దైవం చేసే పని....బామ్మ చెప్పిన కధ.!

దైవం చేసే పని....బామ్మ చెప్పిన కధ.!

పూర్వం ఓ దేశంలో ఒక రాజుగారికో సందేహం వచ్చింది. వెంటనే తన మంత్రిని పిలిచి "అమాత్యా! నా సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు. మీరు మంత్రులుగా నాకు సలహాలు ఇస్తున్నారు. వర్తకులు వర్తకం చేస్తున్నారు. అధ్యాపకులు పాఠాలు చెపుతున్నారు. ఇలా ప్రతివ్యక్తి తనకి కేటాయించిన పనిని చేస్తున్నాడు. నా సందేహం ఏమిటంటే, "సృష్టికర్త అయిన ఈ దైవం చేసే ప్రధానమైనపని ఏమిటి?" అని.

రాజుగారికి వచ్చిన సందేహాన్ని తీర్చటానికి మంత్రివర్యులు "రాజగురువు"ను పిలిపించి రాజుగారి సందేహము తీర్చమని అడిగాడు. రాజగురువు వెంటనే సమాధానము చెప్పక ఓ వారము రోజులు గడువు తీసుకుని బయటపడ్డాడు. కాని, ఆరురోజులయినా రాజుగారి సందేహానికి సరైన సమాధానము స్పురించక, ఆలోచిస్తూ, నగరము బయట అశాంతిగా తిరుగుతున్నాడు. అక్కడ రాజగురువును ఓ ఆవులు కాచుకునే కుర్రవాడు చూచి " స్వామీ! మీరు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. కారణం తెలుసుకోవచ్చా?" అని నమస్కారము చేసి మరీ అడిగాడు. ఆ కుర్రవాడు వినయము చూసి ముగ్ధుడయి, ఆ రాజగురువు తన సమస్యకు అతనివల్ల సమాధానము బహుశ: భగవంతుడు పంపించి వుంటాడని తలంచి, తన సమస్యని వివరించాడు. అప్పుడాకుర్రవాడు " స్వామీ! ఈ ప్రశ్నకు సమాధానము నాకు బాగా తెలుసు. రాజుగారిని నన్ను రాజసభకు పిలిపించే ఏర్పాటు చూడండి" అని చెప్పాడు. రాజగురువు ఆ కుర్రవానియందు విశ్వాసముతో రాజుగారిని దర్శించి, "రాజా! మీ ప్రశ్నకు సమాధానము ఆ ఆవులు కాచే కుర్రవాడు చెపుతాడు. మీరు అతనిని సభకు అహ్వానించండి" అని తెలిపాడు. రాజు భటులని పంపి ఆ కుర్రవానిని రాజసభకు అహ్వానించాడు. రాజసభలో ఆ కుర్రవాడు " రాజా! మీ ప్రశ్నకు సమాధానము నేను చెపుతాను. కాని అడిగేవారు మీరు కాబట్టి, మీరు శిష్యుని స్థానంలో వున్నారు. చెప్పేవాడిని నేను కాబట్టి నాది గురుస్థానము. గురువు అగ్రస్థానములో కుర్చోవాలి కదా!" అన్నాడు. రాజు అతని మాటలు గ్రహించి, తన ప్రశ్నకు సమాధానము తెలుసుకోగోరి, తన సింహాసనము మీద అతని అధిష్టింప చేశాడు. రాజసింహాసనము మీద అధిష్టించి ఆ కుర్రవాడు ఇలా చెప్పాడు.

"రాజా! దైవము చేసే ప్రధానమైన పని ఇదే! అహంకారులను క్రింద కూర్చోపెట్టడము, అణకువతో ఉండేవారిని ఉన్నతస్థానములకు చేర్చటము." అని చెప్పి తనదారిని తాను వెళ్ళిపోయాడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!