ముడి యుద్ధం గురించి నేను వినిపించి తెల్లవారు జామున తిరిగి కౌరవ శిబిరాలకు వెళ్లేసరికి మన సైన్యంలో భీష్ముడు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. అందరూ విషణ్ణవదనాల్తో ఇప్పుడిక మనని రక్షించగలిగింది కర్ణుడొకడే అని అతన్ని తల్చుకోసాగారు. నీకు గుర్తుంది కదా – భీష్ముడు తనని కేవలం అర్థరథుడని తక్కువచేసి చెప్పినందుకు చిన్నబుచ్చుకుని కర్ణుడు “నువ్వు యుద్ధానికి పోతే నేను ఆ చాయలకు కూడ రాను, నువ్వు గెలిస్తే నేను వనవాసానికి పోతా, నిన్ను వాళ్లు గెలిస్తే అప్పుడు నేనొచ్చి వాళ్లని గెలుస్తా” అని ప్రతిజ్ఞ చేసి వున్నాడు కనక అప్పటివరకు అతను యుద్ధం చెయ్యలేదు.

పదకొండవ రోజు

ఇక ఆ రోజు తెల్లవారటం తోనే పురాన్నుంచి బయల్దేరి దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు కర్ణుడు. “దమం, సత్యం, తపం, దానం, శీలం, అస్త్ర వీర్య శౌర్యాల్లో సాటిలేని భీష్ముణ్ణి పోగొట్టుకున్నాం, ఎంత దౌర్భాగం!” అని కన్నీళ్లతో వాపోయాడు. అది విని మిగిలిన వాళ్లు కూడ బిగ్గరగా ఏడ్చేశారు.

ఐతే అంతలోనే అతను తన్నుతాను సంభాళించుకుని “మీరంతా చూస్తూండగా మేరువు లాంటి ధీరుడు భీష్ముడు నేలకొరిగాడు. ఐతే మీ కళ్ల పండుగ్గా నేను ఆ పాండవ బలగాల్ని నాశనం చేసి పాండవుల్ని చంపి రాజ్యాన్ని దుర్యోధనుడికి కట్టబెడతా. అది కాని పక్షంలో నా శౌర్యపాటవాల్తో భీష్ముణ్ణి మరిపింపజేసి చివరికి ఆయన దగ్గరకే చేరతా. అదైనా ఇదైనా అంతకన్నా కావలసిందేముంది?” అని తన సారథిని పిలిచి మణిగణోజ్జ్వలమైన రథాన్ని సిద్ధం చెయ్యమని చెప్పాడు. అతను తీసుకొచ్చిన రథం ఎక్కి భీష్ముడున్న చోటికి వెళ్లాడు.

కొంత దూరంలో రథం ఆపి పాదచారిగా ఆయన దగ్గరికి చేరాడు. “మహానుభావా, రాధేయుణ్ణి వచ్చాను, నన్ననుగ్రహించి నాతో మంచి మాటలు మాట్లాడు. ఇన్నాళ్లూ – వింటేనే గుండెలు బద్దలయ్యే ఆ పాంచజన్య దేవదత్త శంఖధ్వానాల నుంచి, కళ్లకి ఆతురత కలిగించే కపిధ్వజం వెలుగుల నుంచి, చండ గాండీవ నిర్ముక్త అద్భుతాస్త్రాల నుంచి, నువ్వు కాబట్టి కౌరవసేనని కాపాడావు కాని మరొకరికి సాధ్యమా? ఆ మహాశివుడితోనే బాహాబాహీ ముష్టాముష్టీ పోరాడిన గాండీవిని అడ్డుకోగలిగిన వాడు నువ్వుగాక ఇంకెవరు?” అనంటుంటే మెల్లగా కళ్లు తెరిచాడు భీష్ముడు. ఆదరంగా అతన్ని చూస్తూ, “దుర్యోధనుడు ఎలాగో కౌరవులకి నువ్వలాగ. పుట్టుకతో వచ్చే చుట్టరికాల కంటే స్నేహబాంధవ్యం అధికం కదా! ఇప్పుడిక కౌరవులకు నువ్వు దిక్కువై ఆ రారాజుకి విజయం చేకూర్చు. వెళ్లు” అని దీవించాడు. అతని పాదాలకు వినయంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు కర్ణుడు.

దుర్యోధనుడు కర్ణుడికి ఎదురు వెళ్లి “నీ రాకతో మనసేనకి మళ్లీ కళ వచ్చింది. ఇక ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో చెప్పు” అన్నాడు. దానికి కర్ణుడు “నువ్వు చెప్తే నేను వింటా, ఏమిటి నీ ఆలోచన?” అనడిగాడు. “ఇప్పుడు మనకు ఓ సేనాపతి కావాలి. ఎవరైతే బాగుంటుంది?” అనడిగాడు దుర్యోధనుడు. “నీ సైన్యంలో సేనాని కాదగ్గ వాళ్లు ఎందరో ఉన్నారు. ఐతే ఒకరిని ఎన్నుకుంటే మిగిలిన వాళ్లకి అసూయ కలగొచ్చు. అలా కాకుండా అందరికీ నచ్చే వ్యక్తి కావాలి. ద్రోణుడు అలాటివాడు. ఎవ్వరూ కాదనరు. అతనే అర్హుడు కూడ” అని చెప్పాడు కర్ణుడు.

దుర్యోధనుడు తగిన రాజుల్ని తనతో కూర్చుకుని ద్రోణుడి దగ్గరకు వెళ్లి వినయంగా అతనితో – “నీ గుణశీల సంపదల్ని, శస్త్రాస్త్ర వైభవాన్ని భీష్ముడు ఎప్పుడూ పొగిడేవాడు. దేవసేనని నడిపి రాక్షసుల్ని జయించిన కుమారస్వామిలా ఈ కురుసైన్యానికి సర్వసైన్యాధిపత్యం వహించి మమ్మల్ని గెలిపించు” అని అందర్నీ చూపిస్తూ అతన్ని వేడుకున్నాడు. దానికి ద్రోణుడు, “ఏదో వేదాలు, వాటి అంగాలు కాస్తో కూస్తో నేర్చుకున్నా తప్పితే ధైర్యాది గుణాలు నాకేం తెలుసు? ఐనా మీరందరూ ఇంతగా అడుగుతున్నారు కాబట్టి కురురాజు కోరిక తీర్చటానికి సిద్ధపడుతున్నా. ఈ సైన్యాధిపత్యం స్వీకరించి నా దివ్యాస్త్రాలతో పాండవుల అంతు చూస్తా” అన్నాడు. దుర్యోధనుడు ఆనందించి కనకకలశాల్లో పావనజలాలు తెప్పించి మంగళధ్వనుల మధ్య సైన్యాధిపత్య పట్టాన్ని అతనికి కట్టాడు. రాజులంతా శంఖాలు పూరించారు, భేరీ మృదంగ నాదాలు మిన్ను ముట్టినయ్.

