'పల్లెటూరి పిల్ల"!

'పల్లెటూరి పిల్ల"!

.

కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమాకు రెండు కళ్లుగా నిలిచిన తెలుగు సినీ దిగ్గజాలు ఏఎన్నార్, యన్టీఆర్ కలిసి నటించిన తొలి సినిమా 'పల్లెటూరి పిల్ల'. అందుకే, ఈ చిత్రం తెలుగులో తొలి మల్టీస్టారర్ గా పేరు తెచ్చుకుంది. ప్రముఖ దర్శకుడు బి.ఏ.సుబ్బారావు ఈ చిత్రంతోనే దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కథను బట్టి ఈ చిత్రానికి కథానాయిక పాత్రను సూచించేలా పేరు నిర్ణయించినప్పటికీ, అన్ని పాత్రలకూ ఇందులో సమాన ప్రాధాన్యత వుంటుంది. అంజలీదేవి టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రాన్ని రిచార్డ్ షెరిడాన్ రాసిన 'పిజారో' అనే ఆంగ్ల నాటకం ఆధారంగా నిర్మించారు.

ఇక కథ గురించి చెప్పాలంటే, ఇదొక జానపద కథ. శాంత పల్లెటూర్లో పెరిగే స్వచ్చమైన పిల్ల. ఆ ఇంటి దగ్గరలో వుండే వసంత్ అనే కుర్రాడు ఆమెను ప్రేమిస్తాడు. అయితే, ఆ విషయం ఆమెకు చెప్పలేకపోతాడు. ఇదిలా వుంటే, కంపన దొర అనే ఓ దుర్మార్గుడు చుట్టుపక్కల ఊళ్ల మీద పడి, తనకు కప్పం కట్టమని బెదిరిస్తూ, చేతికి దొరికింది దోచుకుపోతూవుంటాడు. జయంత్ అతనికి ముఖ్య అనుచరుడు. ఓసారి జయంత్ తన మనుషులతో వచ్చి శాంత గ్రామంపై పడి, డబ్బు తెమ్మంటాడు. ఆ దుర్మార్గాన్ని శాంత ధైర్యంగా ఎదుర్కొంటుంది. జయంత్ ను చెంప మీద కొట్టి, పేదల్ని దోచుకునే ఈ దుర్మార్గాలు ఏమిటంటూ నిలదీస్తుంది. దాంతో అతనిలో పరివర్తన వస్తుంది. కంపనను వదిలి గ్రామానికి వచ్చి నీతిగా బతకాలనుకుంటాడు.

జయంత్, శాంత ప్రేమలో పడతారు. అది చూసి తట్టుకోలేని వసంత్ అకారణంగా జయంత్ ని కొడతాడు. అప్పుడు శాంత అడ్డొచ్చి తన ప్రేమ బయటపెడుతుంది. అది అర్ధం చేసుకున్న వసంత్ వీరిద్దరికీ పెళ్లిజరిపిస్తాడు. కొన్నాళ్లకు వీరికి ఓ బాబు పుడతాడు. ఈ విషయం తెలుసుకున్న కంపన వీళ్ల ఊరిపై దాడి చేసి బీభత్సం సృష్టిస్తాడు. అడ్డొచ్చిన ఊరి పెద్ద 'తాత'ను హతమారుస్తాడు. జయంత్ ను, కొడుకును ఎత్తుకుపోతాడు. ఆ క్రమంలో వసంత్ ను శాంత అనుమానిస్తుంది. అది భరించలేని వసంత్ కంపన ప్రదేశానికి వెళ్లి జయంత్ ని, పిల్లాడిని విడిపించి, ఆ పోరాటంలో తను ప్రాణాలు కోల్పాతాడు. అలా వసంత్ వారి మనసులలో త్యాగశీలుడిగా నిలిచిపోతాడు.

ఈ కథలో శాంతగా అంజలీదేవి నటించగా, వసంత్ గా అక్కినేని, జయంత్ గా యన్టీఆర్, తాతగా యస్వీ రంగారావు, కంపనగా ఏవీ సుబ్బారావు నటించారు. నల్ల రామమూర్తి , సీతారం హాస్యపాత్రలు పోషించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, మొదట్లో వసంత్ పాత్రకు ఈలపాట రఘురామయ్యను తీసుకుని, కొంత షూటింగు కూడా చేశారు. అయితే, సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో, ఆయన 'నేను చెయ్యలేను బాబూ' అంటూ తప్పుకోవడంతో, ఆ స్థానంలో అక్కినేనిని తీసుకున్నారట!

ఆదినారాయణరావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు హాయిగా సాగుతాయి. 'పల్లెసీమల బ్రతుకే ఆనందమోయీ...', 'శాంత వంటి పిల్లలేదోయీ...', 'వీరకంపనా...ధీరకంపనా...' అంటూ సాగే పాటలు పాప్యులర్ అయ్యాయి. ఘంటసాల, పిఠాపురం, జిక్కీ వీటిని పాడడం జరిగింది. తాపీ ధర్మారావు సంభాషణలు రాసిన ఈ చిత్రం 1950 ఏప్రిల్ 27 న విడుదలై విజయం సాధించింది. ఆరు కేంద్రాలలో వంద రోజుల ప్రదర్శన కూడా పూర్తి చేసుకుంది. తదుపరి కాలంలో యన్టీఆర్, ఏఎన్నార్ కలిసి సుమారు 13 సినిమాలు చేయడానికి ఇది బీజం వేసింది.

ఈ చిత్రాన్ని జెమినీ వాసన్ 'ఇన్సానియత్' పేరుతో హిందీలో రీమేక్ చేశారు. దిలీప్ కుమార్, దేవానంద్, బీనారాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్కడ కూడా విజయం సాధించడం విశేషం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!