మా అక్క గారి పద్యాలు !మొక్క నాట రండి మేలు కలుగు! రచన .. శ్రీమతి తరణి కంటి (వింజమూరి ) సూర్య లక్ష్మి

మా అక్క గారి పద్యాలు !

(శ్రీమతి తరణి కంటి /వింజమూరి సూర్య లక్ష్మి స్వయానా మా అక్కగారు .. వారు వ్రాసిన కొన్ని పద్యాలు మీకు అందిస్తున్నాను .)

మొక్క నాట రండి మేలు కలుగు!

రచన .. శ్రీమతి తరణి కంటి (వింజమూరి ) సూర్య లక్ష్మి

.

1. శ్రీలు పొంగు వారు శిరులొలి కేభూమి 

వనములెన్నొ గలిగి వెలుగు భూమి

నాటికైభవంబు నేడు తలచుకుంటు

మొక్క నాట రండి మేలు కలుగు.

.

2. వాన లెట్లు కురియు వనములు లేకుండ (నరకంగ) 

పంట లేల పండు పడక వాన 

ఎట్లు బతుక గలరు పంట లేక జనులు 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

3. అడవి సంపదంత అణగారి పోకుండ 

ముందు తరములకును మేలు గలుగ 

అడవు లవసరంబు అమలుజేయవలయు 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

4. మూడు కాళ్ళ ముసలి మొక్కలు నాటంగ 

జనుల కపుడు వింత గాను దోచె 

నాటి మొక్క లన్ని నేడు వృక్షాలయ్యె 

మొక్క నాట రండి మేలు కలుగును.

5. అడవులన్ని పలుచ బడిపోవు చుండగ 

జంతుజాల మంత అంతరించు.

మానవళికలను ముప్పు వాటిల్లదా? 

మొక్క నాట రండి మేలు కలుగును. 

.

6. ప్రకృతి సహజమైన పనులు చేయుమెపుడు 

చదురు మదురు దాన్ని చెయకెపుడు.

సహజ సంపదంత సమతుల్య మై యుండ

మొక్క నాట రండి మేలు కలుగును. 

.

7. వేటలాడవద్దు వనవిహంగంబుల

వేటలాడవద్దు వనమృగములు 

వన్య మృగ విహంబు వనములకు వెలుగు

మొక్క నాట రండి మేలు కలుగును. 

8. వనములెన్నొ పెంచి వనమహోత్సవములు

చక్కగాను మనము జరుపుకొన్న 

వన్య మృగములన్ని వేడుక విహరించు 

మొక్క నాట రండి మేలు కలుగును.

.

9. మానవ మనుగడకు వనములే రక్షణంబు 

వన్యసంపదంత వాడుకొనగ

వనములెన్నొ పెంచి వనరులు కూర్చగ 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

10.మానవళి బతుకు వనములుంటే సాగు

వన్యరక్షణంబు మనకు రక్ష 

జీవకోటియంత జాగృత మై యుండ 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

11. పట్టు కొమ్మలనగ చెట్లు పక్షులకును 

చెట్ల పైన గూళ్ళు కట్టి బతుకు 

పక్షిజాలమునకు పరిరక్షణంబుగ 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

12. చెట్ల పెంపకంబు చేయకున్నాగాని 

చెట్ల విలువ దెలుసుకుంటె చాలు 

ఛెట్లున రుకకంటె చేకూరు ఫలములు

మొక్క నాట రండి మేలు కలుగు.

.

13. ముందుచూపులేని మానవులను జూచి 

వన్యమృగములన్ని వణుకు చుండె

వారసత్వములగు వనములు నరుకంగ 

మొక్క నాటరండి మేలు కలుగు.

.

14. అంతరించు చున్న అడవి బతుకుజూచి

అలమటిస్తు ఏడ్చె అడవి తల్లి 

ఎంత దారుణంబు ఎంత ఘోరంబని 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

15. కామధేనువంచు కల్పతరువుయంచు 

చెట్లు దైవ మంచు చెట్ల గొలచె 

నాడు జనులు, వేడ్క, నాటి విల్వనెరుగ

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

16. బాట పక్క చెట్లు బాగుగా పెంచిన 

నీడ నిచ్చు బాట నడచు వార్కి 

చెట్లు నిలువ దెలుప చెప్పతరము గాదు 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

17. ఎండలోన చెట్లు ఎంత హాయి గొలుపు 

ప్రాణ వాయులిచ్చి ఫలము లొసగు 

చెట్లు చేయు మేలు చెప్పతరము గాదు 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

18. ముందు చూపు తోడ మొక్కలు నాటంగ 

ముందు తరములకును మేలు కలుగు 

మొక్క విలువ నెరిగి ముందు నడువగలిగాను 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

19. చెట్ల పెంపకంబు చేపట్టినాగాని 

మరొకమూల నుండి నరుక చెట్లు

ఎమి ఫలితముండు ఎన్ని చెట్లను పెంచ 

మొక్క నాట రండి మేలు కలుగు.