అలా సర్వసైన్యాధ్యక్షుడై అద్భుత మహాస్త్రాలతో, అనివార్య శౌర్యంతో ఒక అక్షౌహిణికి పైగా పాండవసేనని చంపి, ఎందరో మేటి దొరల్ని మట్టి గరిపి, చివరికి దుష్టుడైన ధృష్టద్యుమ్నుడి చేతిలో ద్రోణుడు మరణించాడు” అని సంజయుడు చెప్పటంతో ధృతరాష్ట్రుడు నిశ్చేష్టుడయాడు. అతికష్టం మీద తెప్పరిల్లి “అంత మహిమాన్విత శస్త్రాస్త్ర కోవిదుడు ఆ దౌర్భాగ్యుడి చేత పడుతుంటే మిగిలిన వాళ్లంతా ఏమయ్యారు? అసలెలా జరిగిందిది? ఇంక దుర్యోధనుడు గెలుస్తాడన్న ఆశలు అడియాశలే కదా! అయ్యయ్యో, దుర్మతులైన నా కొడుకుల మూలాన అంతటి మహానుభావుడు బలై పోయాడే! పాపం, ఆ అశ్వత్థామ ఇదంతా చూస్తూ ఎలా భరించగలిగాడో” అని విలపిస్తూ మూర్ఛ పడ్డాడు.

అక్కడి స్త్రీలు ఆక్రందనలు చేస్తూ వచ్చి అతన్ని ఎత్తి పరుపు మీద పడుకోబెట్టి శిశిరోపచారాలు చేస్తే మెల్లగా తేరుకున్నాడు. లేచి కూర్చుని అన్నాడూ – “నరనారాయణులు రథిక సారథులుగా వున్న రథానికి తిరుగెక్కడ? కవలలు మహాశూరులు. సాత్యకి గొప్ప పరాక్రమవంతుడు. పాంచాలుడు ఉత్తమౌజుడు బాహుబలుడు. శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు ధీరుడు. శిఖండి అఖండపరాక్రముడు. అభిమన్యుడు అపరరుద్రుడు. యాదవరాజు చేకితానుడు మానధనుడు. ద్రౌపదేయులు ఐదుగురూ అజేయులు. కేకయులు ఐదుగురైనా వెయ్యిమంది పెట్టు. యుయుత్సుడు వీరయోధుడు. ధృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణవధకి. ఘటోత్కచుడు వికటభీకరుడు. ఎవరికీ అలివి కానివాడు భీముడు. ధర్మరాజు గుణగరిష్టుడు. ఇక లోకరక్షణపరుడై యదువంశాన పుట్టి వ్రేపల్లెలో బాల్యం నటించి కంసాది రాక్షసుల్ని తుంచి అవలీలగా ఇంద్రుడి పారిజాతాన్ని ఇంటిపెరటికి తెచ్చుకున్న ఆ కృష్ణుడు వాళ్ల పక్షాన వున్నాడు. ఇలాటి బలగాన్నా మనవాళ్లు గెలిచేది? భీష్మ ద్రోణుల రక్షణ లేని కౌరవసైన్యం గాండీవి శరాలకి బలికావటం తప్పదు. ఇంక వినటానికీ చెప్పటానికీ ఏముంది గనక” అని నిట్టూర్పు నిగిడిస్తూ కూర్చుని “ఐనా ద్రోణుడి యుద్ధపరాక్రమాన్ని వివరించి చెప్పు, అది వినైనా సంతోషిస్తా” అనడిగాడు ధృతరాష్ట్రుడు.

సంజయుడు ఆ వృత్తాంతం అంతా చెప్పటం ప్రారంభించాడు.

అలా సర్వసైన్యాధ్యక్షుడైన ద్రోణుడు సంతోషంగా నీ కొడుకుతో, “భీష్ముని తర్వాత నన్ను పెద్దని చేశావు, ఈ మంచి పనికి ఫలంగా నీకో వరం ఇస్తా, ఏం కావాలో కోరుకో” అన్నాడు. దుర్యోధనుడు కర్ణదుశ్శాసనాదుల్తో ఆలోచించుకుని వచ్చి “నువ్వు వరం ఇచ్చేట్లయితే ఒకటి కోరతాను. ధర్మరాజుని ప్రాణాల్తో పట్టి తెచ్చి నాకప్పగించు చాలు” అని కోరాడు. ద్రోణుడు ఆశ్చర్యంతో, “ఆహా, ధర్మరాజుకి అజాతశత్రుడన్న పేరు ఎందుకొచ్చిందో ఇప్పుడర్థమౌతున్నది. అతన్ని చంపమని కాకుండా ఇలా ప్రాణాల్తో కావాలని కోరుకుంటున్నావ్. అలా వాళ్లని ఓడించి ఆ తర్వాత అర్థరాజ్యం ఇద్దామనా నీ సంకల్పం?” అనడిగాడు ద్రోణుడు కుతూహలంగా.

దుర్యోధనుడు గర్వంగా తన ఆలోచనని అందరూ వినేట్టు చెప్పాడిలా – “ధర్మరాజుని చంపితే ఇక అర్జునుడు మననందర్నీ చంపకుండా ఆపటం ఎవరి తరమూ కాదు; ఒకవేళ ఎలాగోలా పాండవులందర్నీ చంపగలిగామనుకున్నా కృష్ణుడు మనల్ని వదలడు; రాజ్యాన్ని కుంతికైనా కట్టబెడతాడు. ఇదంతా లేకుండా ధర్మజుణ్ణి పట్టుకుని మళ్ళీ జూదం ఆడించి అడవులకి పంపామా, ఇక వాళ్ల పీడ శాశ్వతంగా విరగడైపోతుంది.”

