Endaro Mahanubhavulu Song from Thyagayya Telugu Movie | Chittor V.Nagaia...

త్యాగరాజస్వామి వారి – ఏందరో మహానుభావులు!

(ఈ కీర్తన వింటున్నప్పుడు నా మదిలో మెదిలే భావాలు)
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
భగవత్ సాన్నిధ్యము కోసం కృషి చేస్తున్నవారు,పరమాత్ముని కృపకు పాత్రులైన వారు,సరస్వతీ అనుగ్రహం కలిగిన కళాకారులు,పండితులు,విద్యావంతులు,సమాజ శ్రేయస్సు కోరి మానవ సేవకే తమ జీవితాలను అంకితం చేసిన వారు ఎంతమందో.అటువంటి వారు ఎందరో మహానుభావులు,వారందరికీ నా వందనములు.
చందురు వర్ణుని అంద చందమును హృదయార-
విందమున జూచి బ్రహ్మానందమునను భవించు వారెందరో-
చల్లని స్వామి కరుణాపయోనిధి అయిన శ్రీ రామచంద్రుని రూపమును గుణగూణాలను మనస్సనేడి అరవింద పుష్పమున చూచి ఆనందమును అనుభవించు వారందరికి నా వందనములు.అయితే నాకు చంద్రుని వలే శ్రీరామచంద్రమూర్తి చల్లని స్వామి అనడం కన్నా రామయ్య తండ్రి కృపను సంతరించుకుని చల్లనివాడయ్యడు చంద్రుడు అనటంలో నాకేక్కువ సంతోషాన్నిస్తుంది.
సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులెందరో-
ఈ చరణంలో సంగీత ప్రియుడివైన నిన్ను తమ మనస్సులలో నిలిపి అరాధిస్తున్న ధన్యమూర్తులైన (వారెందరో మహనుభావులు వారందరికి నా వందనములు)…అన్న ఒక అర్ధము మరియు తమ సంగీతంతో నిన్ను అరాధిస్తూ ధన్యులవుతున్న (వారెందరో మహానుభావులు..వారందరికి నా వందనములు) అన్న అర్ధము ఇలా రెండు విధాలుగా అర్ధము తీసుకోవచ్చునని నాకు అనిపించింది ఎందుకంటే సరస్వతీ అనుగ్రహం కలిగిన పండితులు,సంగీత విధ్వాంసులు కొద్ది మందే.కాని భగవదనుగ్రహానికి అందరూ పాత్రులే.వీళ్ళనే అనుగ్రహిస్తాను,వీళ్ళని ఆదరించను లాంటి పరిమితులేవీ భగవంతునికుండవు.అందరూ ఆయన కృపకు పాత్రులేనని నా ప్రగాఢమైన నమ్మకం.
మానస వన చర వర సంచారము సలిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో-
ఒకప్పుడు చంచలమైన మనస్సును ఇప్పుడు నీ కృపాకటాక్షములతో తమ ఆధినములోనికి తెచ్చుకుని నిన్ను పూజించిన వారేందరో మహానుభావులు వారందరికీ నా వందనములు.
సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో
తమ హృదయకమలమును నీ పాదపద్మములకు అర్పించి ధన్యులైన వారెందరో…వారందరికి నా అభివందనములు.
హరి గుణ మణిమయ సరములు గలమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో
చెలిమితో కరుణ గల్గు జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వారెందరో
హరి గుణములనెడి రత్నాభరణములను ధరించి శోభిల్లు భక్తకోటులీలో తమ ప్రేమతో,స్నేహముతో,తెలివితో,దయతో,జగమున మానవ సేవే మాధవ సేవన్న పరమార్ధమును,భగవద్ ప్రేమామృతమును నింపుతున్న వారెందరో,వారందరికీ నా వందనములు.
పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందనా
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
పవనసూను అర్ధచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక
పరమ భాగవతోత్తములైన మునివరులు,సూర్య చంద్రులు,సనక సనందాదులు,దేవతలు,దిక్పాలకులు,కింపురుషులు,హిరణ్యకశిపుని తనయుడైన ప్రహ్లాదుడు,నారదుడు,తుంబురుడు,వాయు పుత్రుడైన హనుమంతుడు,అర్ధచంద్రధరుడైన పరమ శివుడు,శుకుడు,ఫద్మము నుండి వుద్భవించిన వాడైన బ్రహ్మదేవుడు,బ్రాహ్మణులు,వీరు కాక పరమ పావనులు,గొప్పవారు బ్రహ్మానందమును అనుభవించువారు ఎందరో మహానుభావులు,వారందరికి నా వందనములు.
భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణము మర్మములను శివాది సన్మతముల
గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి భావ రాగ లయాది
సౌఖ్యముచే చిరాయువుల గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో-
భాగవతము,రామయణము,భగవద్గీతాది శ్రుతి శాస్త్ర పురాణాములలోని రహస్యములను,ఇతర మతములలోని మంచిని,ముప్పై మూడు కోట్ల దేవతల మదిలోని భావములనెరిగి,సంగీతములోని ఆనందమును అనుభావించుచూ,ధీర్ఘాయుష్మంతులై సుఖ సంతోషములతో జీవించుచూ త్యాగరాజస్వామికి ఆప్తులైన వారెందరో మహాను భావులు.వారందరికి నా వందనములు.
ప్రేమ ముప్పిరి గొన్న వేళ నామము దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనూతుని నిజ దాసులైన వారెందరో
త్యాగరాజస్వామి ప్రియతములు అనుచరులు శిష్యులు అయినవారు నీ పట్ల ప్రేమను పెంచుకుని రామభక్తులైన వారెందరో మహానుభావులు.వారందరికి నా వందనములు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!