20. అడవులెన్నొ పెంచ అగచాట్లు పడుచున్న 

చాటుమాటు నరుకు చుండె చెట్లు 

చెట్లు నరుక కుండ చూసుకుంటు మనము 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

21. జ్ఞానమంత లేక అజ్ఞానమున ముల్గి 

చెట్ల విలువ నెరుగజాలకున్న 

చెట్ల విలువ దెలియజెప్పవలసియుండు

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

22. ఇంట నొక్క మొక్క నాట ప్రతినబూని 

మొక్క నాటి నీరు పోసి పెంచు

ఇంట నొక్క చెట్టు ఇలవేల్పు మనకంటు 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

23. నాటి మహా ఋషులకు నెలవులు వనములు 

వన్య రక్షణంబు వారు జేసె 

భీతి లేక తిరిగె జంతువు లలనాడు 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

24. చుట్టు పక్కలన్ని చెట్లు చీమలతోడ 

కంటికింపు గాను కనపడంగ 

ఫరిసరాలు పచ్చ పచ్చగా నుంచగా 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

మా అక్క గారి పద్యాలు !

(రెండవ భాగం.)

మొక్క నాట రండి మేలు కలుగు!

రచన .. శ్రీమతి తరణి కంటి (వింజమూరి ) సూర్య లక్ష్మి..

.

25. తరులు తరిగిపోవ గిరులపట్టు సడలు 

ప్రకృతి సహజ మంత పట్టు దప్పి 

ఇలకేమి ముప్పు గలుగునో తెలుసుకో 

మొక్క నాట రండి మేలు కలుగు.

26. అడవి రక్షణంబు అమలు జరిపినంత

అవని జనులమేలు అమలు జరుగు 

మానవాళి బతుకు మేలు కొలుపగాను 

మొక్క నాట రండి మేలు కలుగు.

27. వన్య మృగములకును వసతి కూర్చంగాను 

వనములెన్నొ పెంచ వలయు నేడు. 

వనమహోత్సవాల వేడుకలు జరుప 

మొక్క నాట రండి మేలు కలుగు.

28. మొక్క నాటి మనము ముద్దుగా పెంచిన 

పెద్దగాను పెరిగి ఫలము లొసగు 

నీడ నిచ్చి మన ఋణము దీర్చగ జూచు 

మొక్క నాట రండి మేలు కలుగు. 

29. ప్రకృతి సహజమైన పనులు చేయంగాను 

భువిని జనులు సౌక్య మొందగాను 

అడవులవసరంబు ఆలోచనలు చేయ 

మొక్క నాట రండి మేలు కలుగు. 

30. కుండపోత వాన, కురియ, వాగులనిండ 

వన్య మృగము లకును మేలు గలుగ

అడవు అవసరంబు అమలుచేయంగాను 

మొక్క నాట రండి మేలు కలుగు.

31. ఆటవికుల కడవి ఆరాధ్య దైవంబు

కౌన తల్లి వార్కి కన్న తల్లి 

వారి బతుకు బాట వనముతో యనగాను 

మొక్క నాట రండి మేలు కలుగు.

32. దేవతలనుగొల్వ, దేవతలను జూడు

చెట్టు చేమలందు జక్క గాను

పూజ యనగ చెట్ల పెంపకమే గద

మొక్క నాట రండి మేలు కలుగు.

33.విసిరి చెట్టు గలిగి వున్న వనము నందు,

విందు భోజనాలు, వేడ్క తోడ 

కలసి చేయు జనులు కార్తీకమాసాన 

మొక్క నాట రండి మేలు కలుగు.

34.రావి చెట్టు అతి పురాత కాలము నాడె 

జనులు దైవ మనుచు జరిపె పూజ 

ఓషధీ గుణములు ఉన్నవీ చెట్టుకు 

మొక్క నాట రండి మేలు కలుగు.

35.గీత చెప్పె రావి ఎంత పునీతమో 

మహిని రావి చెట్టు మహిమ లెన్నో 

జ్ఞాన బోధ గలిగె గౌతము నికిచట

మొక్క నాట రండి మేలు కలుగు.