ద్రోణుడి మనసు కలుక్కుమంది. తనిస్తానన్న వరానికి ఏదన్నా లొసుగు పెడదామని ఆలోచించాడు. తీవ్రంగా ఆలోచించగా ఒక దారి దొరికింది. అన్నాడూ, “అర్జునుడుండగా ధర్మరాజుని పట్టుకోవటం దుష్కరం. కాబట్టి మీరు అర్జునుడు చుట్టుపక్కల లేకుండా చూడండి, అప్పుడు ధర్మజుడు గనక యుద్ధరంగంలో గట్టిగా నిలబడితే నేనతన్ని పట్టి నీకిస్తా”. ఇక ధర్మరాజు దొరికినట్టేనని నీ కొడుకులు మురిసిపోయారు. నీపెద్దకొడుకు ఆ విషయాన్ని మనసైన్యమంతటా దండోరా వేయించాడు.

పాండవుల చారులు వెంటనే ఆ విషయం ధర్మరాజుకి చెప్పారు. అతను అర్జునుడితో, “విన్నావుగా ద్రోణుడి వరం? అది వమ్ము చెయ్యాలి మనం. ఎప్పుడూ నన్ను వదలకుండా చుట్టుపక్కలే వుండు” అని చెప్పాడు. అర్జునుడు “నిన్ను వదిలివెళ్లటం గురువుని చంపటంతో సమానం. అలా చేస్తానా? నా మేన ప్రాణం వున్నంతవరకు ద్రోణుడే కాదు ఆ రుద్రుడు వచ్చినా నిన్ను పట్టలేడు. కౌరవుల దురాశ తప్ప ఇదేం ఆలోచించాల్సిన విషయం కాదు” అని ధైర్యవచనాలు పలికాడు.

సైన్యాలు కదిలినయ్. పాండవులు క్రౌంచవ్యూహంతో వస్తే మన సైన్యం శకటవ్యూహంతో ఎదిర్చింది. మన సేనాముఖాన కర్ణుడిని చూసి అందరికీ ధైర్యం, ఉత్సాహం కలిగినయ్. ఎప్పుడెప్పుడు ఒకరొకరితో యుద్ధం చేస్తామా అని కర్ణార్జునులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఉజ్జ్వల రథమ్మీద ద్రోణుడు బయల్దేరి శత్రుసైన్యం మీదికి దూకాడు. అదిచూసి అర్జునుడు మన సైన్యం మీదికి పరుగు తీశాడు. ద్రోణుడు అత్యంత చాకచక్యంతో పాండవ బలగానికి అన్ని దిక్కులా తానే కనిపిస్తూ పీనుగుపెంటలు పోశాడు. ధర్మరాజు ద్రోణుడిని ఎదిరించటానికి అర్జునుణ్ణి, ధృష్టద్యుమ్నుడిని తరిమాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి మీద వివిధాస్త్రాలు సంధించాడు. ఐతే ద్రోణుడు వృద్ధుడైనా కుమారస్వామిని తలపిస్తూ ఉన్మత్తుడిలా యుద్ధం చెయ్యసాగాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి సారధిని రక్తసిక్తుణ్ణి చేస్తే మనవాళ్లు అనేకమంది యోధులు అతని మీద పడ్డారు. అదిచూసి అర్జునుడు వడిగా వాళ్లందర్నీ వారించి గాయాలు చేశాడు. శకుని సహదేవుడితో తలపడ్డాడు. అతని కేతనాన్ని కూల్చి గుర్రాల్ని గాయపరిస్తే సహదేవుడు కోపించి అతని రథం నుగ్గుచేశాడు. శకుని పెద్దగదతో కిందికి దూకి అతని సారథిని చంపితే అతనూ ఒక గదతో దూకి తలపడ్డాడు.

మరోవంక విరాటుడు తన బలాల్తో కర్ణుడితో పోరాడు. కర్ణుడు కించిత్ కోపంతోనే రథ, తురగ, రథిక సహితంగా ఆ బలగాన్ని చించిచెండాడాడు. మరోవంక ద్రుపదుడూ భగదత్తుడు తారసిల్లారు. ఇంకోచోట పౌరవుడు అభిమన్యుడితో తలపడి అతన్ని బాణాల్లో ముంచెత్తాడు. అభిమన్యుడు రౌద్రంగా వాడి వింటినీ కేతనాన్నీ తుంచి గుర్రాల్నీ సారథినీ నొప్పించి వాడి తల నరకటానికి ఒక వాడిశరాన్ని తొడుగుతుండగా హడావుడిగా కృతవర్మ రెండమ్ముల్తో ఆ వింటినీ బాణాన్నీ విరిచాడు. అభిమన్యుడు పలకా వాలూ తీసుకుని నేలమీదికి దూకి పౌరవుడి గుర్రాల్ని చంపి సారథిని పడదన్ని గరుత్మంతుడు పాముని పట్టుకున్నట్టు వాడి జుట్టు పట్టుకుని వేటు వెయ్యబోయేంతలో సైంధవుడు పదునైన ఖడ్గాన్ని తీసుకుని అతని మీదికి పరిగెత్తాడు.

వాణ్ణి చూసిన అభిమన్యుడు పౌరవుణ్ణి వదిలి సైంధవుడి మీదికి కదిలాడు. ఇద్దరికీ భీకర యుద్ధం జరిగింది. అభిమన్యుడి పలక దెబ్బకి సైంధవుడు బాధతో అరుస్తూ వెనక్కి పారిపోయాడు. “పోరా పిరికిపందా” అంటూ అభిమన్యుడు తన రథం మీదికి దూకి సైంధవ సైన్యాన్ని తునాతునకలు చేశాడు. సైంధవుడి పరిస్థితి చూసి మన రాజులు చాలామంది ఒక్కసారిగా అభిమన్యుడి మీద పడ్డారు. శల్యుడు అతని మీదికి ఒక శక్తిని విసిరేస్తే అతను దాన్ని అవలీలగా పట్టుకుని తిరిగి శల్యుడి మీదికే విసిరేశాడు. దాంతో శల్యుడి సారథి చచ్చాడు.

