సప్తసముద్రాలు దాటి వచ్చిన వాడు ఇంటి ముందు నీటి గుంట లో పడ్డాడట. !

సప్తసముద్రాలు దాటి వచ్చిన వాడు ఇంటి ముందు నీటి గుంట లో పడ్డాడట. !

.

(గల్పిక...కృష్ణప్రియ..)

.

సాయంత్రం లాప్ టాప్ షాపు కట్టేసి ఇక కాస్త సాయంత్రపు నడక కి బయల్దేరదామని లేచి అరడుగు ఎత్తు నుంచి దబ్బున కూలి పడి పాదం ఎముక విరగ్గొట్టుకున్నాను. ఓ రెండు గంటల్లో ఎక్స్ రే లూ, సిమెంట్ కట్టూ అన్నీ అయి, మళ్లీ అదే సోఫా లోకి వచ్చి పడ్డాను. మా వారూ, పిల్లలూ కూర్చో పెట్టి మంచి నీళ్ల దగ్గర్నించీ చేతికిచ్చి .. ‘ఆహా.. ఇంత రాజ భోగం ఉంటుందని తెలిస్తే ..ఎప్పుడో పడేదాన్ని..కనీసం కాలు బెణికిందనో, చేయి గుంజిందనో చెప్పైనా ఎన్ని సేవలు చేయించుకోవడం మిస్సయ్యానో ‘ 

అని ఓ సారి నిట్టూర్చాకా అందరికీ మరి ఫోన్ చేసి చెప్దామా? అని ఉత్సాహం గా ఫోన్ చేతిలోకి తీసుకుని మొదలు పెట్టాను.

.

నాకొచ్చిన సలహాలు..

అసలెందుకు పడ్డావు?

కృష్ణా.. నీకు దూకుడెక్కువ.. ఇంక నెమ్మది గా నడవటం నేర్చుకో..!!! (నేను నడుస్తూ పడలేదే?)

వయసు పెరుగుతున్నప్పుడు ఎముకలు బిరుసు బారిపోయి ఉంటాయి.. జాగ్రత్త గా ఉండాలి.. (ఓకే. అయితే ఈసారి ఆరడుగు ఎత్తు కూడా ఎక్కకుండా జాగ్రత్త గా ఉండాలి..)

పచ్చళ్లూ, పొడులూ తింటావు.. టీ ఎక్కువ గా తాగుతావు. తగ్గించేసి, కాల్షియం ఎక్కువ ఉన్న కూరలూ, పళ్లూ తినాలి.అయినా కాస్త డయట్ చేయి.. (అలాగే.. అన్నీ తగ్గించేస్తా...)

తిండి లో కాల్షియం సరిపోదు. కాల్షియం టాబ్లెట్లు తీసుకోవా నువ్వు? (డాక్టర్ ని అడిగినా అక్కర్లేదన్నాడు.. మరి..మళ్లీ అడిగి చూస్తా)

మొన్న ధనుర్మాసం లొ సరిగ్గా గోదాదేవి వ్రతం చేసావా? అంటే ఏమన్నావు.. నాకు ఆసక్తి ఉండదు.. ఉన్నా సమయం ఉండదు.. అని..చూశావా ఇప్పుడేమయిందో? (మరి తమరు.. యదావిధి గా అన్ని పూజలూ చేస్తూ వస్తున్నారు.. మరి మీకు ఏ కష్టమూ రావటం లేదా?’)

నరుడి దృష్టికి నల్ల రాయైనా పగులుతుందంటారు.. మరి ఊర్కే,.. ఫేసు బుక్కు లో ఫొటోలు పెడతావు.. నేనింత గొప్ప, నాకిన్నున్నాయి.. అని తమకీ కొట్టుకుంటూ తిరుగుతావు. ఫలితం చూడు.. (నేను..ఆఫీసు లో మరి performance reviews లో తప్ప ప్రగల్భాలు అంత చెప్పుకున్నట్టు లేదే?)

ఇల్లు క్లీన్ గా ఉంచుకోవాలి. ఎప్పుడూ ఆఫీసూ, ఆఫీసూ అని పరిగెత్తకూడదు. అందుకే నేను ఒకటికి రెండు సార్లు శుభ్రం గా కడుగుతాను. ఎక్కడి వస్తువులక్కడ పెట్టుకోవాలి. నేల జిడ్డు గా ఉంటే అంతే.. (హ్మ్. ఈ ముక్క మా మానేజర్ గారికి వినపడాలి. ఖంగు తింటాడు..ఆయనేమో..ఇల్లూ, ఇల్లూ అని పరిగెడతానని ఒకపక్క సాధిస్తుంటేనూ...నేను జిడ్డు గా ఉన్న నేల మీద జారి పడ్డానని ఎవరన్నారబ్బా?)

నడవాలా వద్దా?

ఇదిగో.. నడవకు.. ఒక చోట ఉండు.. లేకపోతే జీవితాంతం నొప్పి వెంటాడుతూనే ఉంటుంది.. (మరి డాక్టర్ గారు.. నడువు అని చెప్పారే)

ఇదిగో.. ఒకేచోట జడ్డిగా కూర్చుండిపోకు.. ఎప్పుడు చూసినా కూర్చునే కనిపిస్తున్నావు.. కండరాలు బిగదీసుకుపోతాయి. అలాగే రక్త ప్రసరణ ఆగిపోతుంది. కాస్త పనులు చేసుకుంటూ ఉంటే మంచిది. (అవునా. పొద్దున్న వంట, చేస్తున్నాను. ఒక ఫ్రాక్చర్ అయిన కాలు బయట పెట్టి మంచి కాలుని లోపల పెట్టి నుంచుని పిల్లలకి తలంట్లు పోస్తుంటే? సాధ్యమైనంత వరకూ యోగా..లాంటివి చేసి అప్పర్ బాడీ ఎక్సర్సైజులు చేస్తూ.. మనసు, శరీరం కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే..? ఎలాగూ కూర్చునే ఉంటాను.. అని ఆఫీసు పని చేసుకుంటుంటే? వడియాలు,కంది పొడి, ఆవకాయలు ఖాళీ గానే ఉన్నాను కదా.. అని పెట్టుకుంటే?, మహా భారతం మరోసారి చదువుకుని కొత్త బ్లాగు కూడా మొదలు పెడితేనూ.. )

ఇదిగో కాస్త లీన్ గా ఉన్నవాళ్లకయితే త్వరగా తగ్గుతుంది.మరి బల్కీ గా ఉన్నవారి బరువంతా చిన్న పాదం మీద పడటం తో మీకు నడకకి ఉన్న ఇబ్బంది ని నేనర్థం చేసుకోగలను.. (నేను—కన్నీరు తుడుచుకుంటూ.. నన్నర్థం చేసుకునేవారు ఇన్నాళ్లకి దొరికారు..) అయినా నడిచి తీరాలి.. (ఈయన కోసమైనా నడవాలి నేను...)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!