36.ఔషధ గుణములకు ఆయువ నగవేప 

వేపచెట్టు గాలి వీచగాను 

పరిసరంబులన్ని పరిశుద్దతను గాంచు 

మొక్క నాట రండి మేలు కలుగు.

37.పుణ్య చరిత తరువు పుడమి రక్షణసేయు 

ఆయు విచ్చు తరువు అవని కెంతొ 

మహిని తరువులున్న మానవాళి బతుకు 

మొక్క నాట రండి మేలు కలుగు.

38.శాస్త్రవేత్త లంత సకల మొక్కలకును 

జీవమున్న దనుచు జెప్పెగాన 

పచ్చనైన మొక్క పెరుకంగ పాపము

మొక్క నాట రండి మేలు కలుగు.

39. కన్నతల్లి తరువు కల్ప వృక్షమనగ 

కామధేనువనగ కల్పవల్లి 

కనికరంబు లేక కొత్తవద్దు తరువు 

మొక్క నాట రండి మేలు కలుగు.

40. చెప్పలేని బాధ చెట్ల ఆవేదన

చెట్లు నరుకు నరుల జూస్తు కూడ

నోరు మెదపలేక నరకయాతన పడు

మొక్క నాట రండి మేలు కలుగు.

41. వ్యాధి దొలగ జేయు వనమూలి కలతోడ 

వైద్య మొసగు చుండు వైద్యులంత 

వైద్య సంపదెంతొ వనములందు దొరకు 

మొక్క నాట రండి మేలు కలుగు.

42. మునులు తపము జేయ వనరక్షణము జేసె

నాడు రాజులంత నేర్పుతోడ

వనమృగములు పెరుగ వాటినే వేటాడె

మొక్క నాట రండి మేలు కలుగు. 

43. అడవి మృగములన్ని అదుపు లేక పెరగ 

దాపునున్న వూర్ల దాడి చేయ 

వాటి నదుపు చేయ వేటాడె రాజులు 

మొక్క నాట రండి మేలు కలుగు.

44. నీటి బాట బోవ నావసరంబు

కాల్వ గట్టు దాట బల్లకట్టు 

వీటి కవసరపడు వలసినంత కలుప 

మొక్క నాట రండి మేలు కలుగు. 

45. పీట, కుర్చీ, బల్ల, పట్టెమంచాలను 

గృహపరికరములకు కలుపనిచ్చు 

కల్పతరువులనీగ కలుప వృక్షాలన్ని 

మొక్క నాట రండి మేలు కలుగు. 

46 మానులవసరంబు మానవళి బతుక 

జంతు జాలమునకు జీవ కర్ర

అవసరంబు కట్టె శవదహనమునకై 

మొక్క నాట రండి మేలు కలుగు.

47. చేరు పక్షి లెన్నొ చెట్టు ఒకటి వున్న 

చెట్టు నాశ్రయించి కట్టు గూళ్ళు 

తిండి కొరకు నేగి తిరిగి గూటికి చేరు 

మొక్క నాట రండి మేలు కలుగు.

48. చెట్టు మనము విడిచు చెడ్డగాలిని పీల్చి 

మంచి గాలిని మన కిచ్చు గాదె 

ఎండకు తను మాడి నీడనిచ్చు మనకు 

మొక్క నాట రండి మేలు కలుగు.

49.పుల్ల లేర బోవ పండు ముసలి అవ్వ 

అడవి లోన యంచు, అమ్మ జెప్పె 

వింత కధల నెన్నొ, వాటి అర్థ మెరుగ 

మొక్క నాట రండి మేలు కలుగు.

50.వన్య మృగ విహంబులకు వనచరులకు

మానవాళి కొరకు మేలు గోర 

శాంతి సౌక్యములను సంతరించుకొనగ 

మొక్క నాట రండి మేలు కలుగు.

51. వ్రాస్తి పద్యములను వన్యదేవతలారా 

అంకితంబు మీకు అందుకొనుము 

భువిని జనులు శాంతి బడయ, దీవించగా 

మొక్క నాట రండి మేలు కలుగు.

x

Comments

  1. శ్రీమతి సూర్య లక్ష్మి గారికి అభినందనలు.పంచుకున్న మీకు ధన్యవాదాలు .నేటి అవసరానికి తగిన ఈ కవితల శతకం పూర్తి చేస్తే బాగుంటుందని నా కోరిక. మరిన్ని మంచి కవితలు ఆవిడ అందిచాలి.దీనిని మీరు కేవలం బ్లాగ్ కే పరిమితం చెయ్యక తెలుగు -వెలుగు లాటి పత్రిక కు పంపితే మరింతమంది చదువుతారు .డా .సుమన్ లత రుద్రావఝ్జల

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!