పాండవపక్షం దొరలంతా ఆనందంగా అభిమన్యుడిని పొగుడుతుంటే సహించక నీ కొడుకులు అతనిమీద అంపవృష్టి కురిశారు. సారథి చచ్చిన శల్యుడు రౌద్రుడై గద తీసుకుని అభిమన్యుడి మీదికి బయల్దేరాడు. అభిమన్యుడు కూడ ఒక గద తీసుకుని “రా నీ అంతు చూస్తా” అంటూ శల్యుణ్ణి ఎదుర్కున్నాడు. ఐతే అంతలోనే శరవేగంతో అక్కడికి వచ్చిన భీముడు అభిమన్యుణ్ణి పక్కకి నెట్టి తనే శల్యుడితో తలపడ్డాడు.

ఇద్దరూ ఎవరికి వారే సాటి అన్నట్టు భీషణంగా గదాయుద్ధం సాగించారు. వాళ్ల మండలప్రచారాలు, విచిత్రగదా ప్రసారణాలు చూస్తూ అంతా బొమ్మల్లా నిలబడ్డారు. అలా ఎంతోసేపు సాగిందా గదారణం. చివరికి ఇద్దరూ పరస్పర ప్రహారాల్తో కింద పడ్డారు. కృతవర్మ వచ్చి శల్యుణ్ణి పైకెత్తి దూరంగా తీసుకుపోయాడు. భీముడు తెలివి తెచ్చుకుని లేచి గద సారిస్తూ విజయోత్సాహంతో మల్లచరుస్తూ తను గెలిచానని ప్రకటించుకుంటుంటే నీ కొడుకులది భరించలేక ఒక్కసారిగా భీముడి మీదికి దూకారు. ఐతే ఇంతలో ధర్మజ సహితంగా పాండవగణాలు వచ్చి వాళ్లని ఎదుర్కున్నయ్.

అలా పాండవసేనలు ఉత్సాహంగా యుద్ధం చేస్తుంటే కర్ణుడి కొడుకు వృషసేనుడు వాళ్ల మీదికి లంఘించి నానా తిప్పలూ పెట్టాడు. దానికి కోపించి నకులుడి కొడుకు శతానీకుడు అతన్ని తాకాడు. వృషసేనుడతని కేతనాన్ని కూల్చి వింటిని విరిస్తే మిగిలిన ద్రౌపదేయులు ఒక్కపెట్టున అతని మీదికి ఉరికారు. ఐతే అశ్వత్థామ వాళ్లందర్నీ ఎదుర్కుని అనేకాస్త్రాల్తో వాళ్లని వేధిస్తే ధర్మరాజు పాంచాల, కేకయ, మత్స్య బలగాల్తో వచ్చి వాళ్లకి సాయంగా నిలిచాడు. ఇలా వచ్చిన పాండవసైన్యం ధాటికి మనసేన నిలవలేకపోతుంటే ద్రోణుడు వీరావేశంతో “ఇప్పుడు నేను ధర్మజుణ్ణి వారించకపోతే కౌరవసేన నిలబడదు. నా ముందు వీళ్లెంత? అర్జునుడిక్కూడా బాణవిద్య నేను నేర్పిందే కదా! పద, చేతుల తీట తీరేట్టు రథికజనాన్ని వేటాడాల్సిన సమయం ఇది” అని సారథిని పురిగొల్పి ధర్మరాజుతో తలపడ్డాడు.

పాండవయోధులంతా ధర్మరాజుకి అడ్డంగా నిలబడి ద్రోణుడితో పోరుతుంటే వాళ్లని లెక్కచెయ్యకుండా ద్రోణుడు విజృంభించి అందర్నీ ఎన్నో విధాలుగా బాధించి అడ్డొచ్చిన చక్రరక్షకుల తలల్ని నరుకుతూ ధర్మరాజు మీదికి దూకి పట్టుకోబోతుంటే పాండవసేన గగ్గోలుగా “ద్రోణుడు ధర్మరాజుని పట్టుకుంటున్నాడు, ఇంకేముంది ఈ పూటతో ఇక యుద్ధం ఐపోయినట్టే” అని అరుస్తుంటే భూకంపం వచ్చేలా దిగ్దంతులు బెంబేలు పడేలా వేగంగా వస్తూ కౌరవసైన్యాన్ని తన బాణపరంపరల్తో ముంచెత్తుతూ అర్జునుడు ఆచార్యుణ్ణి తాకాడు.

కౌరవసేనానీకం మొత్తం ఒక్కసారిగా అతన్ని కప్పితే గాండీవి ఘోరాకారంతో శరవర్షం కురిసి సేనని అల్లకల్లోలం చేశాడు. అతని బాణాల్తో ఆకాశం నిండిపోయి ఎవరెవరో తెలియనంతగా చిక్కటి చీకటి అలుముకుంది. సంధ్యాసమయం కూడ అయింది. ద్రోణుడు సేనని సమకూర్చుకుని వెనక్కి తిరిగాడు. జయతూర్య స్వనాల్తో పాండవులు శిబిరాలకి కదిలారు.

పన్నెండో రోజు.

పొద్దున్నే మనబలాలు యుద్ధానికి సన్నద్ధమయినయ్. ద్రోణుడు లజ్జావిషాదాల్తో దుర్యోధనుణ్ణి చూసి, “అర్జునుడు దగ్గర్లో వుంటే ధర్మరాజుని పట్టటం సాధ్యం కాదని ముందే చెప్పా కదా. మనలో ఎవరైనా ఒకరు అర్జునుణ్ణి దూరంగా తీసుకుపోయి అతన్ని అక్కడే ఉంచగలిగితే ఇంకెవరడ్డమైనా సరే నేను ధర్మజుణ్ణి పట్టిస్తా” అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న త్రిగర్త రాజు సుశర్మ “రారాజా, నీకు నేను ఎప్పుడో ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ఇది సమయం. ఇవాళ యుద్ధంలో ఉంటే త్రిగర్తులుండాలి లేకుంటే అర్జునుడుండాలి, అంతే” అన్నాడు. అతని తమ్ములూ వంత పలికారు. తుండి, కేరళ, మాళవ, ఇతర దేశాల వాళ్లు పదివేలమంది రాజులు వాళ్లకి తోడయ్యారు. స్నానాలు చేసి అగ్నుల్ని పూజించి ప్రతిజ్ఞలు చేశారు.

