ఉగాది ప్రాశస్త్యం.!

ఉగాది ప్రాశస్త్యం.!

పరిమళాలు,ఉగాది పచ్చడి,పంచాంగ శ్రవణం- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం,

రుతువులు మారుతుంటాయి…వాటితోపాటే అవి మనకు పంచిచ్చే అనుభూతులూ మారుతుంటాయి. అందుకే ప్రకృతి ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది.

శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. పచ్చగా కళకళలాడుతుంటాయి. రుతువుల్లో వసంతం మనోహరమైనదీ ఆహ్లాదకరమైనదీనూ. రుతువుల్లో వసంతరుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకుని తొలిరుతువుగానూ చెబుతారు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అంటోంది బ్రహ్మపురాణం. అదే యుగాది. అన్నీ తొలిగా వచ్చే ఆ రోజే తెలుగువారి తొలిపండగ… ఉగాది!

రామపట్టాభిషేకం జరిగిందీ , శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ , కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు. ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలిమాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ , ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్రశుద్ధపాడ్యమినే నూతన సంవత్సర ఆరంభదినంగా కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకుంటారు. సౌరమానాన్ని పాటించే తమిళులు, మలయాళీలు, బెంగాలీలు, సిక్కులు చేసుకునే ఉగాది కూడా వసంతంలోనే రావడం విశేషం.

ఉగాది పచ్చడి

శాతాయుష్యం వజ్రదేహం దదాత్యర్ధం సుభాని చ

సర్వారిష్ట వినాశంచ నింబ కందళ భక్షణం

ఈ పండగ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మామిడిపిందెలు, వేపపువ్వు, కొత్తబెల్లం, చింతపండు, పచ్చిమిరప, ఉప్పు వేసి చేసే ఈ పచ్చడిలోని ఆరురుచులూ జీవితంలోని సుఖదుఃఖాలకు ప్రతీకలు. ఈ జీవనతత్త్వం సంగతెలా ఉన్నా వేసవి ఆరంభంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలోని వాత, కఫ, పిత్త దోషాలేమయినా ఉంటే పోతాయంటోంది ఆయుర్వేదం. వేపపువ్వులో యాంటీసెప్టిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. క్రిములనీ చర్మరోగాలనీ నివారించే శక్తీ ఉంది. మామడిముక్కలు రక్తప్రసరణదోషాలను నివారిస్తాయి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్తబెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతువాపు వంటి దుర్లక్షణాలను అరికడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా చూసే పని ఉప్పుది. కొత్తకుండలోనే ఈ పచ్చడిని చేయడంవల్ల అది చల్లగా ఉంటుంది. వీటితోపాటు చెరకుముక్కలు, అరటిపండు… కూడా కలుపుతుంటారు కొందరు.

అయితే ధర్మసింధు వంటి గ్రంథాలు అసలు ఉగాది పచ్చడి ఇది కాదంటాయి.

ఈ పచ్చడిని పూర్వం ‘నింబ కుసుమ భక్షణం’ అనేవారట. రుతుమార్పు కారణంగా వచ్చే అన్ని ఇబ్బందులూ తొలగిపోవాలంటే ఉగాదిపచ్చడిలో మామిడిచిగురూ, అశోకవృక్షం చిగుళ్లూ కూడా కలపాలట. అందుకే దీన్ని ‘అశోక కళికా ప్రాసనం’ అనేవారట.

‘త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ

నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’

(నేను జీవిత సమస్యలతో బాధపడుతున్నాను. ఓ అశోకమా! ఈ మధుమాసంలో నీవు చిగురించి కళకళలాడుతున్నట్లుగా నా జీవితానికి కూడా సుఖసంతోషాలు కలిగించుమా) అనే మంత్రం చదువుతూ దీన్ని తినాలట. అదీ ఒక్క పండగరోజే కాదు. శ్రీరామనవమి వరకూ అంటే తొమ్మిదిరోజులపాటు తినాలట. కాలక్రమంలో మామిడి చిగుళ్లు పోయి ముక్కలొచ్చాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!