‘అబ్బే! ఏమైనా సానిసానే’’

మహాకవి విశ్వనాథ సత్యనారాయణగారు , ఆయన చతురతకు అద్దం పట్టే 

ఓ సంఘటన గురించి...వారి మాటల్లోనే

"‘నేను కిన్నెరసాని పాటలు వ్రాసేనాటికే గొప్పకవినని అభిమానించిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు నాకు సహాయం చేయించాలని కొందరు సంస్థానాధీశుల వద్దకు తీసుకొనిపోయారు.

ఆ రోజుల్లో నైజాం యిలాకా జమీందారులకు సివిల్ క్రిమినల్ అధికారాలుండేవి. సరే! అందరిసంగతీ అలావుంచుదాం ఒక సంస్థానాధీశుని యింటికి తీసుకువెళ్ళారు.

ఆ జమిందారు చనిపోయి కొద్దికాలమైంది. ఆయనగారి రాణివుంది. 

పరదా చాటున ఆమె ఇవతలనేను. నన్ను ఆమెకు పరిచయం చేశారు.

ఆమె విజ్ఞురాలని నాకు చెప్పారు. 

ఆమె పరదా చాటునుండి ‘‘కవిగారూ! మీరు సంప్రదాయబద్ధంగా వ్రాస్తారన్నారు. కాని సానిపాటలు వ్రాశారేమిటి?’’ అన్నది.

నేను ఎంత పొగరుబోతునైనా వినయం తక్కువైనవాణ్ణి కాదుగదా!

‘‘అమ్మా! ‘కిన్నెరసాని’ అన్నది ఒక వాగు పేరు కదా!

దానిపేరుతో దాని గురించి వ్రాయడంలో తప్పేమిటి’’ అన్నాను.

ఆమె ఊరుకోవచ్చు! ‘
‘అబ్బే! ఏమైనా సానిసానే’’ అన్నది. పరదాలోపల పెదవి విరుచుకొని వుంటుంది. 

నేను వెంటనే ‘‘అలాగా అమ్మా! ఇందాకటి నుండి తమను తమ పరిచారకులు

దొరసానిగారు దొరసానిగారు అంటే ఏమో అనుకున్నాను. ఇక సెలవు. వస్తాను’’ 

అని చరచరా బైటికి వచ్చేశాను. 

అక్కడనేవున్న శ్రీ రెడ్డిగారు, మరొక దేశ్ ముఖ్ గడగడలాడి పోతూ ఆమెకేమో చెప్పుకొని బయటకు వచ్చారు. 

‘‘ఇవ్వాళ ఎంతపని చేశావయ్యా! ఆమె నిన్ను అరెస్టు చేయవచ్చు. ఏమైనా చేయవచ్చు

. నీపని ఏమయ్యేది! మా పని ఏమయ్యేది’’ అన్నారుట. 

‘‘ఏమయ్యేది! చంపుతుందా! అదేనయం. యథార్థం చెప్పడానికి భయపడడం కన్నా

అది నయం కదూ! శబ్దానికి అర్థం తెలియని ప్రతివాడూ విమర్థకుడైతే చచ్చిన చావుకదండీ! 

తమ బ్రతుకే తమకు తెలియనివాళ్ళు కవుల తప్పులెన్నే వాళ్ళా? 

ఆమె మహాపతివ్రత. కాని తెలుగు పలుకులలో ఆమె దొరసాని. సందర్భం నుండి పదాలను విడగొట్టి కవుల తప్పులెన్నే వాళ్ళనిచూస్తే నాకు ఒళ్ళుమంట’’ అన్నాను

. అప్పుడు రెడ్డిగారు నవ్వుతూ కారులో కూర్చొని అన్నారు ‘‘ఏమైతే ఏం ఇవాళ నూటపదహార్లు పోగొట్టుకున్నారు’’ అని

. నా అభిమానం పోగొట్టుకోలేదు. అదే నాకు పదివేలు అన్నానునేను.

అప్పుడు నాకుద్యోగం లేదు. ఇల్లు గడవడం చాలా కటకటగావుంది. 

నా అభిమానం నన్ను ఎవరికీ తలవంచనీయదు.

నన్ను పొగరుబోతు అంటారు గిట్టనివాళ్ళు. అననీయవోయ్ నా జన్మే అంత."

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!