ద్రోణుడు గరుడవ్యూహం సమకూర్చాడు. త్రిగర్తాదులు అర్జునుడి దగ్గరకి వెళ్లి తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు. అర్జునుడు అన్నతో “ఇలా వీళ్లు రమ్మని పిలిస్తే పట్టించుకోకుండా వుండటం ధర్మం కాదు. వెళ్లి వీళ్లని చించి చెండాడటానికి నాకు అనుమతివ్వు. నీకేమీ కాదు, భయం అక్కర్లేదు” అన్నాడు. “ద్రోణుడి ప్రతిజ్ఞ నీకు తెలిసిందే. మరి అది నిజం కాకుండా చెయ్యటానికి ఏదో ఉపాయం ఆలోచించి వెళ్లు” అన్నాడతనితో ధర్మరాజు. అర్జునుడు పాంచాలరాజు సత్యజిత్తుని చూపించి, “ఇతను మహావీరుడు. ఇతను ఉన్నంతసేపు నీకేమీ భయం వుండదు. ఒకవేళ ఇతను మరణిస్తే మాత్రం నువ్వు యుద్ధభూమిలో వుండొద్దు, ఎలాటి సందేహమూ పెట్టుకోకుండా బయటికి వెళ్లు” అని చెప్పి అర్జునుడు త్రిగర్తుల్తో యుద్ధానికి బయల్దేరాడు. అర్జునుడలా వెళ్లటం చూసి మనసైన్యాలు ఉప్పొంగినయ్.

ధర్మరాజు గరుడవ్యూహానికి ప్రతిగా మండలార్థవ్యూహం కట్టించాడు. ధృష్టద్యుమ్నుణ్ణి పిలిచి “ఇవాళ నువ్వు నీ సంగరపాండిత్యం అంతా చూపాలి సుమా” అని చెప్తే అతను, “అంతకన్నానా, నువ్వే చూద్దువుగా” అంటూ కౌరవసైన్యం మీదికి కదిలాడు. ఎదురుగా వస్తున్న ద్రోణుడు అతన్నే మొదట చూడటం అపశకునంగా భావించి కొంచెం ఖిన్నుడై పక్కకు వెళ్లి పాంచాలబలంతో తలపడ్డాడు.

ఇక త్రిగర్తులు అర్జునుడి కోసం చూస్తూ అర్థచంద్రాకారంగా నిలబడ్డారు. దూరం నుంచి వాళ్లని చూపిస్తూ అర్జునుడు కృష్ణుడితో “వీళ్లని చూశావా, కొవ్వి చావుకి సిద్ధంగా వున్నారు. దుర్మార్గులైనా నా దివ్యాస్త్రాల్తో చచ్చి సుగతికి పోయే ప్రాప్తం వుంది వీళ్లకి” అంటూ దేవదత్తం పూరిస్తే దాని భీకరధ్వనికి ఒక్కసారిగా మానుల్లా నిలబడిపోయారు ధైర్యం నీరై కారుతుంటే. మెల్లగా తెలివి తెచ్చుకుని అతని మీదికి ఒక్కపెట్టున దూకి బాణాలు వేస్తే అతను చకచక పదిహేనువేల రథాల వాళ్లని పరలోకాలకి పంపాడు. అప్పుడు సుబాహుడు, సుశర్ముడు, సురథుడు, సుధన్వుడు కలిసి అతన్ని తాకారు. ఆ వీరుడు సునాయాసంగా వాళ్ల జెండాలు తుంచి పనిలో పనిగా సుధన్వుడి శిరసునీ ఖండించాడు. ఇదిచూసి సైన్యం కకావికలైంది. సుశర్మ అందర్నీ కేకేసి “దుర్యోధనుడి ముందు చేసిన ప్రతిజ్ఞలు ఇంతలోనే మరిచిపోయారా?” అని అదిలిస్తే మెల్లగా కూడసాగారు. కృష్ణుడు రథాన్ని రకరకాల విన్యాసాల్తో నడుపుతుంటే అర్జునుడా సంశప్తక సైన్యాన్ని ఊచకోత కోశాడు.

ఇంతలో నారాయణగోపాలకులు దుర్యోధనుడు కృష్ణుడితో సమానంగా తమని కోరుకున్నందుకు ఆ ఋణం తీర్చుకుంటామని కృష్ణార్జునుల మీద దాడి చేశారు. గాండీవి తనకి విశ్వకర్మ ఇచ్చిన ఒక మహాస్త్రాన్ని వాళ్ల మీద ప్రయోగిస్తే దాని ప్రభావంతో వాళ్లు ఒకరినొకరు అర్జునుడనుకుని నరుక్కుని చంపుకున్నారు. అస్త్రం శాంతించింది. చావగా మిగిలిన వాళ్లు అతనితో తలపడ్డారు. అతను అవలీలగా అ హతశేషుల్నీ హతుల్ని చేస్తుంటే తుండి, మగధ, కేరళ, మచ్ఛిల్లిక రాజులు ఒక్కసారి అతని మీద దూకారు. అర్జునుడు ఆ బలగాల్నీ చీల్చి చెండాడుతుంటే సంశప్తకులు రథాల్ని విడిచి గుర్రాలమీద అతన్ని చుట్టుముట్టారు. ఆ దుమ్మూ ధూళికి కృష్ణుడికి అర్జునుడు కనపడక “అర్జునా, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, ఇక్కడ ఏమీ కనపడటం లేదు” అని వ్యాకులపాటుతో పిలిస్తే వాయువ్యాస్త్రంతో ధూళినీ వాళ్లనీ చెదరగొట్టి కృష్ణుడికి కట్టెదుట కనిపించి ఆనందం కలిగించాడతను. ఆ తర్వాత అర్జునుడు ప్రళయావసాన ఫాలాక్షుడై సంశప్తక మూకల్ని గుంపులు గుంపులుగా నాకానికి పంపించాడు.

ఇక్కడిలా ఉండగా అక్కడ ధనురాచార్యుడు ధర్మజ సైన్యాన్ని చిందరవందరగా తరిమాడు. నీ కొడుకు దుర్ముఖుడు ధృష్టద్యుమ్నుడితో తలపడి ఘోరంగా పోరి ద్రోణుడికి ప్రీతి కలిగించాడు. ఇరువైపుల నుంచి కుమారవర్గాలు కూడ రంగంలో దూకి పోరినయ్. ఐతే ద్రోణ తీవ్రమారుతానికి పాండవబలగం మేఘంలా చితికిపోయింది. రణరంగం గుర్రాలు, భటుల పీనుగుల్తో నిండి రౌద్ర భీభత్స కరుణ భయానక రసహేతువైంది. రక్తం కాలవలై పారింది.

ద్రోణుడు మహోత్సాహంతో ధర్మరాజు మీదికి బయల్దేరాడు. పాండవబలం బిక్కుబిక్కుమన్నది. ఐతే ధర్మజుడు ధైర్యంగా గురువు మీద రకరకాల బాణాలు ప్రయోగించాడు. ఇంతలో పాంచాల రాజు సత్యజిత్తు ద్రోణునిపై ఎగిసి పది శరాల్తో అతన్ని నొప్పించి మరోపది బాణాల్తో అతని సారథిని గుచ్చాడు. ద్రోణుడతని వింటిని విరిచాడు. సత్యజిత్తు వేగంగా ఇంకో విల్లు తీసుకుని ముప్పై బాణాలేశాడు. వృకుడనే మరో పాంచాల రాకుమారుడు సత్యజిత్తుతో కూడుకుని ద్రోణుడి మీద అరవై అమ్ములు వేశాడు. కళ్లనుంచి నిప్పులు రాలుస్తూ ద్రోణుడు వాళ్లిద్దరి శరీరాల్నీ నిశితశరాల్తో తూట్లు పొడిచాడు. ఐనా వాళ్లు వేగంగా అతని రథాన్ని డీకొట్టి సారథి తూలిపడి కేతనం అల్లాడేట్టు చేశారు. ద్రోణుడు విలాసంగా నవ్వుతూ సత్యజిత్తుని పదిబాణాల్తో గాయాలు చేసి వృకుడి తల ముక్కలు చేసి సత్యజిత్తు వింటిని నరికాడు. అతను భయపడకుండా మరోవిల్లు తీసుకుని తలపడ్డాడు. ఇలా ద్రోణుడు విరచటం, అతను ఇంకో వింటితో ఎదురుతిరగటం మరీ మరీ జరిగాక ఇంకిలా లాభం లేదని ద్రోణుడొక అర్థచంద్రబాణ ప్రయోగంతో అతని తల నరికాడు. ఆ బాహుబలానికి జడుసుకుని ధర్మరాజు పారిపోసాగాడు.

అతని వెంట పడ్డ ద్రోణుడిని విరాటుడి సోదరుడు సూర్యదత్తుడు ఎదుర్కున్నాడు. ఐతే ద్రోణుడతన్ని వెంటనే పరలోకాలకి ప్రయాణం కట్టించాడు. ఏరులై పారే రక్తపు మడుగుల్లోంచి ధర్మరాజుని ద్రోణుడు తరుముతుంటే యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదానుడు, శిఖండి అడ్డుకున్నారు. సాత్యకి, క్షత్రధర్ముడు కూడ వాళ్లతో కలిశారు. అది చూసి ధర్మరాజు వెనక్కి తిరిగి ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు ముందుండగా తనూ ద్రోణుడితో మళ్లీ యుద్ధం ఆరంభించాడు. అప్పుడు మనవైపు రాజులు, రాకుమారులు ద్రోణుడికి సాయంగా వెళ్లారు. ద్రోణుడు వసుదానుణ్ణి క్షేముణ్ణి వేగంగా యముడి దగ్గరికి పంపి మిగిలిన వాళ్లని బాణపరంపరల్లో ముంచెత్తి ధర్మరాజు మీదికి వెళ్తే అతను యుద్ధరంగాన్నుంచి నిష్క్రమించాడు. మిగిలిన వాళ్లూ అతని ధాటికి ఆగలేక బిక్కచచ్చి బిత్తరచూపులు చూస్తూ నిలబడ్డారు.

అదంతా చూస్తున్న దుర్యోధనుడు ఉల్లాసంగా కర్ణుడితో “చూస్తున్నావా, పెనుగాలికి కూలే మొక్కల్లా పాండవసైన్యం ఎలా పారిపోతున్నారో! భీముణ్ణి చూడు ఎలా నీరుగారిపోయి నీరసంగా వున్నాడో! ఇక ద్రోణుడు కనిపిస్తే చాలు ఆ చాయల లేకుండా పోతారీ పిరికిపందలు” అన్నాడు. దానికి కర్ణుడు “అది సరికాదు. నేనిలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు సుమా! పాండవులు అంత తేలిగ్గా ఓడరు. వాళ్లు మహావీరులు. పైగా ఇన్నాళ్లూ వాళ్లకి జరిగిన పరాభవాల్ని తల్చుకుని ప్రాణాలు పోయేవరకు పోరతారు కాని వెనక్కి తిరగరు. వాళ్లు కూడగట్టుకుని ద్రోణుణ్ణి చుట్టుముట్టక ముందే మనం అతనికి సాయంగా వెళ్లటం మంచిది” అని చెప్పాడు. అతనిలా అంటూండగానే ధర్మజ, భీమ, నకుల, సహదేవులు ద్రుపద, విరాట, యాదవ బలాలు తోడు రాగా ద్రోణుడి మీదికి నడిచారు.

ఇలా వచ్చిన పాండవబలం ద్రోణుడిని కప్పేసింది. అతనెక్కడున్నాడో ఎలా వున్నాడో తెలీక నీ కొడుకు కంగారు పడ్డాడు. మనవైపు రాజులంతా వెళ్లి శత్రువుల్ని ఢీకొన్నారు. ద్రోణుణ్ణి చంపాలని వాళ్లూ రక్షించాలని మనవాళ్లూ తీవ్రంగా పోరాడారు. దేవదానవ సంగ్రామాన్ని తలపిస్తూ పోరు ఘోరమైంది.

ఇంతలో నీ కొడుకు ఏనుగు మీద వచ్చి భీముడితో తారసిల్లాడు. భీముడు కోపించి ఆ మత్తేభం కుంభాన్ని మర్దించి దుర్యోధనుణ్ణి బాణాల్తో నొప్పించాడు. అప్పుడు వంగ దేశాధిపతి తన ఏనుగుతో భీముణ్ణి తాకాడు. మహాకోపంతో భీముడా ఏనుగుని కింద పడేసి దాంతో పాటే పడుతున్న వాడి తలని నరికితే అది బంతిలా ఎగిరిపడింది. దాంతో మనబలం కకావికలైంది.

నరకుడి కొడుకు భగదత్తుడు సుప్రతీకమనే తన ఏనుగుని భీముడి మీదికి తిప్పాడు. నీకు తెలుసుగా, ఇంద్రుడా ఏనుగు మీద రాక్షసుల్ని జయించాడొకప్పుడు. ఆ గజం భీముడి మీదికి వెళ్తుంటే పాండవసేన గగ్గోలు పెట్టింది. ఆ భద్రగజం పాండవసేనలో ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రథికుల్ని నుగ్గునుగ్గు చేసింది. వాళ్ల సేనలో మహారథులంతా దాన్ని వారించటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. సాత్యకి అడ్డొచ్చి బాణాలు సారిస్తే అదతని రథమ్మీదికి వెళ్తే అతను లాఘవంగా దూకి తప్పించుకున్నాడు; అతని రథం చూర్ణమైంది. భీముడు, అభిమన్యుడు, యుయుత్సుడు, ఇతర మహాయోధులంతా వీరం బీరమై దిక్కుతోచక నిలబడ్డారు.

అంతకుముందు భగదత్తుడి ఏనుగు చేస్తున్న భీభత్సాన్ని దూరాన్నుంచి విన్న భీభత్సుడు కృష్ణుడితో “మనం అక్కడికి వెళ్లకపోతే ఇప్పుడా ఏనుగుని ఆపటం అక్కడ ఎవరి తరమూ కాదు, త్వరగా అక్కడికి పోదాం పద” అన్నాడు. కృష్ణుడు రథాన్ని అటు తిప్పాడు. ఐతే పద్నాలుగు వేల మంది సంశప్తకులు వాళ్లని చుట్టుముట్టారు. అటు వెళ్లటమా ఇక్కడే ఉండి వీళ్ల అంతు తేల్చటమా అని ఆలోచిస్తూ అర్జునుడు ముందు వాళ్లని చంపటమే యుక్తమని వెనక్కి తిరిగి దివ్యాస్త్రాలతో ఆ బలగాల్ని చించిచెండాడాడు. కృష్ణుడు మళ్లీ పాండవసైన్యం వైపుకి రథం మరల్చాడు. ఐతే ఈసారి సుశర్మ, అతని సోదరులూ కమ్ముకుని, “అర్జునా ఇలా పిలిచిన వాళ్లతో యుద్ధం చెయ్యకుండా వెళ్లటం ధర్మమా?” అంటే, అతను కృష్ణుడితో, “ఏమిటిప్పుడు నా కర్తవ్యం? నువ్వే చెప్పు” అనడిగితే అతను మాట్లాడకుండా రథాన్ని సంశప్తకుల వైపుకి తిప్పాడు. మొహాన చిరునవ్వుతో అర్జునుడు సుశర్మ తమ్ముల్ని త్వరితంగా యముడి దగ్గరికి పంపి అతన్ని మూర్ఛితుణ్ణి చేసి “అటు చూడు, మనసేన పారిపోతున్నది, భగదత్తుడి ఏనుగు వీరవిహారం చేస్తున్నది. త్వరగా అక్కడికి పోనివ్వు” అంటూండగానే మహావేగంగా రథాన్ని అక్కడికి తిప్పాడు కృష్ణుడు. క్షణక్షణానికి దగ్గరౌతున్న అర్జునుడి దేవదత్త శంఖధ్వానం, గాండివ గుణధ్వని, సింహనాదం అన్నీ కలిసి పాండవబలానికి ఊరట కలిగించినయ్.

వస్తూనే అర్జునుడు భగదత్తుడి మీద, అతని ఏనుగు మీద శరవర్షం కురిపించాడు. భగదత్తుడు సుప్రతీకాన్ని అర్జున రథం మీదికి తోలాడు. దాని తాకిడికి కృష్ణార్జునులు మరణించారనే అనుకున్నారందరూ. పాండవబలగం గగ్గోలైంది. భీతుడై కృష్ణుడు రథాన్ని వేగంగా పక్కకి తిప్పితే గుర్రాలు దాన్ని యుద్ధభూమి బయటికి లాక్కుపోయినయ్. అర్జునుడు అవాక్కయ్యాడు. ఐతే కృష్ణుడిని ఏమీ అనలేక గజం వంక చూస్తూ రథం అటు పోనియ్ అని మాత్రం అనగలిగాడు రోషంగా. కృష్ణుడు అలాగే చేశాడు. భగదత్తుడు కృష్ణుడి మీద బాణాలేశాడు. అలిగి అర్జునుడతని విల్లు విరిచి అతని ఒంటికి అనేక బాణాలు నాటాడు. భగదత్తుడు కోపంతో పద్నాలుగు తోమరాలు అర్జునుడి మీద ప్రయోగిస్తే అతను వాటిని పొడి చేసి ఏనుగు కవచాన్ని నుగ్గు చేశాడు.

భగదత్తుడొక శక్తిని కృష్ణుడి మీద వేస్తే దాన్ని మూడు ముక్కలుగా నరికాడు పార్థుడు. అర్జునుడతని గొడుగుని విరిస్తే వాడు అర్జునుడి కిరీటాన్ని కొట్టాడు. ఒకవంక వాడి కదనకౌశలాన్ని మెచ్చుకుంటూనే మరోవంక క్రోధంతో ఏడు క్రూరనారాచాల్తో వాణ్ణి నొప్పించాడు అర్జునుడు. వాడు వీరావేశంతో తన అంకుశాన్ని అభిమంత్రించి అర్జునుడి వక్షానికి గురిచేసి వేస్తే కృష్ణుడు అర్జునుడికి అడ్డుగా నిలబడి ఆ మహాస్త్రాన్ని తన వక్షమ్మీద ధరించాడు. దానికి అర్జునుడు చిన్నబుచ్చుకుని “ఇదేం పని, నా అదృష్టం కొద్ది సారథ్యం చేస్తానన్నావు, చేస్తున్నావు. మిగిలిన పనుల్లో నువ్వు వేలుపెడితే అందరి ముందు నా పరువేం కావాలి? ఐనా ఏమనుకుని ఏం లాభం!” అని నిష్టూరమాడితే, పూర్వం యోగనిద్రలో వున్న విష్ణువుని భూదేవి కామించటం, అతని వరం వల్ల ఆమెకు నరకుడు పుట్టటం, వాడికి వైష్ణవాస్త్రం విధేయం కావటం, అదిప్పుడు భగదత్తుడిది కావటం, దాన్ని తను తప్ప ఇంకెవరూ భరించలేకపోవటం చెప్పి అర్జునుణ్ణి అనునయించాడు. “ఆ దివ్యాస్త్రం వృథా కావటంతో వాడిప్పుడు బిత్తరపోయి చూస్తున్నాడు. ఇదే సరైన అదును. నేను వాడి తండ్రిని చంపినట్టు నువ్వు వాడిని అంతం చెయ్యి” అని అతన్ని ప్రోత్సహించాడు. అర్జునుడు తేరుకుని గాండీవ గుణాన్ని సారించి దృఢముష్టితో ఒక దివ్యబాణం వేస్తే అది కొండల్ని పిండి చేసిన వజ్రాయుధంలా సుప్రతీకాన్ని వధించింది. నేలకూలుతున్న ఆ ఏనుగు మీద నుంచి పడుతున్న భగదత్తుడి శిరస్సుని ఒక అర్థచంద్ర శరంతో తుంచాడు అర్జునుడు.

ఇలా దంతిని, భగదత్తుణ్ణి అంతం చేసి అర్జునుడు అడ్డులేక విక్రమిస్తుంటే శకుని తమ్ములు వృషకుడు, అచలుడు అతని మీదికి దూకారు. అతను వృషకుడి రథాన్ని గుర్రాలు, సారథి, ధ్వజం, ఛత్రం, చామరాలతో సహా నుగ్గు చేస్తే వాడు పరుగున అచలుడి రథం ఎక్కాడు. వాళ్లకి అడ్డంగా వచ్చిన ఐదువందల మంది గాంధారరథికుల్ని అర్జునుడు అమరలోకానికి పంపాడు. ఒకే రథాన్నుంచి వాళ్లిద్దరూ అర్జునుడి మీద బాణాలేస్తే అతనా ఇద్దర్నీ సునాయాసంగా చంపాడు. నీ కొడుకులు కళ్లనీళ్లు కుక్కుకున్నారు.

రోషంతో శకుని అర్జునుడితో తలపడ్డాడు. మాయావి కనుక రకరకాల మాయలు పన్నాడు. దాంతో రాళ్లూ చెట్లూ రకరకాల ఆయుధాలూ అర్జునుడి మీద పడినయ్. సర్పాలు శార్దూలాలు మీద దూకినయ్. ఐతే దివ్యాస్త్రవేది ఐన అర్జునుడి ముందు ఆ మాయలు సాగలేదు. అర్జునుడు నవ్వుతూ “జూదంలో నీ మాయలు పనిచేస్తాయేమో గాని యుద్ధంలో కాదు మామా, ఇక్కణ్నుంచి పారిపో” అంటూ వాలుబాణాలతని శరీరాన నాటితే సిగ్గూలజ్జా లేకుండా శకుని దూరంగా పరిగెత్తాడు. చూస్తున్నవాళ్లంతా గొల్లున నవ్వారు.

అప్పుడు భీముడు, సాత్యకి తన రెండుపక్కల వుండగా అర్జునుడు ద్రోణుడున్న చోటికి బయల్దేరాడు. వీరోత్సాహంతో పాండవసైన్యం కదిల్తే ద్రోణుడి చాటుకి చేరింది మనసైన్యం. దుర్యోధనుడు అందరినీ కూడగట్టుకుని ద్రోణుడికి సాయంగా వెళ్లాడు. పాండవులు, కౌరవులు తలపడ్డారు. ఇంతలో చావగా మిగిలిన సంశప్తకులు, నారాయణగోపాలకులు కూడ కూడకట్టుకుని వచ్చి అర్జునుణ్ణి పిలిస్తే అతను వాళ్లతో యుద్ధానికి వెళ్లాడు. ద్రోణుడు ఎటు వెళ్తే అటు ధృష్టద్యుమ్నుడు అతనికి ఎదురై పోరాటం సాగించాడు. ఎటుచూసినా భీకరసమరమే.

భీమార్జునులు మరోవంక మనసేనని దండిస్తుంటే అందరూ కర్ణా కర్ణా నువ్వే దిక్కని కర్ణుడి దగ్గరికెళ్లారు. అతను వాళ్లకి ధైర్యం చెప్పి అర్జునుడితో తలపడి ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే వారుణాస్త్రంతో దాన్ని వారించాడు ఫల్గుణుడు. భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు కూడ అతనితో ఢీకొన్నారు. అతనా ముగ్గురి విళ్లనీ విలాసంగా విరిచాడు. అర్జునుడతన్ని ఏడుబాణాల్తో నొప్పించి, అతన్ని దాటి వెళ్లి తనతో తలపడ్డ అతని తమ్ములు ముగ్గుర్ని యముడి దగ్గరికి పంపాడు. భీముడు రథం మీంచి దూకి గదతో అతని బంధువులు పదివేలమందిని చెల్లాచెదురు చేసి రథం ఎక్కి మరో వింటితో కర్ణుడి మీదికి బాణాలు సంధించాడు. సాత్యకీ, ధృష్టద్యుమ్నుడు కూడ అతని మీద విరుచుకుపడ్డారు. ఇదిచూసి కర్ణుడికి సాయంగా దుర్యోధనుడు, ద్రోణుడు, సైంధవుడు వచ్చి పాండవ బలగాన్నెదిరించారు. సంగ్రామం ఘోరమైంది. కొంతసేపటికి సూర్యుడు అస్తమించాడు. మనబలాలు ఫల్గుణుడి పరాక్రమాన్ని, ద్రోణుడి ప్రతిజ్ఞాభంగాన్ని చెప్పుకుంటూ వెనక్కి తిరిగినయ్.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!